Here’s Why K Vishwanath Garu Is The Greatest Director Tollywood Has Ever Had

ఒక మూగవాడు ఓ నాట్యకారిణిని ప్రేమిస్తాడు అనే కాన్సెప్ట్ ను సాధారణంగా అయితే.. ఒక ఆర్ట్ ఫిలిమ్ తరహాలో తీసేస్తారు. కానీ ఆ నావెల్ కాన్సెప్ట్ కి కూడా కమర్షియల్ అంశాలను జోడించడం కేవలం కె.విశ్వనాధ్ కి మాత్రమే సాధ్యం అంటే అతిశయోక్తి అనుకోవచ్చు. కానీ.. ఓ 50 ఏళ్ల వృద్ధుడిని కథానాయకుడిగా పెట్టుకొని ఒక్క ఫైట్, ఒక ఐటెమ్ సాంగ్, ఒక్క గ్లామర్ ఎపిసోడ్ కూడా లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టగల సత్తా ఉన్న దర్శకుడు కేవలం కె.విశ్వనాధ్ అంటే మాత్రం ఎవ్వరైనా నమ్మాల్సిందే.

1979లో విడుదలై ఏడాది పాటు థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడిన “శంకరాభరణం” అందుకు అద్భుతమైన ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూపోతే కె.విశ్వనాధ్ తెరకెక్కించిన ప్రతి చిత్రమూ ఓ ఆణిముత్యమే. అందుకే.. ఆయన్ను భారత ప్రభుత్వము అత్యంత ఉత్తమైన పద్మశ్రీతో సత్కరిస్తే.. ప్రజలు ఆయన్ను కళాతపస్వి అని ముద్దు పేరు పెట్టుకొని గౌరవించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన తెరకెక్కించిన కొన్ని చిత్రాలు ఎందుకు గొప్పవో, ఎందుకని నేటితరం ఆ సినిమాలను తప్పకుండా చూడడమే కాక.. భవిష్యత్ తరాలకు చూపించాలో తెలుసుకొందాం..!!

సుడిగుండాలు (1968)

1-Sudigundalu

ఇప్పుడంటే కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలైన “పింక్, జాలీ ఎల్.ఎల్.బి” చూసి తెలుగులో ఈ తరహా సినిమాలు ఎందుకు రావు అని మన తెలుగు ప్రేక్షకులు నీలుగుతారు కానీ.. ఎప్పుడో 1968లోనే ఒక పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా తెరకెక్కించిన ఘనత విశ్వనాధ్ సొంతం. నాగేశ్వర్రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్ర కథాంశాన్ని ఇప్పటికీ చాలా థ్రిల్లర్స్ ఎగ్జిక్యూషన్ కోసం బేస్ ఫార్మ్ గా తీసుకోవడం అనేది గర్వకారణం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా దక్కడం విశేషం.

నేరము-శిక్ష (1973)

2-Neramu shiksha

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ అవ్వలేకపోయింది కానీ.. ఆంగ్ల నవల క్రైమ్ & పనిష్మెంట్ కు అడాప్షన్ తెరకెక్కిన ఈ చిత్రం చూసి మనం చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా కొన్ని కుటుంబాలు ఎలా నష్టపోతాయి అనేది చాలా హృద్యంగా చూపించారు కె.విశ్వనాధ్.

ఓ సీత కథ (1974)

3-O seetha katha

ఈ చిత్ర కథాంశం అప్పట్లో ఓ సంచలనం. తాను ప్రేమించిన ఓ అమ్మాయి తనకు దక్కలేదనే కోపంతో.. ఆమె ప్రేమిస్తున్న వాడిని చంపిస్తాడు విలన్. తాను ప్రేమించినవాడి హఠాన్మరణానికి కారకుడైనవాడికి బుద్ది వచ్చేలా చేయాలనే ధ్యేయంతో.. ఆ అమ్మాయి విలన్ తండ్రిని పెళ్లి చేసుకుంటుంది. వినడానికే చాలా కఠినంగా ఉన్న ఈ చిత్రాన్ని విశ్వనాధ్ అత్యద్భుతంగా తెరకెక్కించాడు. తాను కోరుకున్న అమ్మాయి.. తనకు తల్లిగా ఇంటికి వచ్చినప్పుడు ఆ విలన్ పడే వ్యధను తెరకెక్కించిన విధానం ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

