Home Unknown facts ఈ ఆలయాల్లో శ్రీరాముడి దర్శనం ఒక అద్భుతం

ఈ ఆలయాల్లో శ్రీరాముడి దర్శనం ఒక అద్భుతం

0

శ్రీమహావిష్ణవు అవతారాల్లో రామావతారం ఏడవదిగా చెaబుతారు. లోకకల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో అవతరించినదే శ్రీరామావతారం. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం, శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన ప్రదేశాలు, స్వయంభువుగా వెలసిన ఆలయాలు, ప్రత్యేకతలు కలిగి ఉన్న కొన్ని రామాలయాలు ఉన్నవి. మరి ఈ ఆలయాల్లో శ్రీరాముడు ఎలా దర్శనమిస్తాడు? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యోగరామాలయం:

Ramalayamతమిళనాడు రాష్ట్రంలోని, అడయార్‌ నుంచి వండవాసికి నెడుంగుణం యోగరామాలయం ఉంది. రాముడిలా యోగభంగిమలో అగుపించే ఆలయాలు ఈ ప్రాంతంలో మూడున్నాయి. ఈ ఆలయం చెంత శుకమహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో శుకబ్రహ్మ ఆసీనుడై ఉండగా, హనుమంతుడు ధర్మశాస్త్రాలను చదివి, రామలక్ష్మణులకు, శుకునికి వినిపిస్తూ ఉన్నట్లుగా ఉన్న అరుదైన విగ్రహాలను చూడవచ్చు. సాధారణంగా రాముడి పాదాల వద్ద వినయవిధేయతలతో కూర్చుని కనిపించే హనుమంతుని చూస్తాము కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా హనుమంతుడు ఏదో చదివి వినిపిస్తుండగా, రాముడు ఎంతో శ్రద్ధగా, సావధానంగా ఆయా శాస్త్రవిషయాలను ఆలకిస్తున్నట్లుగా ఉన్న ఈ అరుదైన దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.

శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం:

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని చేవెళ్లకు వెళ్లే హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గంలో లంగర్ హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ కు సమీపంలో శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం ఉన్నది. శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా తానీషాకు ఆరులక్షల రూపాయలు జమకట్టి రసీదు పుచ్చుకొని అనంతరం ఈ ఆలయంలో సుప్రతిష్ఠితుడైనాడని భక్తుల నమ్మకం. అందుకే మరెక్కడా లేనివిధంగా ఇక్కడ శ్రీరాముడు వీరవెంకట విజయరాఘవస్వామిగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. గర్భగుడిలోని రాముడు మీసాలతోపాటు, శంఖు, చక్రాలతో, చతుర్భుజాలతో భక్తులకి దర్శనమిస్తుంటాడు. కుడి, ఎడమల లక్ష్మణ, సీతా సమేతుడై రాముడు ఇక్కడ కొలువై ఉన్నాడు.

కాలరామ మందిరం:

మహారాష్ట్ర, నాసిక్ లో కాలరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాలు నల్లరాతితో తయారుచేయబడినవి అందుకే ఈ ఆలయానికి కాలరామ మందిరం అనే పేరు వచ్చినదని చెబుతారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 12 సంవత్సరాల వయసు పట్టిందని పురాణం. ఇక ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, ఉదయం సూర్య కిరణాలు ఆలయంలో తూర్పు దిక్కున ఉన్న ద్వారం నుండి ఆంజనేయస్వామి ఆలయం నుండి రామమందిరం లో ఉన్న సీతారామలక్ష్మణులపై పడుతుంటాయి. ఇలా ఉదయం సూర్యకిరణాలు సీతారామలక్ష్మణులపై పడే విధంగా చేసిన అప్పటి వాస్తు నిర్మాణం అద్భుతమని చెప్పవచ్చు.

రెండవ భద్రాది:

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కోదాడ లోని తమ్మరబండపాలెం లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న రాముడి రూపం నాలుగు చేతులతో భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం. ఇలా రాముడు వైకుంఠ రాముడిగా దర్శనమిచ్చే ఆలయాలలో ఇది రెండవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక భద్రాచలం లో రామకోటి ఉత్సవాలు నిర్వహించినట్లే ఈ ఆలయంలో కూడా రామకోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

రామస్వామి :

తమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో శ్రీ ఆది కుంభేశ్వరాలయానికి దగ్గరగా ప్రసిద్ధమైన రామస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి ఒక పీఠంపై కొలువుదిరి ఉండటం విశేషం అయితే హనుమంతుడు వీణపై స్వామివార్లను స్తుతిస్తూ ఉన్నట్లు విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది.

సీతారామచంద్రస్వామి ఆలయం:

తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది. భద్రాచలంలోని పవిత్ర నది గోదావరి నది తీరమున సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు. శ్రీ రాముడు వెలసిన మిగతా ఆలయాల్లో రాముడి మూలవిరాట్టు రెండు చేతులతో మానవుని రూపాన్ని పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీ రాముడి విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణంను, ఎడమచేతిలో విల్లును ధరించి విష్ణువు వలె కుడిచేతిలో శంఖం ను, ఎడమచేతిలో చక్రం ని ధరించి ఉంటాడు. అందుకే ఇక్కడ వెలసిన రాముడిని వైకుంఠ రాముడిని, భద్రాద్రిరాముడు అని, చతుర్భుజ రాముడిని, గిరినారాయణుడని భక్తులు కొలుస్తుంటారు.

Exit mobile version