జలంధరుడు అనే రాక్షసుడిని శివుడు ఈ ప్రాంతంలోనే సంహరించాడని, ఆ రాక్షసుడు మరణిస్తూ త్రిమూర్తులను నుండి ఒక వరాన్ని పొందాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఆ రాక్షసుడు ఏ వరాన్ని పొందాడు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడాలో వజ్రేశ్వరీదేవి ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. అయితే ఇక్కడి భక్తులు కొందరు అమ్మవారిని వజ్రతార అని మరికొందరు విజయేశ్వరి అని పిలుస్తుంటారు. ఇక్కడ ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారో ఆదారాలనేవి లేవు కానీ ఈ ఆలయంలో 7 మరియు 8 శతాబ్దాల నాటి శిలాశాసనాలు కొన్ని లభించాయి. ఇక్కడ ఉన్న అమ్మవారి శక్తి ఆరు చక్రాల ద్వారా విశిధం అవుతుంది. అయితే ఆ ఆరు చక్రాలు ఏంటంటే ఆజ్ఞాచక్ర, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్ఠాన, మూలాధార చక్రములు.
ఈ ఆలయానికి గల స్థల పురాణం చూసుకుంటే, పూర్వము ఒకప్పుడు జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప దైవ భక్తిపరుడు. అయన ఒకసారి గొప్ప తపస్సు చేసి, బ్రహ్మదేవుడిని మెప్పించి అనేక వరములను పొందుతాడు. ఆ వరప్రభావం చేత మూడు లోకాలని జయిస్తాడు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా వెళ్లి త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో శివుడు వెళ్లి జలందరునితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా శివుడు జలంధరుని సంహరించలేకపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివునితో జలంధరుని భార్య వృంద మహాపతివ్రత అనీ, ఆమె పాతివ్రత్య మహిమ జలందరుడిని కాపాడుతుందని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి జలంధరుని రూపం ధరించి, వృంద దగ్గరికి వెళ్లగా, అతడే జలందరుడిగా భావించి ఆహ్వానించింది. ఆవిధంగా వృంద యొక్క పాతివ్రత్యం భగ్నం అవ్వగా అప్పుడు శివుడు తన శూలంతో జలందరుడిని సంహరిస్తాడు.
చనిపోయేముందు జలంధరుడు, త్రిమూర్తులకు నమస్కరించి ఒక వరాన్ని అడుగుతాడు. తాను చనిపోయిన తరువాత ఈ ప్రదేశం తన పేరు మీదుగా ప్రసిద్ధి చెందాలని, ఈ ప్రదేశంలో సర్వదేవతలు,సర్వ తీర్థములు ఉండాలనీ వాటి దర్శనానికి వచ్చే భక్తుల పాదముద్రలు తన శరీరం మీద పడితే అదే తనకి మోక్షం అనీ కోరుకుంటాడు. దానికి త్రిమూర్తులు అలాగేనని వరాన్ని ఇస్తారు. ఆలా సంహరించిన జలంధరుని శరీరం ఈ ప్రదేశంలో లోని లోయలో పన్నెండు యోజనాల దూరం పరుచుకొని ఉండగా, ఈ ప్రాంతంలో మొత్తం 64 పుణ్యక్షేత్రాలు,ఎన్నో పుణ్యతీర్దాలు ఉన్నాయని స్థల పురాణం తెలియచేస్తుంది.
జలంధరుని శరీర భాగం వజ్రం వలే కఠినంగా అయిపోయిందని, అందువల్ల ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి పేరు వజ్రేశ్వరీదేవిగా పిలువబడుతుంది పురాణ కథ. ఇక్కడి వజ్రేశ్వరి అమ్మవారిని ‘త్రిపుర సుందరి’ గా వ్యవహరిస్తూ అర్చన చేస్తారు. వజ్రేశ్వరి అమ్మవారి పక్కన ఒక త్రిశూలం అతి ప్రాచీన కాలం నుండి ఉంటుంది. ఎవరు అయినా స్త్రీ ప్రసవం కాక ఇబ్బంది పడుతుంటే, ఆ త్రిశూలం మీద నుండి నీరు పోసి క్రింద నుంచి ఒక పాత్రలో నీరు పట్టుకొని వాటిని ఆ స్త్రీ చేత తాగిస్తే ఆమెకి సుఖ ప్రసవం అవుతుందని అలాగే మరణావస్థలో ఉండే వారికీ ఈ నీటిని తాగించడం వలన వారు పుణ్యలోక ప్రాప్తి పొందుతారని ఇక్కడి వారి విశ్వాసం.
ఈ విధంగా జలందురుడిని సంహరించిన తరువాత ఇక్కడ ఉన్న కాంగడా ప్రాంతం గొప్ప పుణ్యస్థలంగా భక్తులని అలరిస్తుంది.