ఋషులను, మునులను చూసినపుడు వాళ్ళ మెడలో రుద్రాక్ష మాలలు చూస్తుంటాము. మెడలో మాల ధరించడం సనాతన హైందవ ధర్మాచారం. ఔషధాలు, పవిత్ర వృక్షాల తాలుకు గింజలు, బెరడులతో తయారుచేసే మాలల ధారణను మహర్షులు మనకు నేర్పించారు. మంత్రాల సంఖ్యను లెక్కించడానికే ఈ మాలలు ఉపయోగిస్తారు.
కమలాక్ష (కమలం గింజలు) మాల ధరించడం వల్ల శత్రువును జయించవచ్చని తంత్ర సారం పేర్కొంటుంది. ముడులతో కూడిన మాల, పాపాల్ని తొలగిస్తుంది. జిమపేట(జీవ పుత్ర) మాలను సంతాన గోపాలుడి రక్ష రేకుతో ధరించి దేవుళ్ళ నామాలు స్మరిస్తే పుత్రడు జన్మిస్తాడు. కెంపుల మాల సంపదను ఇస్తుంది.
రుద్రాక్ష మాల ధరించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే రుగ్మతలు తొలగి, దీర్ఘాయుష్షు కలుగుతుంది. హరీంద్రమాల అడ్డంకులను తొలగించి, శత్రవుల నుంచి రక్షించగలదు. పాలరాళ్ళ మాల అభ్యాసానికి, ఇతరులను ఆకర్షించడానికి సహకరిస్తుంది. తులసి పూసలు, చిన్నచిన్న గవ్వల మాలలు శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తిల అనుగ్రహం పొందడానికి సహకరిస్తాయి.
పిల్లల్ని ఇతరుల దృష్టి దోషం నుంచి, రుగ్మతుల నుంచి రక్షించేందుకు పులిగోరు, బంగారు, వెండి, రాగి నాణేల మాలలు ధరింపజేస్తారు. ఇలా ఎన్నో నమ్మకాల నడుమ రకరకాల మాలలు ధరించే ఆచారముంది. అయితే మాల ధారణకు కొన్ని ఖచ్చిత నియమాలు ఉన్నాయి. మాల ధరించిన వారు నిష్ఠతో ఆ నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటించడం విషయంలో నిష్ఠతో కఠిన నియమాలు పాటించాలి. లేకపోతే లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.