Home Unknown facts Parvathidevi avatharalu enni? avi enti?

Parvathidevi avatharalu enni? avi enti?

0

పార్వతీదేవి అవతారాలు మొత్తం తొమ్మిది గా చెబుతారు. ఈ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఇంకా ఈ అమ్మవారు బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని వాటినే నవదుర్గలు అని చెబుతారు. మరి ఆ అవతారాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శైలపుత్రి:హిమవంతుడు తపస్సు చేసి , ఆమెను కుమార్తెగా కోరగా అతనికి జన్మించినది చెబుతారు. ఆ అమ్మవారు కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరిస్తే విజయోత్సాహం కలుగుతుంది.
బ్రహ్మచారిణి:ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది.
చంద్రఘంట:దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల, ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.
కూష్మాండ రూపం:జ్ఞానరూపిణి, సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి ఈ అమ్మవారు.
స్కందమాత:ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ. శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.
కాత్యాయిని:దేవతల కార్యార్దము కతుడు అనే మునిపుంగవుని ఆశ్రమం లో ఒక జన్మలో పుట్టి అక్కడే పెరగడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాత్యాయనీ మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది.
కాళరాత్రి :మృత్యువు కే భయకారిణి , ప్రళయకాలములో యముణ్ణి కూడా నశింపజేయగలదీ అయిన మూలశక్తి ఈమె. కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.
మహాగౌరి:పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని, పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా కాళీ అని పిలుస్తాడు. దాంతో ఆమె శివుమితో పంతగించి , బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేసి ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లటి ఛాయతో మహా గౌరి గా అవతరించినది . అష్టమశక్తియైన మహాగౌరి పూజ కారణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ భాగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది.
సిద్ధిధాత్రి:తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.
ఈ విధంగా పార్వతీదేవి తొమ్మిది అవతారాలలో భక్తులకు దర్శనం ఇస్తుంది.

Exit mobile version