Home Unknown facts కొండమొక్కు ఆచారం కలిగిన ఏకైక దేవాలయం

కొండమొక్కు ఆచారం కలిగిన ఏకైక దేవాలయం

0

దేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అలాంటి విశేషం ఉంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. మరి ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో కోడెమొక్కు ఆచారం ఎలా వచ్చింది? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయానికి సంబంధించి స్థల పురాణం ఏం చెబుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. kodemokkuతెలంగాణ రాష్ట్రంలోని, కరీంనగర్ జిల్లా లోని సిరిసిల్ల నుండి 10 కీ.మీ. దూరంలో వేములవాడ అనే ఊరిలో రాజరాజేశ్వర దేవాలయం ఉంది. ఇది చాలా ప్రాచీన దేవాలయంగా చెబుతారు. దేశంలోని శైవక్షేత్రాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. దక్షిణకాశిగా విరాజిల్లుతున్న వేములవాడ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో ఎంతో రద్దీగా ఉంటుంది. చాళుక్య రాజులూ వేములవాడని రాజధానిగా చేసుకొని 175 సంవత్సరాలు పాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఇక ఆలయ పురాణానికి వస్తే, చాళుక్యుల కాలంలో రాజరాజనరేంద్రుడు నిత్యం ఈ ప్రాంతంలోని ఒక వీధిలోకి వస్తుండగా తన వెంట వచ్చే కుష్టు రోగం కలిగిన ఒక శునకం నిత్యం నీటి చెరువులో స్నానం చేసేది ఆ స్నానంతోనే దాని వ్యాధి నయంకాగా, ఆశ్చర్యపడిన రాజు చెరువులో తవ్వించగా మహిమాన్వితమైన శివలింగం బయటపడింది. దానినే అక్కడ ప్రతిష్టించినట్లు చెబుతారు. ఇక ఇంకో కథనం ప్రకారం, అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం చెబుతుంది. ఇక ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి. ఇంకా ఇక్కడి ఆలయంలో విశేషం ఏంటంటే, ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. ఆలయంలో కోడెను కట్టిన ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వరస్వామిని సేవించుకుంటారు. ఆ రోజున వందమంది అర్చకులతో శివునికి మహాలింగార్చన జరుపుతారు. ఇంకా అర్ధరాత్రి వేళా శివునికి ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తారు. ఇలా ఎన్నో విశేషాల నడుమ వెలసి రాజన్న కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకొనుటకు దేశం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version