విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు సేదతీరే వైకుంఠ గుహ!!! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన తిరుపతికి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి టూరిస్టులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పరిసర ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఏడు కొండలపై ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన తిరుమల క్షేత్రం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగింది.
 అందులో ఒకటి వైకుంఠ గుహ. వైకుంఠ గుహ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలా సార్లు వినే వుంటారు. గుహ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు కదా. అంతేకాదు శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ గుహలో సేదతీరేవారని మన పురాణాలు చెపుతున్నాయి. మరి ఇంతటి ఆశక్తికరమైన ఆ గుహ గురించి తెలుసుకుందాం…
 తిరుమల హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. వెంకటేశ్వరస్వామి నడయాడిన తిరుమల గిరిలో ఎన్నో అద్భుతాలున్నాయని మన పూర్వికులు చెప్తే మనం నమ్మం. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి అక్కడున్న ఎన్నో అద్భుతాల గురించి చెప్తూనే వున్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి ఈ రహస్య వైకుంఠ గుహ.
 ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.
ఇక్కడ చెప్పబోయే గాధ అప్పుడెప్పుడో త్రేతాయుగం నాటిది. అదేమంటే, రావణాసురుడు అపహరించుకొని పోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానర సేనతో కలిసి అడవిబాట పట్టారు.
 అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్య గిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముణ్ణి చూసిన అంజనాదేవి ఆనందపడుతూ .. నమస్కరిస్తూ … రండి అని ఆహ్వానించింది.
 ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసిన రామలక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వేంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా, శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంత మంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది.
 అక్కడ వానరులకు ఎంతోమంది స్త్రీ, పురుషులు కనిపించారు. వారందరూ శంఖు చక్రాలను ధరించి మల్లెపూవువలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్ళి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్యవిమానం కనిపించింది. సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని వేయి పడగల పై పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు.
 ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యము నుండి తెరుకొనే లోపే ఆ గుహ మాయమయింది.. జరిగిన విషయాన్ని మిగితా వానరసేనలకు చెప్పగా, సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు. వెంటనే జరిగిన విషయాన్ని శ్రీరామచంద్రులకు చెప్పుకున్నారు. అప్పుడు వానరులతో రాముడు  “మీరు తిరుమల కొండలను చూడడమే మహా అదృష్టం. శ్రీనివాసుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు.
 కేవలం ఆ గుహ ఒక్కటే కాదు ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్లా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు.” అని అన్నాడు.
“విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరికైనా అసాధ్యమే” అని శ్రీరాముడు వివరించాడట. తిరుమల కొండలలో ఇప్పటికీ అలాంటి ఎన్నో గుహలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు.
పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని . . మఠాధిపతులు, స్వామీజీలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేదతీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని … ఇది వినటం తప్ప, చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగిన ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR