శివుడు స్వయంభువుగా వెలసిన  కాకాని మల్లికార్జున క్షేత్రం!! ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..?

ఓంకార స్వరూపుడైన శివుడు నాలుగు యుగాలు, వేదాలుగా ఉంటూ యజ్ఞాన్ని ప్రవర్తింపజేస్తుంటాడు. అంతేకాకుండా, అనంతరూపుడైన శివపరమాత్మ అవసరమైనపుడు అవతరాలను ధరిస్తుంటాడు.  శివుడి అవతారాలలో మల్లికార్జున అవతారం కూడా ఒకటి.
కాకానినాధ కరుణా రస పూర్ణ సింధో
భక్తారి భంజన నిరంజన దేవ బంధు
దేవేంద్ర మౌళిమణి మండిత పాద యుగ్మ
శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే
  • శ్రీరామచంద్రుడు, ఇంకా అనేక పురాణ పురుషులేగాక, శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది.   ఇక్కడవున్న మల్లికార్జునుని, భ్రమరాంబను  శ్రీశైలంలో నెలవైన మల్లికార్జనుడు, భ్రమరాంబల అంశలంటారు.  దీనికి నిదర్శనంగా శ్రీశైల స్ధల పురాణములో శ్రీ మల్లికార్జునుని అంశావతారాలను వివరించేటప్పుడు కాకానియొక్క ప్రశస్తి కూడా చేయబడింది. ప్రాచీన క్షేత్రమంటేనే అనేక గాధలుంటాయికదా.  మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో వున్న కొన్ని గాధలు తెలుసుకుంధాం..
  • ఇంద్రకీలాద్రికి గర్చపురికి (గుంటూరు) మధ్యగల ఒక సుందర వనంలో పూర్వం ఒక సిధ్ధయోగి చాలాకాలం పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.  సిధ్ధయోగి పరమేశ్వరుని ఆ స్ధలమందే వుండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు.  పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభువుగా వెలిశాడు.
  • ఒకసారి పరమేశ్వరుడు కొందరు మునులు వెంటరాగా మంగళాద్రి నుండి ప్రయాణిస్తూ, మంగళాద్రికి గర్తపురికి  మధ్యగల ఒక సుందర వనాన్ని చూసి కొంతకాలం అక్కడ వున్నారు.  అదే ప్రస్తుతం కాకాని.  మునీశ్వరులు ఈశ్వరుని సేవిస్తుండగా స్వామివారు భక్తులను కాపాడుతూ అక్కడ సంతోషంగా ఉన్నారు.  ఆ వనం క్రమంగా ఒక గ్రామముగా ఏర్పడింది.  సిధ్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో, నృత్యగీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలు పొందారు.
  • అందుకే ఈ ప్రదేశానికి సిధ్ధయోగ సమాజమనే పేరుకూడా వుంది.  ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో, నృత్యగీతాలతో స్వామిని సేవించటానికొస్తారు. పరమేశ్వరుడు ఇక్కడే వుండిపోవటం వల్ల భ్రమరాంబిక దిగులుతో స్వామిని వెతకటానికి తన చెలికత్తెలను పంపింది.  వారు ఇక్కడ స్వామిని చూసి దేవి వార్తను తెలియజేశారు.  ఈశ్వరుడు కూడా తన స్ధానానికి చేరుకోవాలని నిర్ణయించుకుని, తన భక్తాగ్రేసరులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడటానికి ఇక్కడ లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడు.
  • తర్వాతకాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్ధాలను సేవిస్తూ ఇక్కడికివచ్చి ఇక్కడవున్న శివలింగాన్నిచూసి పూజలు చేశాడు.  ఈశ్వర సంకల్పంవల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించింది.  వెంటనే అనేక ఋషిపుంగవులను ఆహ్వానించి, యజ్ఞశాలలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. యజ్ఞంలో యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపచేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు.  భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది.
  • యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు. అప్పుడా కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది,  “ఓ మహర్షీ, నేను కాకాసురుడనే రాక్షసుడిని.  బ్రహ్మ ఇచ్చిన వరంచేత దేవతలకిచ్చేటటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు.  నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు?  నీ యజ్ఞం సఫలం కావాలంటే నేనొక ఉపాయం చెబుతాను.  నువ్వు పవిత్ర జలాలతో పవమాన, అఘమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీదజల్లు.  పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపంవల్ల నేనీ రూపంలో వున్నాను.  మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది.  మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది” అని చెప్పింది.
  • భరద్వాజ మహర్షి ఆ విధంగా చెయ్యగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని శ్లాఘించి, మహాశివుని మల్లెపూవులతో పూజించి తన స్వస్ధానానికి వెళ్ళిపోయాడు.  మల్లెపూవులతో పూజింపబడటం చేతకూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్ధిరపడింది.  ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది.  తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటనుంచీ వున్న ఈ ప్రాంతం పెదకాకానిగా, విస్తరింపబడినప్రాంతం చినకాకానిగా పిలువబడుతున్నాయి.
  • శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటి పత్రి పూజ చేశాడని చెబుతారు. ఈ క్షేత్రంగురించి ఇంకొక కధ పార్వతీ పరమేశ్వరులు గగనయానం చేస్తూ కాకాని క్షేత్రం దర్శించారు.  ఇక్కడ మహాభక్తుడైన కాకాసురుడు మొదట గోమయలింగం ప్రతిష్టించి, పూజించి, తరించినచోటుగా గ్రహించి, ఆ చోటునాకర్షించి ప్రజలను రక్షించటానికి ఆ లింగమునందావిర్భూతుడై వున్నట్లుగా చెప్పబడుతుంది.
  • అగస్త్య మహర్షి తన దక్షిణదేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి, గర్చపురికి శిష్యులతోసహా కాలినడకన వెళ్తూ దారిలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు.  స్వామిని సేవించిన తర్వాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమయింది.  ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునులతోపాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై వున్నాడు.  అందకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటం, నాగ ప్రతిష్ట చెయ్యటం వగైరాలు ఇక్కడ చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR