ఒక శివభక్తుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న స్వయంభువు లింగాన్ని పూజించి ఒక రాత్రి నిద్రించగా ఆ రాత్రి కలలో ఇది మాములు క్షేత్రం కాదని దేవతలకి నిలయం అని గ్రహించి తన మదిలో ఉన్న ఎప్పటినుండి ఉన్న నవబ్రహామేశ్వరాలయాలు నిర్మించాలనే సంకల్పాన్ని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ అధ్బుతమైన నవ బ్రహ్మేశ్వరాలయాలు నిర్మించాడు. మరి ఆ శివభక్తుడు ఎవరు? దేవతలకి నిలయమైన ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, సిద్దవటం గ్రామంలో అతి పురాతనమైన సిద్దేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ సిద్దేశ్వరస్వామి స్వయంభువు లింగం. అయితే ఇక్కడ కొలువై ఉన్న ఈ స్వామిని సిద్దులు పూజించడం వలన ఈ స్వామి సిద్దేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచాడు. అందుకే ఈ ప్రాంతానికి కూడా సిద్దేశ్వరం అనే పేరు వచ్చినది అని చెబుతారు.
దాదాపుగా క్రీస్తుశకము 658 వ సంవత్సరంలో చాళుక్య వంశీయుడు మొదటి విక్రమాదిత్యుడు ఉండేవాడు. ఈయన ఒక గొప్ప శివభక్తుడు. ఈయన దక్షిదేశ తీర్థయాత్రలకు బయలుదేరి సిద్దవటం చేరి సిద్ధులచే పూజించబడిన స్వయంభువు శివలింగమైన సిద్దేశ్వరస్వామిని పూజించి ఆ రాత్రి అచట బస చేసాడు. ఆ రాత్రి అయన స్వప్నంలో తాను నిద్రించిన స్థలం గొప్ప ప్రశస్తమైనదిగా, అది దేవతలకి నిలయంగా కన్పించి అంతరార్థమైనది.
ఇక నిద్రలో నుండి మేల్కొన్న ఆ రాజు ఇంతటి పవిత్రమైన స్థలంలో తనకి ఎప్పటి నుండో మనసులో నవ బ్రహ్మేశ్వరాలయాలు నిర్మించాలనే సంకల్పాన్ని ఇక్కడే నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. ఈవిధంగా ఇక్కడ నవ బ్రహ్మేశ్వరాలయాలు నిర్మించబడ్డాయి.
నవ బ్రహ్మేశ్వరాలయాలు వరుసగా బాలబ్రహ్మెశ్వరాలయం, కుమార బ్రహ్మెశ్వరాలయం, అర్కబ్రహ్మెశ్వరాలయం, వీరబ్రహ్మేశ్వరాలయం, తారక బ్రహ్మేశ్వరాలయం, గరుడ బ్రహ్మేశ్వరాలయం, స్వర్గ బ్రహ్మేశ్వరాలయం, విశ్వ బ్రహ్మేశ్వరాలయం, పద్మ బ్రహ్మేశ్వరాలయాలు. ఈ ఆలయాల యొక్క వాస్తు విధానం బాదామి చాళుక్యుల నాటి హిందూ సాంప్రదాయ వాస్తుకు చెందినది.
ఈ తొమ్మిది ఆలయాలలో ప్రధాన దైవం శివలింగాలు. ఇవి అన్ని కూడా నల్లని స్పటిక లింగాలు. ఇక్కడ అధిష్టాన దైవం బాలబ్రహ్మేశ్వరుడు. ఈ ఆలయాల గర్భగుడి నలుచదరముగాను, మధ్యలో బలమైన పీఠంపై శివలింగం ప్రతిష్టింపబడి ఉంది. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.
ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో, శివరాత్రి రోజున సిద్దేశ్వరస్వామి వారికీ, నవ బ్రహ్మేశ్వరాలయాలలో ఉన్న శివలింగాలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న రంగనాయకుల స్వామివారికి జేష్ఠ శుద్ధి పూర్ణిమనాడు అతి వైభవంగా గరుడోత్సవం జరుపుతారు. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శిస్తారు.