దేశంలో శ్రీరాముడు కొలువై ఉన్న ఈ ఆలయాలని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి

0
2069
శ్రీమహావిష్ణవు అవతారాల్లో రామావతారం ఏడవదిగా చెaబుతారు. లోకకల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో అవతరించినదే శ్రీరామావతారం. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం, శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన ప్రదేశాలు, స్వయంభువుగా వెలసిన ఆలయాలు,  ప్రత్యేకతలు కలిగి ఉన్న కొన్ని రామాలయాలు ఉన్నవి.  మరి శ్రీరాముడు కొలువై ఉన్న కొన్ని ప్రసిద్ధ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయంలో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైకుంఠ రాముడు – భద్రాచలం 
sri rama temples
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది. భద్రాచలంలోని పవిత్ర నది గోదావరి నది తీరమున సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు. శ్రీ రాముడు వెలసిన మిగతా ఆలయాల్లో రాముడి మూలవిరాట్టు రెండు చేతులతో మానవుని రూపాన్ని పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీ రాముడి విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణంను, ఎడమచేతిలో విల్లును ధరించి విష్ణువు వలె కుడిచేతిలో శంఖం ను, ఎడమచేతిలో చక్రం ని ధరించి ఉంటాడు. అందుకే ఇక్కడ వెలసిన రాముడిని వైకుంఠ రాముడిని, భద్రాద్రిరాముడు అని, చతుర్భుజ రాముడిని, గిరినారాయణుడని భక్తులు కొలుస్తుంటారు. గర్భాలయంలో ఉన్న శ్రీరాముని మూలవిరాట్టు, వనవాసంలో ఉన్నప్పుడు వారు ఏర్పరుచుకున్న పర్ణశాల, ఇక్కడే నివసించిన శబరికి రాముడు ఇచ్చిన వరం ఇలా ఎన్నో విశేషాలు కలిగిన మహిమ గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
శ్రీ రాముడి జన్మస్థలం – అయోధ్య :
sri rama temples
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదు జిల్లాకి 6 కి.మీ. దూరంలో సరయు నది తీరంలో అయోధ్య అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ ప్రదేశం 108 దివ్యతిరుపతిలలో ఒకటిగా, శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిగా, మోక్షదాయకమైన సప్తపురములలో అయోధ్యాపురం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం దశరథమహారాజు సంతానం కోసం ఇక్కడ పుత్రకామేష్టియాగం చేసాడు. ఆ యజ్ఞ ఫలితంగా శ్రీరామచంద్రుడు దశరథమహారాజుకి కుమారునిగా ఈ అయోధ్యలో జన్మించాడు.
శ్రీ కోదండ రామాలయం – ఒంటిమిట్ట : 
sri rama temples
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం అనే దేవాలయం ఉన్నదీ. ఇక్కడ ఒకే శిలపైనా శ్రీరాముని, సీతను, లక్ష్మణుని చూడవచ్చును. ఈ ఆలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి ఈ ప్రాంతానికి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే అని పేర్కొంటారు.
రామస్వామి – తమిళనాడు : 
sri rama temples
తమిళనాడు రాష్ట్రం, కుంభకోణంలో శ్రీ ఆది కుంభేశ్వరాలయానికి దగ్గరగా ప్రసిద్ధమైన రామస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి ఒక పీఠంపై కొలువుదిరి ఉండటం విశేషం అయితే హనుమంతుడు వీణపై స్వామివార్లను స్తుతిస్తూ ఉన్నట్లు విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. 20 ఎకరాల వైశాల్యం కలిగిన ఈ పెద్ద కోనేటిలో 20 బావులున్నాయి. మాఘమాసంలో భారతదేశంలో గల పుణ్యనదుల నదీజలాలు ఈ బావులలోకి ప్రవహిస్తాయని ప్రతీతి. ఇక్కడ మాఘమాసం అనే ఉత్సవం 12 సంవత్సరాలకి ఒకసారి అతి వైభవంగా జరుగుతుంది.
 కాలరామ మందిరం – మహారాష్ట్ర 
sri rama temples
మహారాష్ట్ర, నాసిక్ లో కాలరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాలు నల్లరాతితో తయారుచేయబడినవి అందుకే ఈ ఆలయానికి కాలరామ మందిరం అనే పేరు వచ్చినదని చెబుతారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 12 సంవత్సరాల వయసు పట్టిందని పురాణం. ఇక ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, ఉదయం సూర్య కిరణాలు ఆలయంలో తూర్పు దిక్కున ఉన్న ద్వారం నుండి ఆంజనేయస్వామి ఆలయం నుండి రామమందిరం లో ఉన్న సీతారామలక్ష్మణులపై పడుతుంటాయి. ఇలా ఉదయం సూర్యకిరణాలు సీతారామలక్ష్మణులపై పడే విధంగా చేసిన అప్పటి వాస్తు నిర్మాణం అద్భుతమని చెప్పవచ్చు.
చిత్రకూట్ – మధ్యప్రదేశ్ : 
sri rama temples
మధ్యప్రదేశ్ రాష్ట్రం, అలహాబాద్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ ఉంది. ఇక్కడే సీతారామ లక్ష్మణులు 11 సంవత్సరాలు నివసించారని చెబుతారు. ఇక్కడి ప్రాంతంలో మందాకిని నది ప్రవహిస్తుంది. ఇక్కడే రామఘాట్ ఉంది. శ్రీరాముడు ఇక్కడ నివసించేపుడు ప్రతి రోజు ఈ నదిలోనే స్నానం చేసేవాడని అందుకే భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసి మిగిలిన ప్రదేశాలను దర్శిస్తారు. ఇక్కడే రామదర్శన్ అనే ఆలయం ఉంది. ఇక్కడి చిత్రకూట్ కి దగ్గరలోనే ఒక పర్వతం ఉంది. దీనిపేరు కామత్ గిరి అని అంటారు. ఈ కొండపైన శ్రీరాముడు కొంత కాలం నివసించాడని చెబుతారు. అందుకే భక్తులు ఈ కొండచుట్టు ప్రదక్షిణాలు చేస్తారు.
శ్రీ రామచంద్రమూర్తి ఆలయం – కేరళ : 
sri rama temples
కేరళ రాష్ట్రం, తిప్రయర్ నది తీరాన శ్రీ రామచంద్రమూర్తి ఆలయం ఉంది. విష్ణుమూర్తి అవతారంగా భావించే శ్రీరాముడు చతుర్భుజుడిగా కొలువై ఉండగా స్వామికి ఇరువైపులా శ్రీదేవి – భూదేవి లను ప్రతిష్టించారు. ఈ ఆలయంలో విగ్రహం పైన నెమలి నీడ పడినప్పుడే విగ్రహాన్ని ప్రతిష్టించారని పురాణం. నీడ పడిన ప్రదేశంలో బలిపీఠం ప్రతిష్టించారు. అప్పటినుండి బలిపీఠం కూడా విగ్రహంతో సమానంగా పూజలు అందుకుంటుంది.
రెండవ భద్రాది – నల్గొండ :
sri rama temples
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కోదాడ లోని తమ్మరబండపాలెం లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న రాముడి రూపం నాలుగు చేతులతో భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం. ఇలా రాముడు వైకుంఠ రాముడిగా దర్శనమిచ్చే ఆలయాలలో ఇది రెండవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక భద్రాచలం లో రామకోటి ఉత్సవాలు నిర్వహించినట్లే ఈ ఆలయంలో కూడా రామకోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
SHARE