Home People M.S. Subbulakshmi: The Woman Who Built Boundaries With Her Incredible Voice...

M.S. Subbulakshmi: The Woman Who Built Boundaries With Her Incredible Voice And Music.

0

సంగీత ప్రపంచంలో మొదటగా భారత రత్న అవార్డు, ఆసియా నోబెల్ ప్రైజ్ గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన మొదటి సంగీత కళాకారిణి, తన మధుర గానంతో యావత్తు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహా గాయిని ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు. మహాత్మ గాంధీజీ, నెహ్రు ఇంకా ప్రపంచంలోనే ప్రముఖులందరి ప్రశంసలు పొందిన సంగీతపు మహారాణి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు. మరి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీత ప్రపంచాన్ని ఎలా శాశించారు? ఆమె తన భర్తనే గురువుగా ఎందుకు భావించింది? ఇలాంటి మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.1-Subhalaxmi

తమిళనాడు రాష్ట్రం, మధురై లో 1916 లో సెప్టెంబర్ 16 వ తేదీన సుబ్రమణ్య అయ్యర్‌ మరియు షణ్ముఖ వడివూ అమ్మాళ్‌ దంపతులకి సుబ్బలక్ష్మి గారు జన్మించారు. సుబ్బలక్ష్మి గారు తండ్రి న్యాయవాది, తల్లి వీణా విద్వాంసురాలు. వీరిది శుద్ధ సంప్రదాయ కుటుంబం. సుబ్బలక్ష్మి గారికి మొదటి గురువు ఆమె తల్లి గారు అనే చెబుతారు. ఇలా తనకి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి తో కలసి కచ్చేరి కి వెళ్లి తన పాటతో అందరిని ప్రశంసలను పొందింది. అప్పటినుండి వారి తల్లి గారితో కచ్చేరీలకు వెళ్లడం పాటలు పాడటం అలవాటుగా మారిపోయింది. సంగీతం అంటే ఇష్టం ఉండటం వలన చదువు పైన ఆమె అంతగా ఆసక్తి చూపించలేదు. ఇలా ఉండగా సుబ్బలక్ష్మి గారికి సంగీతం అంటే ఇష్టాన్ని చూసి ఆమె తల్లి మదురై నుండి చెన్నైకి వచ్చారు. సుబ్బలక్ష్మి గారు గురువులు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ మరియు హిందుస్థానీ సంగీతాన్ని పండిత్‌ నారాయణరావు వ్యాస్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఇక 17 సంవత్సరాల వయసులో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తల్లి సహకారంతో చేసిన కచ్చేరి లో ఆమె గాత్రానికి ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్దులయ్యారు.

ఈవిధంగా మొదటి కచ్చేరి తోనే ఎన్నో ప్రశంసలను అందుకున్న సుబ్బలక్ష్మి గారు 1938 వ సంవత్సరంలో సేవాసదనం అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత శకుంతల, మీరా, సావిత్రి అనే సినిమాల్లో నటించడమే కాకుండా అందులో పాటలు కూడా పాడారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీరా సినిమా గురించి. ఈ సినిమాలో మీరాబాయిగా నటించడం అనే కంటే జీవించింది అని చెప్పాలి. సినిమా చూసిన వారందరు కూడా సాక్షాత్తు మీరాబాయి మళ్ళీ జన్మించిందా అనే భావానికి లోనయ్యారు. అందులో ఆమె ఆలపించిన మీరాబాయి కీర్తనలను నేటికీ ఎంతో మంది వింటూనే ఉంటారు. ఇక శుబోదయాన సుబ్బలక్ష్మి గారు ఆ వేంకటేశ్వరుని మేల్కొల్పుతూ పాడే సుప్రభాతం ఇంటింట విని తరించని వారు ఉండరు.

ఇక సుబ్బలక్ష్మి గారి పెళ్లి విషయానికి వస్తే, ఆనందవికటన్ అనే తమిళ పత్రికలో పనిచేస్తున్న స్వాత్యంత్ర సమరయోధుడు త్యాగరాజన్ సదా శివంతో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం ప్రేమగా మారి 1940 వ సంవత్సరంలో ఆయన్ని వివాహం చేసుకుంది. వీరి వివాహం అప్పట్లో ఒక సంచలనం. తన భర్త అయినా త్యాగరాజన్ సదా శివం గారు ఆమెను ముందు ఉండి నడిపిస్తూ సంగీత ప్రపంచంలో ఆమె కీర్తి నలుదిశలా వ్యాపించేలా కృషి చేసారు. అందుకే సుబ్బలక్ష్మి గారు నా భర్తే నా దైవం, నా గురువు, నా మార్గదర్శి అంటూ చెప్పుకొచ్చేవారు.

సుబ్బలక్ష్మి గారికి వచ్చిన ప్రశంసల విషయానికి వస్తే, మీరాబాయి కీర్తనలు విన్న మహాత్మా గాంధీజీ గారు సుబ్బలక్ష్మి గారిచే ప్రత్యేకంగా ఆ కీర్తనలను పాడించుకున్నారు. ఇక గాంధీజీ గారికి ఎంతో ఇష్టమైనా హరి తుమ్‌ హరో అనే పాటను సుబ్బలక్ష్మి గారు పాడి రికార్డ్ చేసి ఇచ్చారు. ఇక ఒక సందర్భంలో నెహ్రు గారు నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కానీ నువ్వు సంగీతానికి మహారాణి అంటూ ప్రసంశించారు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన సరోజినీ నాయుడు గారు ఒక సందర్భంలో సుబ్బలక్ష్మి ని ఉద్దేశించి అసలు గాన కోకిల అంటే నేను కాదు సుబ్బలక్ష్మి గారు అసలైన నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా అంటూ ప్రసంశించారు. ఇంకా ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ మరియు లండన్ లో ఎలిజబెత్ మహారాణి సమక్షంలో పాడి అంతర్జాతీయ సంగీత వేదికలో వచ్చిన వారందరిని కూడా తన ఒక్క స్వరంతోనే కట్టి పడేసి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సుబ్బలక్ష్మి గారిది.

ఇలా సంగీత ప్రపంచంలో ప్రముఖ స్థానము సుస్థిరం చేసుకున్న ఆమెకు 1954 లో పద్మభూషణ్, 1975 లో పద్మావిభూషణ్, 1998 లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించారు. అంతేకాకుండా ఆసియా నోబెల్ ప్రైజ్ గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నారు. ఇంకా ఎన్నో గౌరవప్రధానమైన డాక్టరేట్లు ఆమెకి లభించాయి.

ఇది ఇలా ఉంటె ప్రేమించి పెళ్లి చేసుకొని భర్తే సర్వస్వం అనుకున్న సుబ్బలక్ష్మి గారి భర్త చనిపోయగా ఆమె చాలా మానసికంగా క్షిణించింది. ఇలా భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న సుబ్బలక్ష్మి గారు తన 88 ఏట 2004 వ సంవత్సరం డిసెంబర్ 11 వ తేదీన మరణించారు.

ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు మొత్తం పది భాషల్లో తన స్వరంతో విశేష ఆదరణ పొందారు. నేటికీ సుబ్బలక్ష్మి గారి స్వరం ఎక్కడో ఒక చోటే వింటూనే ఉంటాం. నేడు ఆమె జీవించి లేనప్పటికీ ఈ విశ్వం ఉన్నంతకాలం కూడా ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు తాను పాడిన పాటల రూపంలో ఎప్పుడు మనమధ్య సజీవంగానే ఉంటారు.

Exit mobile version