దేశంలో ఎన్నో గొప్ప శైవ క్షేత్రాలు ఉన్నాయి. అలంటి క్షేత్రాల్లో ప్రసిదిచెందిన దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడి ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే శివలింగం ఇప్పచెట్టు నుండి లింగ రూపంలో ఉత్భవించి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఇలాంటి విశేషాలు ఈ ఆలయంలో ఏవి ఏవి ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళానికి వాయువ్య దిశలో, సుమారు 46 కి.మీ. దూరంలో పవిత్ర వంశధార నది తీరంలో ఉన్న శ్రీముఖలింగం అనే గ్రామంలో శ్రీ ముఖలింగేశ్వరాలయం కలదు. ఇది చాల ప్రాచీనమైన ఆలయం. ఈ క్షేత్రంలో ఉన్న అష్టతీర్థాలను అశ్విని దేవతలు ఏర్పాటు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ శివలింగాలను దర్శించి శ్రీ ముఖలింగేశ్వరుని ముఖం చూస్తే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి ఇక్కడ కొలువైన మధుకేశ్వరుడుని దర్శించుకుంటారని చెబుతుంటారు.
ఇక క్షేత్ర పురాణానికి వస్తే, ఇక్కడ శ్రీ ముఖలింగేశ్వరాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం నందు ఉన్న శివలింగం రాతి శివలింగం కాదు. ఇప్పచెట్టు మొదలును నరికివేయగా అదే శ్రీ ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి తగిలి శివలింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టుని సంస్కృతంలో మధుకం అంటారు. అందువల్ల ఈ ఆలయాన్ని మధుకేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తారు.
ఈ ఆలయంలో గర్భాలయంలో ఉన్న శివలింగం కాకా, ఎనిమిది వైపులా ఎనిమిది శివలింగాలున్నాయి. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్యవిగ్రహాలు ఉన్నాయి. ఇంకా అష్టతీర్థాలు అష్టదిక్కులు కొలువైన దేవతలు శ్రీముఖలింగంలో జరగనున్న రాజమహాయోగానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి ఆయా దేవతలను దర్శించుకోవడంతోపాటు ప్రధాన దేవాలయంలో ముఖలింగేశ్వరుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. ఇక్కడ దీర్ఘరోగాలు పటాపంచలైపోతాయి. కోరిన కోర్కెలు తీరి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మాన సిక రోగాలు, పిచ్చి, రుణబాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా పితృదేవతలకు పిండ ప్రదానాలు, దానధర్మాలు చేయడం, తిల తర్పణ కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం.
సాధారణంగా పుణ్యనదులైన గంగ, కృష్ణ, గోదావరి, పెన్న, కావేరి నదులకు గురుగ్రహం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కుంభం తదితర రాశుల్లో ప్రవేశిస్తే నదులకు 12 సంవత్సరాలకు పుష్కరాలు వస్తాయి. అప్పుడు భక్తులు పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండప్రదానాలు నిర్వహిస్తారు. కాని శ్రీముఖలింగంలో జరగనున్న అష్టతీర్థాలకు అష్టమి, స్వాతి నక్షత్రంతో కూడిన పౌర్ణమి, సోమవారం, శ్రవణం నక్షత్రంతో ఒకే విధంగా ఉండాలి. ఇలా అరుదుగా సంభవిస్తాయి. ఇలా గతంలో 1946, 2000 సంవత్సరాల్లో వచ్చినట్లు ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది.
ఈవిధంగా ఇప్పచెట్టు నుండి శివలింగం ఏర్పడి శ్రీ ముఖలింగేశ్వరాలయం భక్తులకి ముక్తిని ప్రసాదిస్తుంది.