Home Unknown facts అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పే మంగళగౌరి ఆలయం ఎక్కడ ఉంది?

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పే మంగళగౌరి ఆలయం ఎక్కడ ఉంది?

0

శివుడి అర్దాంగి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిసాయి. సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతారు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. మరి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mangla Gauri Temple

బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో గయ అనే ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో విష్ణుపద మందిరానికి దగ్గరలో ఫల్గుణి నది తీరములో ఈ మంగళగౌరి దేవాలయం ఉంది. మన దేశములో ఉండే అష్టాదశ శక్తి పీఠాలలో ఈ మంగళ గౌరీ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం తూర్పుముఖంగా మంగళగిరి అనే పర్వతం పైన వెలసింది. భక్తులు ఈ అమ్మవారిని మంగళగౌరి మరియు సర్వమంగళాదేవి అని పిలుస్తుంటారు.

సతీదేవి వక్షస్థలం ఈ క్షేత్రంలో పడటం వలన ఇది పాలనపీఠంగా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో గర్భ గుడి వైశాల్యం చాలా తక్కువగా ఉంటుంది. ఈ గర్భ గుడిలోకి కేవలం ఇద్దరు లేదా ముగ్గురు లోపలికి వెళ్ళడానికి మాత్రమే చోటు అనేది ఉంటుంది. గర్భాలయంలో ఉండే అమ్మవారు పట్టు వస్రాలతో, రాక్షస సంహారిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో నంది,నందికి ఎదురుగా శివలింగాకారంలో ఉండే పరమేశ్వరుడు భక్తులకి దర్శనం ఇస్తాడు.

శ్రీ మంగళగౌరి దేవి ఆలయం చుట్టూ దశావతారాలు చెక్కిన ఆలయం, అరణ్యదేవి ఆలయం, కాళిదాసుని కరుణించిన దేవత, మహిషాసుర మర్దిని, నిరంజనా అహల్య దేవి ఆలయాలు ఈ పవిత్ర గయ క్షేత్రములో ఉన్నాయి. ఈ ప్రదేశం అంత కూడా ఫల్గుణి, మధుర శ్వేదా నదుల సంగమ స్థానముగా ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయము నందు శ్రావణ మంగళవారాలలో అమ్మవారికి వ్రతాలు, పూజలు చేస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు,ఆశ్వియుజ శరనవరాత్రులు మరియు మహాశివరాత్రి,కార్తీక మాసాలలో భక్తులు విశేష పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.

Exit mobile version