భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసి రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం గర్వించ దగ్గ ప్రముఖుల్లో ఒకరైన ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం.
రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఠాగూర్ అంటే గౌరవప్రదమైన అయ్యా అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు. అయితే 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి భాను సింహ, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు.
రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. అక్కడే కొన్ని రోజుల పాటు ఉన్న అయన ప్రపంచంలోని ప్రసిద్ధి వ్యక్తుల జీవిత చరిత్రలను, కాళిదాసు రచనలను చదువుతూ ఉండేవాడు. ఇలా ఆ తరువాత ఆయనే స్వయంగా రాయడం ప్రారంభించాడు.
రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. కానీ రవీంద్రుడు ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత 1883 డిసెంబరు 9 న మృ ణాలిని దేవీని వివాహమాడెను. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది.
అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్‌లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు.
రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.
ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు నైట్ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు.
మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు. కుల వివక్షను తొలగించటానికి బెంగాల్‌లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్‌లో శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు.
రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు. రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం జనగణమన, బంగ్లాదేశ్ అమార సోనార్ బంగ్ల జాతీయ గీతాలుగా ఎంపిక చేసుకున్నాయి.
ఇలా రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా చరిత్రలో నిలిచిపోయిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతి భారతీయుడి మనసులో ఇప్పటికి ఎప్పటికి శాశ్వతంగా ఉండిపోయారు.