Home Unknown facts ముక్కు పుడక ధరించడం స్త్రీలకు చాలా మంచిదని మీకు తెలుసా ?

ముక్కు పుడక ధరించడం స్త్రీలకు చాలా మంచిదని మీకు తెలుసా ?

0
ఆడపిల్లలకు జరిగే సంస్కారాలలో ముక్కు, చెవులు కుట్టించడం చాలా ప్రధానమైనది. దీనికి అధ్యాత్మికంగా, విఙ్ఞాన పరంగా కూడా చాలా కారణాలున్నాయి. ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణం. ముక్కుపుడక ధరించడం వల్ల  సంపంగిలాంటి ముక్కుకు కొత్త వింత అందాన్ని ఇస్తుంది. దీనిని స్త్రీలు ధరిస్తారు. ముక్కు పుడక ధరిస్తే ముఖంలో కొత్త కళ వస్తుంది అందం రెట్టింపు అవుతుంది.
ముక్కు పుడక
తెలుగు రాష్ట్రాలలో అయితే ఆడపిల్లకు చిన్నప్పటి నుండే ముక్కుపుడక ఉంటుంది. అందుకేనేమో తెలుగు ఆడపడుచులు కళ్ళకు నిండుగా కనిపిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు.
భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషం తో శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి రాయబారం నడుపుతుంది. పురాణాల్లో కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది ముక్కెరకు. హిందూ దేవతలు అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది.
బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెబుతారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు.
అందుకే ‘మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక’ అన్నాడో కవి. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు. భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి.
రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి. పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారు. ఒక్కో ప్రాంతాన్ని ఆచారాన్ని బట్టి ముక్కు పుడకలు ఉంటాయి. అయితే వీటిని ధరించడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అనే సందేహం రాకమానదు ముక్కు పుడకలు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాం.
  • ఘ్రాణ (వాసన చూసే) శక్తిలో పంచభూత తత్త్వాలు కలిసి ఉంటాయి. ప్రధానంగా ఇది భూ సంబంధమైనది.
  • బంగారు ధాతువు శుద్ధతకి ప్రతీక. వంట వండేటపుడు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు శుద్ధమై ఆహారం శుద్ధం అవుతుంది.
  • కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం దైవ నివేదనకి ముక్కుపుడక లేకుండా వంట చేస్తే పనికిరాదు. కాబట్టి ప్రతి భారతీయ మహిళ తప్పనిసరిగా ముక్కుపుడక ధరించాలి.
  • ప్రాణశక్తికి సంకేతమైన ఇడ పింగళ నాడులు ముక్కుపుడక వల్ల శక్తిమంతం అవుతాయి.
  • స్త్రీలు ఎక్కువగా శుభ్రపరిచే పనులలో ఉంటారు. ఆ సమయాలలో సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే ఎన్నో వ్యాధులు రాకుండా చేస్తుంది.
  • కంటికి కనిపించని దుష్ట శక్తులు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది.
  • మెదడులో ఉండే నాడీ వ్యవస్థని కూడా సరిచేయగల శక్తి ముక్కు పుడకకి ఉంది.

Exit mobile version