ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, అతి ప్రాచీన ఈ దేవాలయాన్ని 18 వ శతాబ్దంలో ఒక ఆంగ్లేయుడు పునరుద్దరించినట్లు తెలియుచున్నది. ఇంకా అమ్మవారు కొలువై ఉన్న ఈ ఆలయంలోనే పంచ లోహాలతో తయారుచేయబడిన అయ్యప్పస్వామి విగ్రహం కూడా ఉండటం విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్టణం లో శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం ఉంది. ఈ ఆలయం సుమారు 400 వందల సంవత్సరాల క్రితం 16 శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలియుచున్నది. అయితే ఆ తరువాత 18 వ శతాబ్దంలో రాబర్ట్ సన్ అనే ఆంగ్లేయుడు ఈ ఆలయాన్ని పునరుద్దరించినట్లు తెలియుచున్నది. ఈ ఆలయ ముఖద్వారం అనేది రెండు అంతస్తులుగా నిర్మించబడింది. ఆ ఆంగ్లేయుడు బహుకరించిన ఒక గంట ఇప్పటికి ఆలయంలో మనం చూడవచ్చు.
ఇక ఈ ఆలయ గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరస్వామి వారు ప్రతిష్టించబడి ఉన్నారు. స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు, ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. ఈ గర్భాలయానికి సమీపంలోనే శ్రీ రాజరాజేశ్వరి మాత కిరీటధారి యై, సర్వాలంకారణాలతో శ్రీ చక్ర ప్రతిష్ఠతో కూడి మరో మంటపంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం భక్తులచే లలితా పారాయణం, లింగాష్టకం పారాయణం చేయబడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి, శ్రీ దేవిభూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి 18 మెట్లతో కూడిన అయ్యప్ప స్వామి ఆలయం దర్శనమిస్తాయి. అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప స్వామివారి విగ్రహం పంచలోహాలతో తయారుచేయబడింది. ఈ మందిరం ముఖ మంటపం పై హరిహరుల మధ్య అయ్యప్ప విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి, కార్తీకమాసం, శనిత్రయోదశి మొదలైన పుణ్యతిథులు ఇచట వైభవంగా జరుపబడుతాయి. ఇచట ప్రతి సంవత్సరం స్వామివారికి మూడు రోజులు కల్యాణ మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏకాదశి రోజున రాఘ వేంద్రస్వామి జయంతి, హనుమాన్ జయంతులు గొప్పగా నిర్వహించబడతాయి.