దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో వల్లూరమ్మ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఇక్కడ జరిగిన ఒక యాగం తో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది అని చెబుతారు. మరి కోరిన వరాలను ఇచ్చే ఈ చల్లని తల్లి వెలసిన ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, వల్లూరు గ్రామంలో వల్లూరమ్మ ఆలయం ఉంది. మూడు వందల సంవత్సరాల క్రితం హోమ గుండం నుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామనామంతో వల్లూరమ్మగా విఖ్యాతిపొంది, భక్తుల పూజలందుకుంటూ, ప్రజలను, పశుసంపదను వ్యాధిబాధల నుండి, దుష్టశక్తుల నుండి కాపాడే చల్లనితల్లిగా విరాజిల్లుతోంది. వల్లూరమ్మ, జ్వాలాముఖి అమ్మవార్లిరువురూ బరూరు నరసింహ యోగీంద్రులనే సిద్ధుడి మంత్రప్రభావంతో హోమగుండం నుంచి 300 సంవత్సరాల క్రితం ఆవిర్భవించారని ఆసక్తిదాయక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అమ్మవార్ల పేర్ల మీదుగా వల్లూరమ్మ, వల్లూరయ్య అని, జాలమ్మ, జాలయ్య అనీ ఈ ప్రాంతంలో పిల్లలకు పేర్లు పెట్టడం సంప్రదాయం. వల్లూరమ్మ ఆలయం తరువాతి కాలంలో కొంత శిథిలావస్థకు చేరి నిరాదరణకు గురైంది. 1984 జూన్ 24నుండి 29 వరకు ఆలయ ఆవరణలో శత చండీయాగాన్ని నిర్వహించారు. ఈ యాగం నిర్వహణతో ఆలయం దశ తిరిగింది. 1995లో మరోసారి చండీ యాగం జరిగింది. 1993లో ఆలయ జీర్ణోద్ధరణ, కుంభాభిషేకం, అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, విమాన గోపుర నిర్మాణం, ముఖ మండప నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, సింహద్వార నిర్మాణం జరిగాయి. అనంతరం ఆలయంలో పరివార దేవతలుగా గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ పలువురు భక్తుల, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసింది. దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంగా 16 విగ్రహాలను, శిల్పాలను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్ములతోపాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు, శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణామూర్తివంటి దేవతామూర్తులను ఏర్పాటుచేస్తున్నారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రతి ఆదివారం వల్లూరమ్మ ఆలయంలో భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. రైతులు. వ్యాపారులు, సంతానార్థులు, అవివాహితులు తమ ఈప్సితాలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. పొర్లుదండాలు పెడతారు. మేళతాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి కూడా భక్తులు కొత్త వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ ఒకసారి వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, ప్రమాదాలు జరగవని విశ్వాసం.వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో వెయ్యిమందికిపైగా మహిళలు పాల్గొంటారు. ఇలా వెలసిన ఈ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తులచే పూజలందుకొనుచున్నది.