మహాగణపతి వెలసిన ఈ దేవాలయంలో హిందువులు కానీ వారికీ ఎట్టి పరిస్థితులలో కూడా అనుమతి అనేది లేదు. ఈ ఆలయంలోని వినాయకుడిని మహాగణపతిగా పిలుస్తారు. మరి మహాగణపతి వెలసిన ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో కథాకళి నృత్యాన్ని ఎవరు సృష్టించారు? దానివెనుక గల కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రంలో అతి ముఖ్యమైన మరియు ప్రాచీనమైన ఆలయంలో కొట్టారక్కర గణపతి ఆలయం కూడా ఒకటి. ఇది క్విలాన్ పట్టణానికి తూర్పున 22 కి.మీ. దూరంలో ఈ కొట్టారక్కర క్షేత్రం వెలసి ఉంది. ఇక్కడి ఆలయంలో శివుని కుటుంబానికి చెందిన విగ్రహాలు ఉన్నాయి.
ఇక ఈ ఆలయంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈ ఆలయంలోని ప్రధాన దైవం పరమశివుడు అయినప్పటికీ అదే క్షేత్రంలో ఉపదైవంగా పూజలందులుకుంటున్న మహాగణపతి పేరుమీదుగా ఈ క్షేత్రానికి మహాగణపతి క్షేత్రం అనే పేరు వాడుకలో ఉన్నది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు, పార్వతీదేవి, శ్రీమహాగణపతి, శ్రీ మురుగన్, శ్రీ అయ్యప్ప మరియు నాగరాజు మొదలగు దేవతామూర్తులు ప్రధానంగా పూజలందుకోవటం జరుగుతుంది.
అయితే ఈ క్షేత్రంలో వెలసిన మహాగణపతి ఆశీస్సుల కారణంగానే కొట్టారక్కర తంబూరన్ అనే నృత్య కళాకారుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకు జరిగిన వివాదంలో పంతం కొద్దీ కథాకళి అనే పేరుగల ఒక నూతన నృత్యాన్ని సృష్టించగలిగాడు. మొదట్లో కథాకళి నృత్యాన్ని రామనట్టం అనే పేరుతో పిలిచేవారు. తరువాత అది కథాకళి నృత్యంగా పేరు మారింది.
ఇలా కేరళలో జన్మించి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కథాకళి నృత్యం యొక్క తొలి ప్రదర్శన కూడా ఈ కొట్టారక్కర మహాగణపతి ఆలయంలోనే ఇవ్వబడినట్లు తెలియుచున్నది.