శ్రీ మహావిష్ణవు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పై పవళించి ఉన్న భంగిమలో భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం. ఇంకా ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోనే మహాకవి తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని పవిత్ర పెన్నా నది తీరాన అతి ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాథా స్వామి వారి ఆలయం కలదు. ఈ ఆలయం చోళ రాజుల కాలం నాడు నిర్మించిన ఆలయం అని తెలుస్తుంది. అయితే స్థల పురాణం ప్రకారం మాత్రం ఇది జనమేజయుని కాలంలో నిర్మించినట్లుగా చెప్పబడుచున్నది.
ఈ ఆలయంలో రంగనాథస్వామి ని విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను కొలుస్తారు. దేశంలో ప్రసిద్ధ్ది చెందిన రంగనాథస్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠం అని పిలువబడేది. 17 వ శతాబ్దం తరువాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గాలిగోపురం 7 అంతస్థులతో సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారు దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి పశ్చిమాభిముఖంగా శేషతల్పం పై శయనించి భక్తుల సేవలు అందుకుంటున్నారు.
ఇక మహాకవి తిక్కన సోమయాజి జన్మించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పుణ్యక్షేత్రంలోనే అయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని తెలుస్తుంది. అయితే 7 శతాబ్దంలో నెల్లూరు ప్రాంతమును పాలించిన పల్లవులు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్టించగా, 12 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఆలయాన్ని విస్తరించి బాగా అభివృద్ధి పరిచాడు.
ప్రధానాలయముకు ఉత్తరద్వారాన్ని వైకుంఠ ద్వారముగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార ప్రవేశం దొరుకుతుంది. ఇలా పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఫాల్గుణ శుక్ల దశమి నుంచి బహుళ పంచమి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో స్వామివారు అనేక వాహనాలపై నేత్రానంద కరంగా ఊరేగుతారు. అంతేకాకుండా స్వామి వారి రథయాత్ర చాలా గొప్పగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శిస్తారు.