కుమారస్వామి మంగళవారం పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా ?

0
4014

శివపార్వతుల కుమారుడు, వినాయకుని తమ్ముడు కుమారస్వామి. ఈ స్వామి దేవతలందరికీ సేనాధిపతి. ఈ స్వామి వాహనం నెమలి.ఈ స్వామికి షణ్ముఖుడు, స్కందుడు, కార్తికేయుడు, శరావణుడు అని పేర్లున్నాయి. పరమశివుడి కుమారుడు కనుక కుమారస్వామి అని, శివుడికి ప్రణవర్దాన్ని వివరించాడు కనుక స్వామిమలై అనే పేరు వచ్చినది అని చెబుతారు. మానవజాతికి ఆదిదేవుడు కుమారస్వామి, అతి సూక్ష్మ క్రిమి నుండి మహాసర్పం వరకు గల జీవజాతికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. మరి కుమారస్వామి మంగళవారం పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయాల గిరించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Kumaraswamy

జ్యోతిష్య శాస్ర ప్రకారం కుమారస్వామి కుజ గ్రహానికి అధిపతి. అందుకే ఈ స్వామిని పూజిస్తే మంగళుడు శాంతిస్తాడని చెబుతారు. అంగారకుడు, కుజుడు అని కూడా పిలవబడే మంగళుడు నవగ్రహల్లో కీలకమైన గ్రహాధిపతి. అంగారకుడి వల్లే మనిషికి అప్పుల బాధలు కలుగుతాయి. గాయాలు, ప్రమాదాలు, రక్తస్రావాలు బాధిస్తాయి. ఇవి కాక కుజ గ్రహం అనుగ్రహం లేకపోవటం వల్లే శత్రు బాధలు కూడా పట్టి కుదిపేస్తుంటాయి. చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం వంటివి కూడా అంగారక దోషం వుంటే అధోగతిపాలైపోతాయి.

Lord Kumaraswamy

ఇన్ని అంశాల్ని ప్రభావితం చేస్తూ మన జీవితాల్నే శాసించే కుజుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవటం? కుజాధిపతి అయిన కుమారుడ్ని ఆరాధించటం వల్లే. మంగళ గ్రహానికి సంబంధించిన రోజు మంగళవారం. అందుకే, అదే రోజున సుబ్రహ్మణ్యారాధన చేయాలి. అరుణ వర్ణం గల శుభ్రమైన బట్టలు ధరించి శుచిగా కుమార స్వామి వారి ఆలయానికి వెళ్లి శిఖి వాహనుని దర్శనం చేసుకోవాలి. వీలైనన్ని ప్రదక్షిణలు బేసి సంఖ్యలో చేయాలి. 108 ప్రదక్షిణలు చేయగలిగితే మరింత శుభ ఫలితం శీఘ్రంగా కలుగుతుందంటున్నారు పండితులు.

Lord Kumaraswamy

సుబ్రహ్మణ్యుడ్ని పూజించేటప్పుడు ఆయనకు భక్తిగా సమర్పించాల్సినవి పానకం, ఉప్పు. స్వామికి ఉప్పుని నివేదించటం వల్ల ఋణ బాధలు సమసిపోతాయి. పానకం సేవిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. అంతే కాదు సమస్త దోషాలు పరిహారం అవుతాయి. ఎటువంటి ఋణబాధలు, శత్రు బాధలు, సంతాన లేమి ఇవేవీ లేని వారు కూడా స్కందుడైన సుబ్రహ్మణ్యుడ్ని సేవించవచ్చు. ఏ కోరిక లేకుండా ఆయనని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం ప్రసాదించే పరబ్రహ్మమూర్తి, మానవజాతికి ఆదిదేవుడు కుమారస్వామి అని స్కందపురాణం చెబుతుంది.