Home Unknown facts పాకిస్థాన్ లో ఉన్న హిందూ ఆలయాల స్థల పురాణం గురించి తెలుసా ?

పాకిస్థాన్ లో ఉన్న హిందూ ఆలయాల స్థల పురాణం గురించి తెలుసా ?

0

భారతదేశంలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల ఎన్నో ఆలయాలు ఉండగా పాకిస్థాన్ లో ఇప్పటికి కొన్ని ఆలయాలు భక్తులకి దర్శనం ఇస్తున్నాయి. మరి పాకిస్థాన్ లో ఉన్న హిందూ ఆలయాల స్థల పురాణం గురించి? ఆ ఆలయ విశేషాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హింగ్‌లాజ్‌ దేవి ఆలయం:

Hindu Temples In Pakistan

పాకిస్తాన్‌లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, బలూచిస్తాన్‌ అనే ప్రాంతంలో హింగ్‌లాజ్‌ దేవి ఆలయం ఉంది. సతీదేవి శరీర భాగాలు పడి వెలసిన శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. అమ్మవారి తల భాగంలో కొంత ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడి మూర్తికి రూపం అంటూ ఉండదు. ఒక చిన్నగుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని పిలుస్తారు. అందుకే ఈ అమ్మవారికి హింగ్‌లాజ్‌మాత అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లిం లు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అక్కడి స్థానికులు ఈ ఆలయాన్ని నానీ కీ మందిర్‌ అని పిలుస్తుంటారు.

కటాసరాజ మందిరం:

పాకిస్థాన్ లోని కటాస్ అనే గ్రామంలో కటాసరాజ మందిరం ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారతం లో పాండవులు అరణ్యవాస ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతకాలం ఈ ప్రదేశంలో గడిపినట్లుగా స్థల పురాణం. ఇంకా ఈ ఆలయ పురాణానికి వస్తే, సతీదేవి అగ్నికి అహుతైందని శివుడికి తెలిసిన వెంటనే శివుడి కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు భూమిమీద పడగ ఒకటి ఈ ప్రాంతంలో పడగ, రెండవది రాజస్థాన్ లోని అజ్మీర్ లో పడి పుష్కర్ రాజ్ గా వెలిసిందని పురాణం. 2005 లో ఈ ఆలయాన్ని భారత మాజీ ఉపప్రధాని లాల్ క్రిష్ణ అద్వానీ గారు సందర్శించారు.

శారదా పీఠం:

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని నీలం నది ఒడ్డున శారదా పీఠం ఉంది. ఇక్కడి శారదా దేవినే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతిదేవిగా కొలుస్తారు. ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని ఇక్కడే అధిష్టించాడని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయం శిధిలావస్థలో ఉంది.

ఆదిత్య మందిరం:

పాకిస్థాన్ లోని ముల్తాన్ ప్రాంతంలో ఉన్న అతిపురాతన ఆలయమే ఆదిత్య మందిరం. ఈ ఆలయాన్ని ముల్తాన్ సురయాదేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఉన్న మూలస్థానం ఆధారంగా ఈ ప్రాంతానికి ముల్తాన్ అనే పేరు వచ్చిందని చెబుతారు. స్థల పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు, జాంబవతికి కలిగిన కుమారుడు సాంబుడు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడని పురాణం.

నారాయణమందిరం:

పాకిస్థాన్ లోని కరాచీ లో నారాయణమందిరం ఉంది. ఈ ఆలయాన్ని 1849 లో నిర్మించారు. ఈ ఆలయానికి హిందువులే కాకుండా ముస్లింలు కూడా వస్తుంటారు. 1947 తరువాత ఈ ఆలయంలోని మూలావిగ్రహాలను భారతదేశానికి తరలించారు. అయితే 1989 లో కొంతమంది సాధువులు ఈ ఆలయాన్ని దర్శించగా ఆ తరువాత ఇక్కడకి భక్తుల రాక పెరిగింది.

శివహర్కరే ఆలయం:

పాకిస్థాన్ లోని కరాచీకి దగ్గరలో శివహర్కరే ఆలయం ఉంది. ఈ ఆలయంలో మహిషాసురమర్దిని దర్శమిస్తుంటుంది. అమ్మవారి శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటని ఇక్కడ సతీదేవి కన్ను పడిందని పురాణం.

ఈవిధంగా పాకిస్థాన్ లో ఈ ఆరు హిందూ దేవాలయాలు ఉన్నాయని చెబుతారు.

Exit mobile version