Home People Paying Tribute To Nelson Mandela’s 100th Birth Anniversary

Paying Tribute To Nelson Mandela’s 100th Birth Anniversary

0

నల్ల జాతి హక్కుల రక్షణకోసం పోరాడిన మహానుభావుడు నెల్సన్ మండేలా.ప్రత్యర్థిని అగౌరవ పరచకుండానే వారిపై విజయం సాధించిన నేత. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి దురహంకారుల పాలన నుండి నల్లజాతి ప్రజలను విముక్తి చేయటానికి జీవితాన్ని పణంగా పెట్టి పోరాడిన విప్లవ యోధుడు. 28 ఏళ్లపాటు జైలు జీవితం గడిపినా ఉద్యమం ఊపిరిని వదలని ధీరుడు నల్ల జాతి సూరీడు నెల్సన్‌ మండేలా. అందుకే ఆయన ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారు. మరి అయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? నల్లజాతి ప్రజలకోసం అయన ఏవిధంగా పోరాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nelson Mandela

నెల్సన్‌ రోలిహ్లాహ్లా మండేలా 1918 జులై 18న దక్షిణాఫ్రికా కేప్‌ ప్రాంతంలోని ఉమ్‌టాటా మెవ్‌జో గ్రామంలో థెంబు రాజవంశీయుల కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి గాడ్లా హెన్రి పకనియిస్వ, తల్లి నోసెకిని ఫన్ని. ఆమె ఆయన తండ్రికి మూడవ భార్య. దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రాంత ట్రాన్స్‌కీయన్‌ ప్రాంతంలోని థెంబు ప్రజలను ఆయన తాత గుబెంగ్‌కూకా పాలించాడు. మండేలా తండ్రి స్థానిక పాలకుడు. 1926లో అవినీతి ఆరోపణలను చేస్తూ ఆయనను రాజు తొలగించాడు. వాస్తవం ఏమిటంటే ఆయన న్యాయాధిపతి హేతు విరుద్ధ పద్ధతులకు అనుగుణంగా పనిచేయకపోవటంతో పదవిని కోల్పోయాడు. మండేలాకు ముందు ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ పాఠశాలకు హాజరుకాలేదు. మండేలా పాఠశాలకు వెళ్ళిన మొదటి రోజునే అప్పటి ఆచారం ప్రకారం ఉపాధ్యాయిని ఆయనకు నెల్సన్‌ అనే ఇంగ్లీష్‌ పేరుపెట్టింది. ఇది వలస పాలన మిగిల్చిన మచ్చ. అందుకే మండేలాగానో, మదీబాగానో ఆఫ్రికా పిలుస్తూ ఓ రకమైన నిరసన, మూలాల్ని మిగుల్చుకునే తపన పడుతుంది. ఆయన తొలి జీవితం థెంబు తెగ ఆచారాలు, సాంప్రదాయాల మధ్య గడిచింది. ఆయన తల్లి, ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి కును గ్రామంలో పెరిగాడు. అక్కడ ఆయన పశువులను కాస్తూ ఇతర బాలురతో కలిసి ఎక్కువ సమయం బయటనే గడిపేవాడు.

మండేలా తల్లి ఆయనను క్వెక్‌జెనిలోని గ్రేట్‌ ప్యాలెస్‌కు తీసుకువెళ్ళింది. అక్కడ థెంబు రాజ ప్రతినిధి జొంగిన్‌టాబా డలిన్‌డైబో సంరక్షణలోకి వెళ్ళాడు. ఆయన, ఆయన భార్య నోయెన్‌గ్లాడ్‌ మండేలాను తమ కుమారుడు జస్టిన్‌, కుమార్తె నొమాఫుతో సమానంగా చూసుకున్నారు. రాజభవనానికి పక్కనే ఉన్న మెథడిస్ట్‌ మిషన్‌ స్కూల్‌లో ఆయన చదువుకున్నాడు. తరచుగా రాజభవనానికి వచ్చే ముఖ్యాధికారి జోయి ప్రభావంతో చరిత్రపై ఆసక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేకత పెరిగింది. ఇతర విద్యార్థులతో కలిసిమెలిసి తిరగటంతో ఒంటరిగా ఉండే స్వభావం నుండి బయటపడ్డానని ఓసారి చెప్పాడు. ఆయనకు జీవితాంతం ఇష్టమైనదిగా ఉన్న తోటల పెంపకాన్ని అక్కడే నేర్చుకున్నాడు. జూనియర్‌ సర్టిఫికెట్‌ కోర్సును ఆయన రెండు సంవత్సరాలలో పూర్తిచేశాడు.

