Home Unknown facts Know About the Greatness & Story Behind ‘Vaikunta Shri Ramudu’ At Bhadrachalam

Know About the Greatness & Story Behind ‘Vaikunta Shri Ramudu’ At Bhadrachalam

0

శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాద్రి. శ్రీరాముడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. గర్భాలయంలో ఉన్న శ్రీరాముని మూలవిరాట్టు, వనవాసంలో ఉన్నప్పుడు వారు ఏర్పరుచుకున్న పర్ణశాల, ఇక్కడే నివసించిన శబరికి రాముడు ఇచ్చిన వరం ఇలా ఎన్నో విశేషాలు కలిగిన మహిమ గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి. మరి శ్రీరాముడు ఎక్కడ లేని విధంగా వైకుంఠ రాముడిగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

bhadrachalamతెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది. భద్రాచలంలోని పవిత్ర నది గోదావరి నది తీరమున సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఇక్కడ విష్ణువే శ్రీ సీతారామచంద్రుడై వెలిసాడు. ఈ ఆలయాన్ని భద్రాద్రి కోదండ రామాలయం అంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం భద్రుడనే భక్తుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం కఠోర తపస్సు చేయగా, విష్ణుమూర్తి ప్రత్యేక్షమై వరం కోరుకోమనగా, నేను కొండగా మారుతాను, నీవు నా పై నివాసం ఉండాలని కోరగా భద్రుడి తపస్సుకి మెచ్చిన శ్రీమహావిష్ణువు శ్రీరాముడు భద్రగిరి పైన కొలువై ఉన్నాడు. ఇక రామావతారంలో అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడు సీతాసమేతుడై భద్రాద్రి కొండపైన ఉన్నాడని పురాణం.

ఈ ఆలయం గర్భగుడిలో సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు. శ్రీ రాముడు వెలసిన మిగతా ఆలయాల్లో రాముడి మూలవిరాట్టు రెండు చేతులతో మానవుని రూపాన్ని పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీ రాముడి విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణంను, ఎడమచేతిలో విల్లును ధరించి విష్ణువు వలె కుడిచేతిలో శంఖం ను, ఎడమచేతిలో చక్రం ని ధరించి ఉంటాడు. అందుకే ఇక్కడ వెలసిన రాముడిని వైకుంఠ రాముడిని, భద్రాద్రిరాముడు అని, చతుర్భుజ రాముడిని, గిరినారాయణుడని భక్తులు కొలుస్తుంటారు.

ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, ఇతర దేవాలయాల్లో సీతమ్మవారు రాముని పక్కన నిలబడి ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామి ఎడమ తొడపై ఆసీనురాలై ఉంటుంది. మూలవిరాట్టులైన శ్రీరాముడు, సీత ఇరువురు ఒకే రాతిలో వెలసి ఉండటం ఇక్కడి విశేషం. అంతేకాకుండా అన్ని రామాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడి వైపు ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎడమవైపున నిలబడి ఉండటం విశేషం.

పూర్వము సీతారాములు అరణ్యవాసంలో ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు శబరి అనే ఒకామె ఈ అడవిలో లభించే పండ్లని వారికీ లేచి స్వయంగా తినిపించిందంటా. దానికి సంతోషించిన శ్రీరాముడు ఆమె పేరు ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా శబరి అనే నది రూపంలో ఇక్కడే ప్రవహిస్తూ ఉండమని వరాన్ని ఇస్తాడు. ఈ నది భద్రాచలానికి సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ప్రవహించే శబరి నది కొంత దూరం ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది.

ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వము భద్రాచలానికి కొంత దూరంలో ఉన్న ఒక గ్రామంలో పోకల దమ్మక్క అనే శ్రీ రాముని భక్తురాలు ఉండేది. ఆమె భక్తికి మెచ్చినా ఆ స్వామి తన కలలో కనిపించి ఒక భక్తుని కోరిక మేరకు నేను ఇక్కడ కొండపైన వెలిసాను అని నను మిగతా భక్తులు కూడా సేవించేలా చేయమని, దానికి నీకు నా పరమ భక్తుడు సహాయం చేస్తాడని చెప్పాడట. ఇలా మరునాడు గ్రామస్థులతో వెళ్లిన ఆమె రాములవారిని గుర్తించి అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేది.

ఆ తరువాత రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్‌దాస్‌ శిష్యుడైన శ్రీ రామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674లో ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు.

ఇలా వసూలు చేసిన పన్ను తానీషాకి ఇవ్వలేకపోవడంతో, తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేసాడని స్థల పురాణం.

ఇక ఈ ఆలయానికి కొన్ని కోలోమీటర్ల దూరంలో పంచవటి అని పిలువబడే గ్రామం ఉంది. ఇక్కడే శ్రీరాముడు నిర్మించి నివసించిన పర్ణశాల ఉంది. ఇక్కడ సీతారాములు అరణ్యవాసంలో సంచరించిన వింతలు విశేషాలు, ఇచట జరిగిన విశేషాలు ఇప్పటికి తెలియచేసి చూపిస్తుంటారు.

ఇలా దేశంలో ప్రముఖ రామాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధి నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణమహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ఈ కన్నుల పండుగని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా అనేక రాష్ట్రాల నుండి భక్తులు కొన్ని లక్షల సంఖ్యల్లో తరలివస్తుంటారు.

Exit mobile version