వరంగల్ జిల్లాలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల గురించి మీకు తెలుసా?

0
2909

ఒకప్పటి ఓరుగల్లే నేటి వరంగల్. కాకతీయ రాజులూ వారి పరిపాలనలో ఎన్నో అద్భుత ఆలయాలను కట్టించారు. కాకతీయులు నిర్మించిన ఆలయంలోని శిల్పకళానైపుణ్యం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఓరుగల్లు లో ఉన్న కొన్ని ప్రసిద్ధ ఆలయాలు, ఆ ఆలయ స్థల పురాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భద్రకాళి ఆలయం: 

temples in warangalతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ – హన్మకొండ ప్రధాన రహదారిలో భద్రకాళి చెరువు తీరమున గుట్టల మధ్య శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదిగా చెబుతారు. అయితే ఈ ప్రాంతంలో సిద్ద సంచారం ఎక్కువగా ఉంటుందని అందుకే ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన మానవులకు తాము తెలిసి, తెలియక చేసిన తప్పులన్నీ తొలగయిపోతాయని భక్తుల అపార నమ్మకం. ఆలయంలోని గర్భగుడిలో శ్రీ భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరాలుతూ, పశ్చిమ ముఖంగా కూర్చుండి భక్తులకి దర్శనమిస్తుంది. అమ్మవారు పార్థివదేహం పైన కూర్చొని 8 చేతులతో, కుడి వైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురికా, జపమాల, ఢమరుకము. ఎడమవైపు ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలము, నరికిన తల, పానపాత్రలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో సుగ్రీవాది వానరులు నివసించినట్లు తెలుస్తుంది. అందువల్లనే ఈ ప్రాంతానికి హనుమకొండ వచ్చినట్లుగా చెబుతారు.

వెయ్యి స్థంబాల గుడి: 

temples in warangalశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం పేరు రుద్రేశ్వరాలయం. అయితే ఈ ఆలయానికి అనుకోని విడిగా ఒక కల్యాణమండపం ఉంది. ఆ మండపంలో వేయి స్థంబాలు అనేవి ఉన్నాయి. అందువలన ఈ ఆలయానికి వేయి స్తంభాల గుడి అనే పేరు సార్ధకమైంది. అయితే ఈ ఆలయంలో గర్బగుడిని త్రికూటాలయం అని పిలుస్తారు. ఇంకా గర్భగుడిలో ఉండే ద్వారబంధం ఒక అధ్బుతం.  ఈ ఆలయ ప్రాంగణంలో నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం నిజమైన వృషభరాజంలా జీవకళ ఉట్టిపడుతుంది. అయితే కాకతీయ రాజులూ ఇక్కడి నుండి తవ్విన సొరంగం మార్గం నుండి శ్రీ భద్రకాళి దేవాలయానికి, ఖిల్లా వరంగల్ కు, రామప్ప దేవాలయానికి వెళ్లే వారని పూర్వికులు చెబుతారు. ఈ ఆలయం మొత్తం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న పునాదిమీద నిర్మించబడింది. ఈ పునాది 31 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో చాలా విశాలంగా శ్రీ చక్రం ఆకారంలో నిర్మింపబడ్డది. ఇలా ఈ ఆలయ నిర్మాణ శైలి అనేది దేశంలో మరెక్కడా కూడా కనిపించదు.

పద్మాక్షి అమ్మవారు: 

temples in warangalపద్మాక్షి అమ్మవారు కాకతీయుల ఆరాధ్య దైవం. అయితే 10వ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయిస్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం క్రీ.శ. 1117 లో నిర్మించబడింది. ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు. ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు. గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు. ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది.

శ్వేత గణపతి ఆలయం:

temples in warangalతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఈ శ్వేత గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్వేతార్కమూల గణపతిగా భక్తులచే పూజలందుకొంటున్నాడు.  అయితే శ్వేతం అంటే తెలుపు, అర్కం అంటే జిల్లేడు తెల్లజిల్లేడు బెరడుతో చేసే గణపతి ప్రతిమలను శ్వేతార్క గణపతిగా పిలుస్తారు. తెల్లజిల్లేడు మొక్క మూలం నుంచి వెలిశాడు కాబట్టి ఇక్కడి గణపతిని శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారు. వందేళ్లపైబడిన ఈ ఆలయంలోని మూర్తిని ఏ శిల్పీచెక్కలేదు తెల్లజిల్లేడు మొదలు భాగంపై గణనాథుడే స్వయంగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ చెట్టు బెరడుపైని గణపతి మూర్తికి అన్ని అవయవాలు ప్రస్ఫుటంగా కనిపించడం విశేషం. నల్లగొండ ప్రాంతంలో వందేళ్లనాటి తెల్లజిల్లేడు మూలం నుంచి ఏర్పడిన గణపతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. ఇలా శ్వేత రూపంలో వెలసిన గణపతి సర్వవిఘ్నాలను నివారిస్తూ భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు.

మెట్టు రామలింగేశ్వరాలయం:

temples in warangalతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, మడికొండ గ్రామంలో మెట్టుగుట్ట ఉన్నది. ఇక్కడ ఈ గుట్టపైన వెలసిన ఈ ఆలయాన్ని మెట్టు రామలింగేశ్వరాలయం అని పిలుస్తారు. మెట్టు గుట్టపైన శ్రీరాముడు శివలింగానికి పూజలు చేయడం వలన ఈ ఆలయానికి రామలింగేశ్వరాలయం అని పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదరెదురుగా ఉంటాయి.  ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడి మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణకాశి అని పిలుస్తుంటారు. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం:

temples in warangalతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో వర్ధన్నపేట మండలం లో అయినవోలు అనే గ్రామంలో శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం ఉంది. కాకతీయుల పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అయ్యన్న ఈ ఆలయాన్ని నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా అయినవోలుగా రూపాంతం చెందింది. ఈ దేవుడు శివస్వరూపముగా, శివుని మరో అవతారంగా చెప్పబడుచున్నది. దీనికి కారణం ముందు భాగంలో లింగ స్వరూపంలో మూలవిరాట్ మల్లన్న ఉండటం, ఈ శివలింగస్వరూపం అర్ద పానవట్టం కలిగి ఉండటం మరో విశేషం. ఒక లింగం శ్వేతవర్ణం కలిగి అర్ధపానవట్టం ఉండటం చేత ఈ ఆలయం, ఇక్కడి దైవము అయినా మల్లన్న స్వామివారు ఎంతో విశిష్టతను సంతరించుకున్నారు.

ఖిలా వరంగల్:

temples in warangalకాకతీయ రాజైన గణపతి దేవుడు 1199 ఈ కోట నిర్మాణం మొదలుపెట్టగా ఆ కోట నిర్మాణాన్ని రాణి రుద్రమదేవి పూర్తి చేసింది. ఈ కోటలో స్వయంభు శంబు లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగం మిగతా ఆలయాలలో శివలింగాలకు భిన్నంగా ఉంటుంది. ఓరుగల్లు కోట మొత్తం ఏడు కోటలతో శ్రీ చక్రం ఆకారంలో నిర్మించబడింది.

SHARE