శ్రీవేంకటేశ్వరస్వామి పార్థసారథిగా ఇక్కడ పూజలను అందుకుంటున్నాడు. అంతేకాకుండా స్వామివారు ఇక్కడ సుదర్శన చక్రం లేకుండా దర్శనం ఇవ్వడం విశేషం. ఇలా స్వామివారు ఇక్కడ ఆయుధం లేకుండా దర్శనమివ్వకపోవడానికి కారణం ఉందని పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, చెన్నై సముద్రతీరానికి కొంత దూరంలో శ్రీ పార్ధసారధి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రసిద్ధ వైష్ణవాలయలో ఒకటిగా 108 వైష్ణవ దివ్య క్షేత్రలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయాన్ని 8 వ శతాబ్దంలో పల్లవ రాజు నిర్మించినట్లుగా తెలియుచున్నది.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శ్రీ వెంకేశ్వరస్వామి సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పార్థసారథిగా పూజలను అందుకుంటున్నాడని పురాణం. అయితే ఈ ఆలయ గర్భగుడిలోని విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించినట్లుగా చెబుతారు. అంతేకాకుండా కురుక్షేత్రంలో భీష్ముడు విడిచిన అస్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి తగిలాయని అందుకే మూలవిరాట్టు పైన మచ్చలు అనేవి ఏర్పడ్డాయని చెబుతారు. ఇంకా విశేషం ఏంటంటే, స్వామివారు కోరమీసాలతో దర్శమిస్తుంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వలన ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం అనేది ఉండదు, చేతిలో శంఖం మాత్రమే ఉంటుంది.
ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో వేరుశెనగ, నూనె మరియు మిరపకాయలు నిషిద్ధం. ఇంకా ఈ ఆలయానికి ఎదురుగా ఒక పుష్కరిణి ఉంది. ఇక్కడ శ్రీ పార్ధసారధి ఆలయం, శ్రీ నరసింహ ఆలయం ఉండగా ఈ రెండు ఆలయాలకు కూడా వేరు వేరు ధ్వజస్తంభాలు ఉండటం విశేషం. ఈవిధంగా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ – మే నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.