సిరిసిరి మువ్వ (1976)

4-Siri siri muvva

తోటరాముడు తర్వాత యువతను ఆస్థాయిలో ఇన్స్పైర్ చేసిన చిత్రమిది. అందుకు కారణం హీరో చంద్రమోహన్ పాత్రను కె.విశ్వనాధ్ తీర్చిదిద్దిన విధానమే. మూగమ్మాయిగా జయప్రద పాత్ర, ఆమెను అభిమానించే ఓ యువకుడు సాంబయ్యగా చంద్రమోహన్ నటన ఇప్పటికీ, ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి, కనిపిస్తాయి. ఈ చిత్రానికి వేటూరి సుందరామ్మూర్తి రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణ.

సీతామాలక్ష్మి (1978)

5-Seethamahalakshmi

సినిమా ఇండస్ట్రీలోని లొసుగులను, కష్టాలను మొదటిసారి ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. హీరోయిన్ అవ్వాలనుకున్న ఓ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు.. అందుకు తోడ్పడిన నిస్వార్ధ ప్రేమికుడు. ప్రేమ కోసం కెరీర్ ను త్యాగం చేసిన ఓ అమ్మాయి. ఇలా చాలా హృద్యమైన అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

శంకరాభరణం (1980)

6-shankara baranam

ఓ స్వచ్చమైన బ్రాహ్మణుడ్ని.. ఓ వేశ్య కుటుంబానికి చెందిన మహిళ ఇష్టపడడమా? సినిమా కథను కె.విశ్వనాధ్ చెబుతున్నప్పుడు నిర్మాత ఏడిద నాగేశ్వర్రావు కూడా ఇలాగే నోరు ఆశ్చర్యపోయారు. కానీ.. ఆ కథకు సంగీతాన్ని జోడించి అత్యద్భుతంగా తెరకెక్కించడమే కాదు.. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. సోమయాజులు అనే ఓ సాధారణ నటుడ్ని.. ఫిలిమ్ ఫేర్ అవార్డ్ అందుకునేలా చేసిన ఘనత విశ్వనాధ్ ది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి ఎమోషన్ ఇప్పటికీ మనసుకు హత్తుకుమ్టాయంటే.. ఒక దర్శకుడీగా విశ్వనాధ్ ఎంతటి ముందుచూపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారో అర్ధం చేసుకోవచ్చు.

శుభలేఖ (1982)

7-shubalekha

అప్పటికి నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న చాలామంది యువతకు ఓ మార్గం చూపించిన సినిమా ఇది. టాలెంట్ ఉండాలే కానీ ఎలాంటి ఉద్యోగమైనా చేయొచ్చు అని చిరంజీవి పాత్ర ద్వారా తెలియజేశాడు విశ్వనాధ్. అలాగే.. స్వచ్చమైన ప్రేమ ముందు కులం, జాతి, ఐశ్వర్యం అనేవి అడ్డంకి కాదని మరోసారి తెలియజేశారు. ఈ చిత్రంలో చిరంజీవి నటనకు ఫిలిమ్ ఫేర్ అవార్డ్ రావడం విశేషం. అలాగే.. అప్పటివరకూ సుధాకర్ గా పిలవబడిన నటుడు సుధాకర్.. సినిమా విడుదలయ్యాక “శుభలేఖ”ను ఆయన ఇంటిపేరుగా మార్చుకుని శుభలేఖ సుధాకర్ అయ్యాడు.

సాగర సంగమం (1983)

8-sagara sangamam

కె.విశ్వనాధ్ కీర్తిని నలుదిశల వ్యాపింపజేసిన సినిమా ఇది. ఓ కళాకారుడి బాధను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఇది. నాట్యకారుడిగా కమల్ హాసన్ నటన నభూతో నభవిష్యత్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే.. స్వయంగా కమల్ హాసన్ కూడా ఇప్పుడు ఆ సన్నివేశాలను రీక్రియేట్ చేయమన్నా కూడా తడబడతాడేమో. కళాకారుడికి తన కళ మీద ఉండే ప్రేమ, అభిమానాన్ని ఈ చిత్రంలో చూపించినంత హృద్యంగా మరో చిత్రంలో ఇప్పటివరకూ చూపించలేదు. ఈ తరహా చిత్రంలోనూ ఓ అద్భుతమైన ప్రేమకథను ఇనుమడించిన విధానం హర్షణీయం. అందుకే.. తెలుగు సినిమా క్లాసిక్స్ లో “సాగర సంగమం” మొదటి వరుసలో నిలుస్తుంది.

