చపాతీలు గట్టిగా వస్తున్నాయని చేయడమే మానేస్తున్నారా? ఇలా చేసి చూడండి!

మనదేశంలో అన్నం తినే వాళ్ళకంటే చపాతి తినే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది. పురాణకాలం నుండి రోటీలు, చపాతీలు ముఖ్యాహారంగా ఉంటూ వచ్చాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చపాతీలు ప్రధాన ఆహారంగా ఉంది. అయితే ఈ చపాతీలు చేయడం కూడా ఒక కళే. చపాతీలను కేవలం నిమిషాల్లో తయారు చేసేవాళ్ళు ఉన్నారు.  కానీ కొంతమంది సమస్య ఏంటంటే, ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, తమ చపాతీలు మెత్తగా రావు. విషయం ఏమిటంటే వంట ఏదైనా చేసేటప్పుడు, ఆ పదార్థాలను తయారుచేసే సరియైన విధానం తెలిసివుండటం ముఖ్యం.
గోధుమపిండితో కొంచెం సన్నగా పలుచగా చేస్తే పుల్కా అని,కొద్దిగా లావుగా,మందంగా చేస్తే చపాతీ అని,పొరలు పొరలుగా చేసి కూర స్టఫింగ్ చేస్తే పరోటా అని అంటాం. చాలామందికి చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల చపాతీలు గట్టిగా వస్తాయి. అవి తినలేక దవడలు వాచిపోతాయి. తినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది చపాతీలు మృదువుగా రావటం లేదని చేయటం మానేస్తు ఉంటారు.
అయితే చపాతీలు చేసేటప్పుడు కూడా కొన్ని పాటించాల్సిన పద్ధతులున్నాయి. ‘పిండి కొద్దీ రొట్టె’ అన్నట్లు- ఎన్ని చపాతీలు అవసరమో అంతకు సరిపడా పిండినే కలుపుకోవాలి. అలా పరిమాణం నిర్దిష్టంగా ఉండటం వల్ల అందులో కలిపే ఉప్పు, నూనె.. వంటివి సులభంగా అంచనా వేయవచ్చు. పిండి కలిపే సమయంలో కొంతమంది నెయ్యి లేదా నూనె, పెరుగు అందులో కలుపుతారు. వీటన్నిటినీ ఎంతో కొంత అని కాకుండా, తీసుకున్న పిండికి తగిన పాళ్లలో కలిపినప్పుడే చపాతీలు మృదువుగా వస్తాయి.
చపాతీలు మెత్తగా ఎన్ని గంటలైన మృదువుగా రుచికరంగా ఉండాలంటే చపాతి పిండి లో కొద్దిగా గోరు వెచ్చని పాలు పోసి పిండి కలిపితే చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి.  చపాతీ మెత్తగా,అంచులు అన్ని సమానంగా వచ్చి బాగా కాలాలంటే కూడా పిండి కలిపే సమయంలో కొంచెం వేడిపాలను పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలో 60 శాతం నీటిని,40 శాతం పాలను పోసి కలిపితే చపాతీలు చల్లారిన తర్వాత కూడామెత్తగా,మృదువుగా ఉంటాయి. అలాగే తింటున్నప్పుడు ఎంతో కమ్మగా ఉంటాయి. పైగా పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తుంది.
చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి.
అరచెంచా బేకింగ్ సోడా పిండిలో కలపడం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. పొంగుతాయి కూడా.
చపాతీలు చేయడానికి ఒక గంట ముందే పిండిని కలిపి పెట్టుకోవాలి. పిండి కలిపాక గంట వరకు చపాతీ చేయకూడదు. గంట లోపు చపాతీ చేస్తే గట్టిగా వస్తాయి.
చపాతీలు చేసుకునేటప్పుడు పొడి పిండిని ఎంత వీలైతే అంత తక్కువగా ఉపయోగించాలి. లేకపోతే చపాతీలు గట్టిపడే ప్రమాదం ఉంది. చపాతీలు మెత్తగా రుచిగా రావాలంటే బాగా పండిన అరటిపండు ముక్కను వేసి బాగా కలిపి అరగంట తర్వాత చపాతీ చేసుకోవాలి.
పుల్కాలు/చపాతీలు మెత్తగా ఉండి,బాగా పొంగాలి అంటే గోధుమ పిండిలో కొంచం పెరుగు కానీ/మజ్జిగ కానీ వేసి కలపండి. అలా కలిపినా చపాతీ/పుల్కల పిండి ని ౩౦ నిముషాలు మూతపెట్టి ఉంచిన తరువాత పుల్కాలు/చపాతీలు చేయండి. అప్పుడు అవి మెత్తగా ఉండి,బాగా పొంగుతాయి.
చపాతీలు ఒత్తుకున్న తర్వాత వాటిని మొదట పచ్చిదనం పోయే వరకు పెనం మీద కాసేపు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాలనివ్వాలి. తర్వాత మంట మధ్యస్థంగా ఉంచాలి. ఇలా అవసరమైనంత ఉష్ణోగ్రత అందించడం వల్ల చపాతీలు మెత్తగా ఉంటాయి. మరీ, ఎక్కువ మంట పెట్టి కాల్చినా అవి గట్టిగా వచ్చేస్తాయి. అందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం.
కాల్చిన చపాతీలను వెంటనే మూత ఉండే పాత్రల్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా, మృదువుగా, వేడిగా ఉంటాయి అయితే చపాతీలు కాల్చిన తరువాత హాట్ ప్యాక్ లో వెంటనే పెట్టకూడదు ఆలా పెడితే ఆవిరి వచ్చి చపాతీలు తడిగా అవుతాయి. అందుకే ఒక 10 నిమిషాల తరువాత హాట్ ప్యాక్ లో పెట్టాలి. ఇలా ఒక క్రమ పద్ధతిలో చపాతీలు చేస్తే.. చాలా చక్కగా, మెత్తగా, మృదువుగా వస్తాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR