Home Unknown facts దక్షిణకాశి అని పిలువబడే జోగులాంబదేవి ఆలయం ఎక్కడ ఉంది

దక్షిణకాశి అని పిలువబడే జోగులాంబదేవి ఆలయం ఎక్కడ ఉంది

0

శివుడి అర్దాంగి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిసాయి. సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతారు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. మరి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఐదవ శక్తి పీఠం అని చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Navabrahma Temples

తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌ జిల్లా, అలంపురం మండలం లో తుంగభద్రానది తీరంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం జోగులాంబదేవి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా బావించబడుచున్నది. దేశంలోని 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠం ఈ జోగులాంబదేవి ఆలయం. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు, జోగులాంబ ప్రధాన దేవతలుగా పూజలను అందుకుతున్నారు. ఇక్కడ జోగులాంబదేవి స్వయంభువుగా వెలసినది అని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని శైవశక్తిపీఠం, దక్షిణకాశి అని పిలుస్తుంటారు.

ఇక్కడ బ్రహ్మేశ్వరుడే విశ్వేశ్వరుడు, తుంగభద్రయే గంగ. ఇక్కడ తుంగభద్ర నది తీరంలో కోటి లింగాలు ప్రతిష్టించబడినట్లుగా తెలుయుచున్నది. ఇక్కడ అలంపుర అని పేరు రావడానికి కొన్ని రకాల అభిప్రాయాలూ ఉన్నాయి. పూర్వం ఇక్కడ హలం అంటే నాగలి ప్రధానమైన పనిముట్టు అందుకే ఈ పురానికి హాలంపురం అని పిలిచేవారని, ఎల్లమ్మ అనే గ్రామదేవత కారణంగా ఎల్లమ్మపురం, అదే రానురాను అలంపురంగా మారిందని మరికొందరు, హేమదేవత వెలసిన కారణంగా ఈ పేరువచ్చింది ఇంకొందరి అభిప్రాయం.

ఇక ఈ ఆలయంలో ఈశ్వరుని, జగదంబ జోగులాంబాని ప్రతిష్టించింది బ్రహ్మదేవుడే అని అంటారు. అందుకే ఈ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడు అనే పేరు వచ్చినది అని చెబుతుంటారు. ఈ క్షేత్రాన్ని బ్రహ్మేశ్వరక్షేత్రం అని, పరశురామక్షేత్రమని, దక్షిణకాశీయని, శక్తిపీఠమని ఇలా అనేక రకాలుగా కూడా పిలుస్తారు. మొదట్లో అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయం లో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి అక్కడ అమ్మవారిని ప్రతిష్టించారు. బాల బ్రహ్మేశ్వరాలయం లో అమ్మవారు ఉన్నప్పుడు కేవలం కిటికీ గుండా మాత్రమే భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు.

ఈ ఆలయంలో అమ్మవారు ఉగ్రస్వరూపుని, అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై కనిపిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. అయితే ఎవరి ఇంట్లోనైనా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షిణిస్తే అక్కడికి తేళ్లు చేరతాయని దీని సారాంశం. ఇక ఆ తరువాత దశ గబ్బిలాలు చేరటం. ఆ జీవకళ మరింత క్షిణిస్తే ఆ ఇంట్లో మరణం సంబవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం మొదలైన గుర్తులు అని చెబుతారు.

ఇక్కడ మరొక విశేషం నవబ్రహ్మదేవాలయాలు. వీటిని చాళుక్యులు నిర్మించారు. ఆ తొమ్మిది ఆలయాలను తొమిదిమంది శిల్పులు తమ పేర్లమీదనే మలచి ఇచట ప్రతిష్టించారని తెలుస్తుంది. వాటినే బాలబ్రహ్మేశ్వరాలయం, కుమార బ్రహ్మేశ్వరాలయం, ఆర్కా బ్రహ్మేశ్వరాలయం, వీర బ్రహ్మేశ్వరాలయం, విశ్వ బ్రహ్మేశ్వరాలయం, తారక బ్రహ్మేశ్వరాలయం, గురు బ్రహ్మేశ్వరాలయం, స్వర్ణ బ్రహ్మేశ్వరాలయం, పద్మ బ్రహ్మశ్వరాలయాలుగా ప్రసిద్ధి గాంచినవి.

ఇంతటి మహత్యం ఉన్న ఈ శక్తిపీఠాన్ని దర్శించుటకు అన్ని ప్రాంతాలనుండి భక్తులు తరలివస్తుంటారు.

Exit mobile version