Home Unknown facts ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలసిన కనుకదుర్గ ఆలయ చరిత్ర

ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలసిన కనుకదుర్గ ఆలయ చరిత్ర

0

మన దేశంలో అమ్మవారు వెలసిన ప్రసిద్ధ ఆలయాలలో శ్రీ కనకదుర్గా ఆలయం కూడా ఒకటి.  మరి ఎంతో మహిమ గల పేరున్న ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారనే విషయాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vijayawada Kanaka Durga Temple
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా లోని విజయవాడ పట్టణములో కృష్ణాతీరమున, ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనుకదుర్గ ఆలయం కొలువుంది. దుర్గామాత గొప్ప మహిమలు ఉన్న తల్లి అని భక్తులు భావిస్తారు. దశమి సమయంలో శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో భక్తులకి దర్శనం ఇస్తుంది. దశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనం ఇస్తుంది.

ఇక పురాణానికి వస్తే, పూర్వం దుర్గామాత ఉన్న కొండ ప్రాంతాన్ని ఇంద్రకీలాద్రి అని అంటారు. ఈ పర్వతాన్ని అధిష్టించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అయన ప్రతి రోజు కృష్ణవేణి నదిలో స్నానం చేసుకుంటూ తపస్సు చేసుకునేవాడు. అతని తపస్సుకి మెచ్చిన పార్వతి పరమేశ్వరులు వరం కోరుకో అని అడుగగా దానికి అయన పార్వతి పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించమని కోరాడు. దానికి పార్వతి పరమేశ్వరులు తధాస్తు అన్నారు. అతని కోరిక మేరకు మహిషాసుర సంహారానంతనం కనకదుర్గా మాత ఇంద్రకీలా పర్వతం పైన ఆవిర్భవించింది.

ఇక్కడ దుర్గాదేవి ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి ఉంటుంది. అదేవిధంగా సింహాన్ని అధిష్టించి మహిషాసురున్ని శూలంతో పొడుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది.

దుర్గాదేవి ఆలయానికి పశ్చిమాన చిన్న కుండము ఉంది. దీనినే దుర్గ కుండము అని అంటారు. దీని మధ్యలో ఒక చిన్న గుంట అనేది ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు కూడా ఎండటం లాంటిది జరుగలేదు. దీనిలోపల వరుణయంత్రం ప్రతిష్టించబడింది అంటారు. అందువలనే ఈ కుండలో స్నానము చేసిన వారికీ సమస్త నదులలో స్నానం చేసిన పుణ్యం తో పాటు వారు కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని అంటారు.

పరమ పవిత్రమైన ఈ ఇంద్రకీలాద్రి మీద దేవతలదరి కోరిక మేరకు దుర్గాదేవి మహిషాసురమర్దిని రూపంతో అవతరించింది. ఇలా ఆ దేవి కాలక్రమంలో కనకదుర్గాగా కీర్తించబడింది. ఇక ఇక్కడ బ్రహ్మదేవుడు శివుని కోసం తపస్సు చేసి దివ్యజ్యోతిర్లింగ స్వరూపుడైన శివుడిని మల్లిక పుష్పాలతో అర్చించాడు. ఇలా మొట్టమొదట శివుడిని బ్రహ్మదేవుడు మల్లిక పుష్పాలతో పూజించడం వలన శివుడికి మల్లికేశుడు అనే పేరు వచ్చింది.

ఈవిధంగా ఇంద్రకీలాద్రిపైన వెలసిన అమ్మవారికి నవరాత్రులలో జరిపే ఉత్సవాలకు కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

Exit mobile version