మండేలా బిఎ డిగ్రీ కోసం 1939లో ఫోర్ట్‌హేరే యూనివర్సిటీలో చేరాడు. వెస్లిహౌస్‌ డార్మిటరీలో మండేలా ఉండేవాడు. ఆయనకు జీవితాంతం మిత్రుడుగా ఉన్న ఆలీవర్‌ టాంబూ అక్కడ ఆయనతో కలిసి ఉన్నాడు. అబ్రహాం లింకన్‌ను గురించిన నాటకాలలో నటించేవాడు. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత ఆహారం నాణ్యత బాగా లేదని బారుకాట్‌ చేయటంతో ఆయనను యూనివర్సిటీ నుండి తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. ఆయన తర్వాత తన డిగ్రీని పూర్తిచేయటానికి తిరిగి రాలేదు.

మండేలా న్యాయశాస్త్రాన్ని అభ్యసించటం కోసం విట్‌ వాటర్‌ స్రాండ్‌ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ ఆయన ఒక్కడే నల్లజాతి విద్యార్థి. అక్కడే ఆయనకు జాతి వివక్ష ఎదురైంది. అక్కడ ఆయనకు ఉదారవాదులు, కమ్యూనిస్టులైన యూరోపియన్‌, యూదు, భారతీయ విద్యార్థులతో సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయ చైతన్యం పెరగటంతో 1943లో జరిగిన బస్‌ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎయన్‌సిలో చేరిన తర్వాత వాల్టర్‌ సిసులు ప్రభావం ఆయనపై పడింది. ఇతర ఎయన్‌సి కార్యకర్తలతో కలిసి వోర్లాండోలోని సిసులు ఇంటి వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడు. బానిసత్వానికి వ్యతిరేకంగా యువతను సమీకరించేందుకు 1944లో లెంబెడె అధ్యక్షునిగా ఎయన్‌సి యువజన విభాగం ఏర్పడింది. మండేలా ఎగ్జిక్యూటివ్‌ కమిటి సభ్యునిగా ఉన్నాడు.

ఎయన్‌సి కార్యకర్త, నర్స్‌ ట్రైనింగ్‌లో ఉన్న ఎవెలిన్‌ మాసెను మండేలా 1944లో కలిశాడు. అదే సంవత్సరం అక్టోబర్‌లో వారిరువురూ వివాహం చేసుకున్నారు. 1945లో వారికి కుమారుడు మదీబా థెంబి థెంబకైల్‌ పుట్టాడు. కుమార్తె మెకాజివి 1947లో పుట్టింది. కాని మెనింజైటిస్‌తో తొమ్మిది నెలలకే మరణించింది.

జాతి వివక్షకు వ్యతిరేకంగా భారతీయులు, కమ్యూనిస్టు గ్రూపులతో కలిసి ఉమ్మడి పోరాట కార్యక్రమానికి ఎయన్‌సి ప్రణాళిక రూపొందించింది. మహాత్మాగాంధీ కార్యక్రమాలతో ప్రభావితమై దీనిని అహింసతో అమలు చేయాలని కార్యక్రమాన్ని రూపొందించారు. 10 వేల మంది హాజరయిన డర్బన్‌ మీటింగ్‌లో ప్రతిఘటన కార్యక్రమాన్ని మండేలా ప్రారంభించాడు. అందుకుగాను ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసి, మార్షల్‌ స్క్వేర్‌ జైలులో కొద్దికాలం నిర్బంధించింది. దక్షిణాఫ్రికాలో మండేలా నల్లజాతి నాయకులలో ముఖ్యుడని ఈ ఘటనలు స్పష్టం చేశాయి.

1952 జులైలో సప్రెషన్‌ ఆఫ్‌ కమ్యూనిజం యాక్ట్‌ కింద జోహాన్నెస్‌బర్గ్‌లో అరెస్ట్‌ చేసిన 21 మందిలో మెరోకా, సిసులు, యూసుఫ్‌ దాదూతో పాటు మండేలా కూడా ఉన్నాడు. తన పాలనకు అత్యంత వ్యతిరేకులను ప్రభుత్వం స్టేట్యూటరీ కమ్యూనిజం పేరుతో శిక్షించటానికి పూనుకుంటున్నది. దానిలో భాగంగా వీరికి తొమ్మిది నెలల శిక్ష విధించి, తర్వాత రెండు సంవత్సరాలకు పొడిగించారు. మండేలా ఒకే సమయంలో ఒకరికి మించి ఎక్కువ మందితో మాట్లాడకూడదని ఆరు నెలల నిషేధం విధించారు. మండేలా తన ట్రాన్స్‌వాల్‌ ప్రాంత అధ్యక్ష బాధ్యతలు నిర్వహించటం అసాధ్యంగా మారింది.