స్వాతిముత్యం (1986)

9-swathi muthyam

మన సమాజంలో ఓ ఒంటరి మహిళ ఎదుర్కొనే ఇబ్బందులను ఎలాంటి బెరుకు లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. అలాంటి భర్త చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళకు, ఆమె బిడ్డకు అండగా ఓ అమాయకుడు నిలిస్తే ఎలా ఉంటుంది అనే ఊహకు చిత్రరూపమే “స్వాతిముత్యం”. ఈ చిత్రంలో కమల్ హాసన్ కంటే రాధిక నటిగా ఎక్కువ మార్కులు కొట్టేయడం అనేది గమనార్హం. ఇంత సీరియస్ సబ్జెట్ లోనూ విశ్వనాధ్ కామెడీని చాలా సహజంగా జోడించిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందుకే నేషనల్ అవార్డ్ వచ్చింది.

సిరివెన్నెల (1986)

10-Siri vennala

గేయ రచయిత సీతారామశాస్త్రిని “సిరివెన్నెల సీతారామశాస్త్రి”గా మార్చిన చిత్రమిది. హీరో అంధుడు, అతడ్ని ఇష్టపడే అమ్మాయి మూగ. వీరిద్ధరీ ప్రేమకు మధ్యలో ఓ గైడ్. ఒక అద్భుతమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. సినిమా ఎండింగ్ చూసి కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడు.

శ్రుతిలయలు (1987)

11-sruthilayalu

మన మూలాలను ఎప్పటికీ మరువకూడదు అనే బేసిక్ లైన్ తో తెరకెక్కిన అద్భుతమైన చిత్రమిది. అప్పటివరకూ యాంగ్రీ యంగ్ మేన్ గా జనాలని అలరిస్తున్న రాజశేఖర్ సాఫ్ట్ రోల్స్ కూడా ప్లే చేయగలడు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది. సుమలత పాత్రను అంత సహజంగా ఎలా రాయగలిగారో తెలియదు కానీ.. ఉమెన్ ఎంపవర్ మెంట్ కు సరైన ఉదాహరణ ఆమె పాత్ర.

స్వయంకృషి (1987)

12-Swayamkrushi

అప్పటికే “కిరాతకుడు, కొండవీటిరాజా, వేట, చంటబ్బాయి, పసివాడి ప్రాణం” లాంటి సినిమాల్లో నటించి సూపర్ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాక మెగాస్టార్ గానూ చిరంజీవి ఎదుగుతున్న తరుణమది. ఆ తరుణంలో చెప్పులు కుట్టేవాడిగా నటించమని అడిగితే.. ఇప్పటి నటులైతే ఇమేజ్ కి ప్రోబ్లమ్ అనీ, ఫ్యాన్స్ కు నచ్చదనీ ఏదేదో కారణాలు చెప్పి తప్పుకొనేవారు కాదేమో. కానీ.. చిరంజీవి రిస్క్ చేసి మరీ నటించిన చిత్రమిది. ఒక చెప్పులు కుట్టేవాడు స్వయంకృషితో అందలాన్ని అధిరోహించిన విధానమే కథాంశం. అలాగే.. పిల్లలకి బాధ్యత తెలియకుండా పెంచడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది కూడా ఈ చిత్రంలో చూపించారు విశ్వనాధ్.

స్వర్ణకమలం (1988)

13-Swarnakamalam

కళను బ్రతికించడం, ఆ కళ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడం అనేది ఎంత అవసరం అనేది విశ్వనాధ్ ఈ చిత్రంతో తెలియజేశారు. అది కూడా కామెడీని, ఎమోషన్ ను సమపాళ్లలో జోడించి తెరకెక్కించారు. వెంకటేష్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ కంటే భానుప్రియ లౌక్యంతో చేసే పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

సూత్రధారులు (1989)

14-Suthradharulu

ఈ సినిమా అప్పట్లో హిట్ అయ్యిందో లేదో తెలియదు కానీ.. ఈ సినిమాను ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడల్లా మాత్రం ఈ సినిమా ఇప్పుడు వస్తే బాగుంటుంది. కనీసం ఎవరైనా ఇప్పుడు రీమేక్ చేసినా బాగుండు అనిపిస్తుంది. అంతటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా “సూత్రధారులు”.

