Home Unknown facts పాండవులకు జ్ఞానోపదేశం చేసిన కృష్ణుడు!

పాండవులకు జ్ఞానోపదేశం చేసిన కృష్ణుడు!

0
pandavas receiving bottle gourd from krishna

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినపుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడనీ పురాణాలు చెబుతున్నాయి. భారతంలో అడుగడుగునా ధర్మ బోధ చేస్తూ వచ్చాడు కృష్ణుడు. అయితే పాండవులకు తీర్థయాత్రల పరమార్ధాన్ని కూడా బోధించాడు.

సాధారణంగా మన దేశంలో ఎంతోమంది తీర్థయాత్రలకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. కాశీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాలలో కొలువైయున్న దేవాలయాలకు వెళ్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ ఎంతో పుణ్యఫలం పొందుతుంటారు.

అయితే చాలామందికి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లాలి?తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏ విధంగా ఉండటం వల్ల ఆ భగవంతుని కృప కలుగుతుంది అనే విషయాలు తెలియవు.అయితే తీర్థయాత్రల గురించి శ్రీకృష్ణభగవానుడు పాండవులకు తెలియజేసిన సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి పాండవులు అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్లాలని భావిస్తారు.ఈ సమయంలోనే వారికి ఎంతో సన్నిహితుడైన శ్రీకృష్ణ భగవానుడిని వారితో పాటు తీర్థయాత్రలకు రమ్మని అడుగుతారు.

అందుకు శ్రీకృష్ణుడు తనకు చాలా పనులు ఉన్నాయని, ఆ పనుల వల్ల రాలేనని చెప్పి పాండవులతో పాటు తన తరఫున ఒక కాయని ఇచ్చి తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని చెబుతారు. దాంతో పాండవులు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుడు ఇచ్చిన సొరకాయను వారితోపాటు తీర్థయాత్రలకు తీసుకొని బయలుదేరుతారు.

పాండవులు ఏ పుణ్య క్షేత్రాన్ని దర్శించిన వారితోపాటు సొరకాయను తీసుకెళ్లేవారు. అదేవిధంగా పుణ్యనదులలో స్నానాలు ఆచరించి అన్ని పుణ్యక్షేత్రాలకు వారితో పాటు సొరకాయను కూడా తిప్పుకొని తిరిగి హస్తినాపురానికి చేరుకుంటారు.

అయితే ఈ సొరకాయను పాండవులు శ్రీకృష్ణుడు పాదాల వద్ద ఉంచి నమస్కరిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం పాండవులకు శ్రీకృష్ణుడు ఆతిథ్యం ఇస్తాడు.
అయితే శ్రీకృష్ణుడు వారికి భోజనంలో పుణ్యక్షేత్రాలు అన్నింటిని తిప్పుకొని వచ్చిన సొరకాయను వండి వడ్డిస్తారు. భోజనం చేస్తున్న పాండవులు సొరకాయ ఏంటి చేదుగా ఉంది అని అడుగుతారు.

అయ్యో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన ఈ సొరకాయ తియ్యగా ఉంటుంది అనుకున్నాను. కానీ చేదుగా ఉందా అని శ్రీకృష్ణుడు అనడంతో, కృష్ణుడి మాటలలోని అర్థాన్ని పాండవులు గ్రహించారు.

మనం దురుద్దేశంతో ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన బుద్ధి మారదు. భగవంతుని స్మరించేటప్పుడు మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా భగవంతుని నామస్మరణ చేసుకున్నప్పుడే అసలైన పుణ్యఫలం దక్కుతుందని శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా తెలియజేశారు.

Exit mobile version