కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. చార్ ధామ్ అనబడే నాలుగు క్షేత్రాలలో కేదార్ నాథ్ ఒకటి. కేదార్ నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. మరి కేదార్ నాథ్ వెళ్ళినవారు అక్కడ దగ్గరలో చూడవలసిన కొన్ని ఆలయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1.ఈశానేశ్వర్ మహాదేవ్:కేదారేశ్వర్ ఆలయం బయట ఆవరణలోనే ఈశా నేశ్వర్ మహాదేవ్ స్వామివారి చిన్న ఆలయం ఉంది. అయితే భక్తులు కేదార్ నాథ్ ను దర్శించిన తరువాత ఈశానేశ్వర్ ఆలయాన్ని దర్శిస్తారు.
2.ఆదిశంకరాచార్యుని సమాధి:
శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి వెనుకవైపున సుమారు 100 మీటర్ల దూరంలో ఒక రేకుల షెడ్ ఉంది. దీనినే శ్రీ శంకరాచార్య సమాధి అంటారు. ఈ షెడ్డు చెక్క స్తంభాలతో నిర్మించబడింది. ఇక్కడే లోపల ఆదిశంకరాచార్యుల వారి విగ్రహమూర్తి ఉన్నది. అయితే శంకరాచార్యుల వారు కేదార్ నాథ్ లోని ఒక గుహలోకి వెళ్లి కనిపించకుండా అదృశ్యమైనారని కొందరంటారు. అయన కంచిలో సమాధి చెందారని మరికొందరు అంటారు. పురాణాల ప్రకారం అతడు బదరీనాథ్ యొక్క జ్యోతిమఠ్ ఆశ్రమం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, చివరగా కేదార్నాథ్ పర్వతాలకి వెళ్లారు. ఇది ఇలా ఉంటె ఈ ప్రాంతంలో వేడి నీటి బుగ్గని చూడవచ్చును.
3.అగస్త్వేశ్వర మందిరం:
అగస్తేశ్వర ముని నివాసం అనే ఆలయం కేదార్నాథ్ లోని మందాకిని నది ఒడ్డున 1000 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ ప్రదేశాన్ని అగస్త్యముని నిత్యం ధ్యానం చేసుకున్న ప్రదేశంగా చెబుతారు. ఇచట ఉన్న ఆలయాన్ని స్థానికులు అగస్తేశ్వరా మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో గోడలపైన ప్రసిద్ధ హిందూ దేవతామూర్తులు ఉన్నారు.
4.రేతకుండము:
కేదార్నాథ్ చుట్టుపక్కల ప్రదేశాలలో చాలా కుండాలు ఉన్నాయి. ఈ కుండాలు అన్నింటి లోకి రేత కుండము చాలా ప్రసిద్ధి చెందిన కుండము. ఇది కాకుండా శివకుండము, భృగు కుండము, వహ్ని తీర్థము, హంసతీర్థము అనేవి కూడా ఇచట ఉన్నాయి. ఇవన్నీ కూడా కేదారేశ్వరుని ఆలయానికి దక్షిణంగా, మందాకిని నది ఒడ్డునే ఉన్నాయి.
5.దూద్ గంగ:
కేదారేశ్వరుని ఆలయం వెనుక పక్కాగా సుమారు 2 కి.మీ. దూరంలో అడ్డంగా ఒక కొండల వరుస ఉన్నది. మందాకిని నది ఆ కొండలలో నుండి రెండు ధారలుగా వచ్చి ఆ కొండల క్రింద ప్రాంతంలో కలిసిపోయి ఒకే ప్రవాహంగా ముందుకు సాగుతూ వస్తుంది. ఆలయానికి ముందు, అనగా ఊరు మొదటనే ఉన్న వంతెనకు ఎడమవైపు ఉన్న ఒక కొండమీద నుండి ఒక జలపాత ధార తెల్లని పాలలాగా మెరుస్తూ కిందకు దిగివచ్చి, మందాకిని నదిలో కలిసిపోవడం మనం చూడవచ్చు. దీనిని దూద్ గంగా అంటారు.
6.పంచ పర్వతాలు:
కేదార్నాథ్ ఆలయానికి వెనుకగా సుమారు 2 కి.మీ. దూరంలో అడ్డంగా పరుచుకొని ఉన్న ఒక కొండల వరుస కనిపిస్తూ ఉంటుంది. వంతెన పక్క నుండి మందాకిని నది ఒడ్డునే, ఆ కొండల వరకు ఉన్న మార్గం కూడా చూడవచ్చు. ఆ కొండల వరుసను రుద్ర హిమాలయాలు అని అంటారు. వాటినే సుమేరు పర్వతాలు అని, పంచ పర్వతాలు అని అంటారు. ఇవి వరుసగా రుద్రాహిమాలయం, విష్ణు పురి, బ్రహ్మపురి, ఉద్గారికాంత, స్వర్గా రోహణ అనే పేర్లు కలిగి ఉండటం వలన వీటికి పంచపర్వతాలు అనే పేరు వచ్చినది. పాండవులలో ధర్మరాజు తప్ప, మిగిలిన వారందరు ద్రౌపతితో సహా స్వర్గా రోహణ అనే పర్వతం మీదనే ఒక్కొకరుగా నేలకి ఒరిగారు.
7.బుగ్గ ఆలయం:
శ్రీ కేదారేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత ఆలయానికి ఎదురుగా కుడివైపుగా తిరిగి 2 కి.మీ. దూరం ముందుకు వెళితే ఈ బుగ్గ ఆలయమును దర్శించవచ్చు. ఈ ఆలయాన్ని ఓం నమశ్శివాయ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో స్వామి మూర్తి ఎదురుగా నాలుగు పలకల నీటి కుండం ఉన్నది. ఆ కుండం వైపు వంగి ఓం నమశ్శివాయ అంటే నీటి బుడగలు వస్తాయి.