జాతిని ఏకం చేయడం కోసం మండేలా తీవ్ర కృషి చేశారు. ఆయన ప్రసంగాలు జాతిని ప్రభావితం చేశాయి. ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయని తెలిపాడు. జాతి వివక్ష అమాయక ప్రజలను బలి తీసుకుంటుందని, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవాల్సి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు నెల్సన్ మండేలా. జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు అని చెప్పి తన జాతికి నమ్మకాన్ని, ధీమాను కల్పించిన మహానుభావుడు మండేలా.

నల్లజాతి తిరుగుబాటు పోరాటంలో మండేలా ఇరవై ఏడేళ్ల పాటు దుర్భరమైన జైలు జీవితం గడిపారు. మండేలా, ఆయన సహ ఖైదీలను ప్రిటోరియా నుండి రాబిన్‌ ఐలాండ్‌ జైలుకు తరలించారు. ఆయన అక్కడ 18 సంవత్సరాలు శిక్షను అనుభవించాడు. అక్కడ ఎనిమిది అడుగుల పొడవు, ఏడు అడుగుల వెడల్పు ఉన్న జైలుగదిలో ఒంటరిగా శిక్షను అనుభవించాడు. అక్కడ సున్నపుక్వారీలలో పనిచేయించారు. నల్లజాతి పోరాట వీరుల త్యాగాలతో స్ఫూర్తి పొందిన మండేలా, నల్లవారి హక్కుల కోసం ఆవిర్భవించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. తెల్ల వారి ప్రలోభాలకు లొంగకుండా జాతి వివక్షపై పోరాడారు. తదనంతరం దక్షిణాఫ్రికాలో ఎన్నికైన తొలి నల్లజాతి అధ్యక్షునిగా చరిత్రపుటలకెక్కారు. మండేలా నల్లజాతికి సాధించి పెట్టిన తేనెపట్టు స్వేచ్ఛ. జాతికి అతడు రాసిపెట్టిన రాజ్యాంగం ఆత్మగౌరవం.

1994, ఏప్రిల్‌ 27న దక్షిణాఫ్రికా ఎన్నికలు జరిగాయి. 63 శాతం ఓట్లను పొంది ఎయన్‌సి విజయం సాధించింది. తొమ్మిది ప్రాంతాలకుగానూ ఏడు ప్రాంతాలలో ఎయన్‌సి విజయం సాధించింది. మే 10వ తేదీన మండేలాను అధ్యక్షునిగా ఎన్నుకున్నది. 1996లో దక్షిణాఫ్రికా నూతన రాజ్యాంగాన్ని ఆమోదించారు. రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికవటానికి అవకాశం ఉన్నా 1999 ఎన్నికలలో ఆయన పోటీచేయలేదు. తాను ఏర్పాటు చేసిన నెల్సన్‌ మండేలా ఛారిటబుల్‌ ట్రస్టు కార్యకలాపాలలో ఎక్కువగా భాగస్వామి అయ్యాడు. ఊపిరితిత్తుల అనారోగ్యం సమస్య ఆయనను బాధిస్తూవచ్చింది. ఆ వ్యాధికి చికిత్స పొందుతూ 2013 డిసెంబరు 5న మండేలా 95 సంవత్సరాల వయసులో మరణించాడు. ప్రభుత్వం 10 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. సంతాప కార్యక్రమాలలో 90 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

దక్షిణాఫ్రికాకు రెండు జీవిత చరిత్రలు. ఒకటి ఆ దేశానిదయితే రెండోది మండేలాది. మండేలా లేకపోతే దక్షిణాఫ్రికా లేదంటారు. మండేలా జీవిత చరిత్రే దక్షిణాఫ్రికా జీవిత చరిత్ర అంటారు. మావో, లెనిన్, గాంధీలా మండేలా తన జాతి ప్రజలకు విముక్తి ప్రదాత. ప్రపంచ దేశాల ప్రియతమ నేతగా నిలిచిపోయారు.

Exit mobile version