Home Unknown facts వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివలింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ?

వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివలింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ?

0

శ్రీ సోమేశవరస్వామి ఆలయాన్ని దక్షిణ కాశీగా భక్తులు భావిస్తారు. అంతేకాకుండా దీనిని కోటిలింగాల గుడిగా శైవభక్తులు ఆరాధిస్తారు. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న ఆ శివలింగానికి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Someswara Swamy Templeతెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని చారిత్రాత్మక ప్రసిద్ధి గాంచిన గ్రామము కొలనుపాక. ఆలేరు నుండి సిద్ధిపేట వైపు వెళ్లే మార్గంలో 6 కీ.మీ. దూరంలో ఈ కొలనుపాక ఉంది. ఇచట ఉన్న అతి పురాతన ఆలయమే శ్రీ సోమేశవరస్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారిని చంద్రుడు ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. అందుకే ఇది సోమేశ్వరాలయంగా పిలువబడుతుంది.

ఈ ఆలయ గర్భగుడిలో శ్రీ సోమేశ్వరుడు స్థావర లింగాకారంలో వెలసి ఉన్నాడు. ఈ లింగం నుండే జగద్గురువు రేణుకాచార్యులు అవతరించి వీరశైవ ధర్మాన్ని దశదిశలా వ్యాప్తి చేసినట్లు తెలుయుచున్నది. ఈ ప్రాచీన ఆలయమే వీరశైవానికి మూలస్థానమంటారు. పరమశివుడే స్వయంభులింగంగా ఉండి చంద్రుని కోరికపై ఇక్కడ దర్శనమిచ్చాడని, అప్పుడు అతడు అర్చించి పూజించినట్లు చెబుతారు.

ఇక్కడి శివలింగం పై వెయ్యిలింగాలు చెక్కబడి ఉండటం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ శివలింగాన్ని కోటి ఒక్క లింగంగా భక్తులు భావించి పూజిస్తుంటారు. అయితే దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడం జరుగుతుంది.

ఆలయం ముందు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం, గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విశిష్టతలను తెలియజేస్తోంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. వీరశైవ, జైన, వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది.

కోటొక్కటి లింగాలు భావించే ఈ సోమేశవరస్వామి ఆలయానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version