ఆపద్భాంధవుడు (1992)

15-apadbandhavudu

చిరంజీవి తన మాస్ ఇమేజ్ లోనుంచి మరోసారి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఒక నిశ్వార్ధమైన వ్యక్తి తన అనుకున్నవాళ్ల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు అని చూపించిన సినిమా ఇది. చిరంజీవి నటన, మెంటల్ హాస్పిటల్ ఎపిసోడ్స్ సినిమాకి ప్రాణమైతే.. కీరవాణి సంగీతం సినిమాకి ఆయువుపట్టు.

స్వాతి కిరణం (1992)

16-Swathikirnam

కళకి కావాల్సింది కరుణ కానీ.. ఈర్ధ్య కాదు అని చెప్పిన చిత్రం “స్వాతి కిరణం”. ఓ తక్కువ జాతి యువకుడికి సంగీతం నేర్పిస్తాడు ఓ సంగీత సామ్రాట్. కానీ.. ఆ యువకుడు తనకంటే అద్భుతంగా పాడుతున్నాడని ఈర్ష్యపడి అతడి మరణానికి కారణమవుతాడు. ఆ బాధతో నిరాశ్యుడైన ఆ సంగీత సామ్రాట్ జీవితం ఎలా ముగిసింది అనేది చిత్ర కథాంశం. అప్పట్లో ఈ సినిమా కథ ఓ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు అతడి శిష్యుడు నడుమ జరిగిన ప్రపంచానికి తెలియని యుద్ధం నుంచి స్పూర్తిపొంది విశ్వనాధ్ రాసుకొన్నారని టాక్ వచ్చిందనుకోండి. ఈ చిత్రానికి మమ్ముట్టి నటన, ఆయన స్వంత డబ్బింగ్ హైలైట్.

శుభ సంకల్పం (1995)

17-subhasankalpam

తనకి అత్యంత ఇష్టమైన బాలసుబ్రమణ్యం కోసం విశ్వనాధ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో విశ్వనాధ్ నటుడిగానూ ప్రేక్షకలోకాన్ని పలకరించడం విశేషం. అప్పుడప్పుడే సమాజంలో పాతుకుపోతున్న కుల, మత బేధాలను, వర్గ రాజకీయాలను ఎంతో నేరుతో తెరకెక్కించారు విశ్వనాధ్. ఆమని నటన, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. ఈ చిత్రంతోనే విశ్వనాధ్ దర్శకుడిగా ఆఖరి ఫిలిమ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తన భార్య చనిపోయిన విషయాన్ని విశ్వనాధ్ కు చెప్పడం కోసం కమల్ హాసన్ పడే వేధన చూస్తే ప్రేక్షకుడికి కూడా కళ్ల వెంబడి నీళ్ళు ధారలా కారడం ఖాయం. అంత అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం.

శుభప్రధం (2010)

18-Subhapradam

విశ్వనాధ్ దర్శకుడిగా తెరకెక్కించిన ఆఖరి చిత్రమిది. అల్లరి నరేష్ లోని నటుడ్ని పరిచయం చేసిన చిత్రమిది. సినిమా కథ కాస్త కన్ఫ్యూజ్డ్ గా ఉండడంతో సరిగా ఆడలేదు కానీ.. కొన్ని భావోద్వేగాలను ఆయన తెరపై పండించిన తీరు మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా.. తన భర్త తనతో అబద్ధం చెబుతున్నాడని తెలిసి కూడా మారు మాట్లాడని భార్య మనసులో పడే ఆవేదనను విశ్వనాధ్ తెరకెక్కించిన విధానం అమోఘం.

తన ఐడియాలజీ నేటితరం ప్రేక్షకుల మైండ్ సెట్ కు సూటవ్వదని దర్శకత్వానికి దూరమైన కె.విశ్వనాధ్ తనలోని కళాతృష్ణను తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడూ చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తూ ఉంటారు. ఆయన నటుడిగాను అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన సినిమాలు సమాజానికి స్పూర్తిదాయకం. అందుకే.. తెలుగు సినిమా గర్వించదగిన వ్యక్తుల్లో కె.విశ్వనాధ్ ఒకరిగా నిలిచారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR