Home Entertainment Let’s Revisit Some Magical Moments Of SPB On His 1st Death Anniversary

Let’s Revisit Some Magical Moments Of SPB On His 1st Death Anniversary

0
SPB

సంగీత సామ్రాజ్యం ఒంటరిదై అప్పుడే సంవత్సరం గడిచింది. ఆ గొంతు సవరించక మూగబోయి ఏడాది అవుతోంది. సంగీతమే ప్రాణంగా, స్వరాలే సర్వస్వంగా జీవించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ గాత్రం జ్ఞాపకంగా మిగిలింది. ఆ మహానుభావుడు ఎవరో కాదు.. గొంతునే గుండెగా చేసుకుని పాటకి పట్టాభిషేకం చేసిన గాన గంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా తన ప్రతిభని ప్రపంచానికి చాటిన బాలు గారు అస్తమించి నేటికి(సెప్టెంబర్ 25) సరిగ్గా సంవత్సరం.

బాల సుబ్రహ్మణ్యం గారు అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడేమో…! తెలుగు వాడికి ఘంటసాల గారి తర్వాత ఆ స్థాయి గాయకులు ఎవరంటే అది బాల సుబ్రహ్మణ్యం గారే. ఆయన ప్రపంచానికి సంగీత సామ్రాట్, గాన గంధర్వులు అయి ఉండొచ్చు.. కానీ ప్రతి అభిమానికి ‘బాలు’నే. మన దగ్గరి వాడిలా మన బాలు అని ప్రేమగా పిలుచుకునే స్థాయికి ఆయన ఎదిగారు. దేశంలోని ప్రతి సంగీత అభిమానికి ఆప్తుడు అయ్యాడు. ఆయన జీవితంలో ఎన్నో పాటలు, ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు.. మన కళ్ల ముందు అలా కదలాడుతాయి. బాలు గొంతు వినకుండా ఒక్క రోజు కూడా మనకు గడవదు అంటే ఆశ్చర్యం లేదు.

ఏమై పోయావు బాలూ…? నీ అభిమానులకు మర్చిపోలేని పాటల సంపద అందించి ఎందుకు ఉన్నట్లుండి దూరమయ్యావు…? నీ గొంతులో మాధుర్యం నచ్చి అది మనుషులకు మాత్రమేనా.. మాకు వద్దా అని ఆ దేవతలు కుళ్లుకున్నారేమో…! నిన్ను గంధర్వుడు అని మేం పిలుచుకున్నందుకు నీ స్థానం భూమిపై కాదు, స్వర్గంలో అని నిర్ణయించుకున్నావా…? నువ్వు పాడాల్సింది చాలా ఉంది.. చేయాల్సింది ఇంకా ఉంది అని ఎప్పుడూ చెప్పుకునే నువ్వు.. మరి ఉన్న పనులన్నీ సగంలోనే వదిలేసి వెళ్లిపోవడం న్యాయమా…? నీ సంగీత అభిమానులకు, నీ తర్వాతి తరం వాళ్లకి మార్గదర్శిగా ఉన్న నువ్వు దిక్కు లేని వాళ్లని చేసి వెళ్లిపోవడం సమంజసమా…? అయినా మమ్మల్ని తప్పించుకుని ఎటు పోతావులే. అందరూ ఎప్పుడో నిన్ను వాళ్ల గుండెల్లో బంధించేశారుగా.

ఒక పాటని ఎంత గొప్పగా పాడొచ్చో నీ పాట వినే తెలుసుకున్నాం.. ఒక మామూలు పాటలో కూడా ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చో నువ్వు చేశాకే మాకు అర్థమైంది. ఒక పాత్రలో జీవించి ఎలా నటించాలో కూడా చూపించావ్.. ఒక నటుడికి డబ్బింగ్ చెప్పాలంటే ఎంత ప్రాణం పెడతారో నీ గొంతు ద్వారా వినిపించావు. సరిగమలు నేర్చుకునే చిన్నపిల్లలకి ఎలా చెప్తే అర్థం అవుతుందో, వాళ్ల మనసు నొచ్చుకోకుండా తప్పుని ఎలా సరిదిద్దాలో నీ ‘పాడుతా తీయగా’ ద్వారా గురువులా నేర్పించావ్.. ఇన్ని చేసి ఏమీ తెలియదన్నట్లు వినయంగా ఎలా ఉండాలో సంస్కారంతో కనిపించావ్.. అందుకే ఎన్నో అవార్డులు, ఎన్నో పురస్కారాలు నీ ప్రతిభకి దాసోహమై నీ సొంతం అయ్యాయి.

అప్పుడే నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లి సంవత్సరం గడిచిందా అనిపిస్తుంది. ఇంకా మాతోనే ఉన్నావని అనిపిస్తుంది. ఎక్కడో ఏదో ప్రోగ్రాంలో, సినిమాలో ఇంకా పాట పాడుతున్నట్లే ఉంది. నువ్వు ఎక్కడికీ పోలేదు బాలూ.. నీ పాటల ద్వారా, నువ్వు పోషించిన పాత్రల ద్వారా, నీ సంగీతం ద్వారా ఎప్పుడూ మాతోనే ఉన్నావ్.. ఉంటావు కూడా. పాట ఉన్నంతవరకు బాలు మనతోనే ఉంటాడు.
స్మరణం తప్ప మరణం లేదు బాలు నీకు…..!

1. బాలు గారి ఎమోషనల్ స్పీచ్

2. స్నేహం గురించి బాలు మాటల్లో..

3. ఘంటసాల గారిని తలుచుకుంటూ…

4. పసి ‘బాలు’డై జానకమ్మతో సరదాగా..

5. చిత్రమ్మకి డాన్స్ నేర్పిస్తూ.. ఫన్నీ మూమెంట్స్

6. పాడుతా తీయగా సెట్లో పిల్లలతో పిల్లవాడై…

7. ‘దశావతారం’లో ఎలా డబ్బింగ్ చెప్పాడో వినిపిస్తూ..

8. గొంతు మార్చి ఇలా అద్భుతంగా ఎవరు పాడగలరు?

9. గొంతుతో ప్రయోగాలు చేసిన పాట

10. ఊపిరి ఆపకుండా పాడిన పాట

Exit mobile version