వినాయకుని పూజల్లో ప్రతి భాగంలోనూ ప్రకృతి తత్వం ఉంటుంది

భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితిగా జరుపుకుంటాం. ఈ పండగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. భారతీయ సమాజంలో ప్రత్యేకత కలిగిన ఈ పండుగను పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా జరుపుకొంటారు. గణపతి నవరాత్రులు, అందంగా అలంకరించిన మండపాలు ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఇంటా వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తారు.

3-Rahasyavaani-1104విఘ్నేశ్వరుడు అంటే అందరి దేవుడు. ఒకరకంగా ముల్లోకాలకు అధిపతి. విఘ్నాదిపతిగా ఆది పూజలందుకునే వినాయకునికి చేసుకునే వేడుక అలా ఇలా ఉండదు. నిజానికి గణేశుడు అంటేనే ప్రకృతికి ప్రతిరూపం. వినాయకుని పూజల్లో ప్రతి భాగంలోనూ ప్రకృతి తత్వం ఉంటుంది. సకల మానవాళికి అద్భుత మైన సందేశం ఉంటుంది.

లంబోదరుడి పుట్టుక.. ముల్లోకాదిపత్యం.. చంద్రుని వేళాకోళం.. శ్రీకృష్ణునికి నీలాపనిందలు ఇలా వినాయక కథ ప్రతి భాగమూ మానవాళికి అన్యాపదేశంగా జాగ్రత్త నాయనలూ అని చెబుతుంది. ఇక వినాయకుని పూజా విధానం ప్రకృతిని ప్రేమించాల్సిన అవసరాన్ని.. ఇంకా చెప్పాలంటే ప్రకృతికి మనం ఇవ్వాల్సిన దైవ స్థానాన్ని మనకు ప్రభోదిస్తుంది.

7-Rahasyavaani-1104స్వయంగా గజ ముఖుడైన విఘ్నరాజు.. జంతువులతో మమేకమై జీవించాల్సిన సందేశం ఇస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే మానవుడూ ఒక జంతువే అనే తత్వాన్ని చెబుతుంది. ఎలుకను వాహనం చేసుకోవడం ద్వారా మనిషి తనలోని ఎటువంటి లక్షణాలు కలిగి ఉండకూడదో తేల్చి చెబుతుంది. (ఎలుకను క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీకగా పేర్కొంటారు).అటువంటి లక్షణాలు తొక్కి పడితేనే మానవుడు మహనీయుడు అవుతాడని చెబుతుంది.

ఇష్టమైనప్పటికీ ఏవిషయంలోనూ అతి పనిచేయదని లంబోదర ఉదంతంతో చెప్పే వినాయకుడు.. ఎదుటి వ్యక్తిలోని లోపాల్ని అవహేళన చేయకూడదనే నీతిని కూడా చందమామ పరాభవంతో స్పష్టంగా తెలియపరుస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే, ప్రకృతిలో లభించే ప్రతి వస్తువూ లేదా జీవీ పవిత్రమైనదే అనే విషయాన్ని పత్రితో చేసే పూజ ప్రభోదిస్తుంది.

గరికతో చేసే పూజే నాకు ఇష్టం అనే గౌరీ పుత్రుడు వివిధ రకాల పత్రులతో తనకు పూజలు జరిపించుకుంటాడు. ఆ పూజల్లో వాడే ప్రతి పత్రం ప్రకృతి మానవునికి ప్రసాదించిన ఒక ఔషధ అమృతం. మన సాంప్రదాయంలోని గొప్పతనం అదే. ప్రకృతితో మమేకమయ్యే ఎన్నో పర్వదినాలను అందించింది. అందులో వినాయక చవితి చాలా ముఖ్యమైనది.

4-Rahasyavaani-1104మానవుడిగా సర్వాదిపత్యం నాకుంది అనే గర్వాన్ని వీడి ఎన్నో జీవుల మధ్యలో మనమూ ఒక జీవి అనే విషయాన్ని చెప్పడమే వినాయక తత్త్వం. సాక్షాత్తూ శ్రీకృష్ణుడు అంతటి వాడే నాది అని వేసుకున్న ఒక హారంతో అపనిందల పాలయినట్టు వినాయక కథ చెబుతుంది. దైవస్వరూపంగా భావించే కృష్ణుడికే నీలాపనిందలు తప్పనపుడు సామాన్య మానవులం మనమెంత అనే జ్ఞానాన్ని ప్రభోదిస్తుంది వినాయక చవితి కథ.

5-Rahasyavaani-1104ఇక చివరిగా..సామాజిక సందేశాన్నిచ్చే పండుగ వినాయక చవితి. సృష్టిలో మానవులంతా ఒకటే అనే తత్త్వం ఈ నవరాత్రులలో ప్రతి హృదయంలోనూ స్పందిస్తుంది. వినాయకుని పందిరి వేయడం దగ్గరనుంచి నిమజ్జనం దాకా నవరాత్రులూ మానవాళిలోని కులమత స్థాయీ బేధాలను పక్కన పెట్టి అందరూ కలిసి తమ ఇంట్లో వేడుక చేసుకున్ననంత సంబరంగా ఈ వేడుక చేస్తారు.

6-Rahasyavaani-1104మొదటి పూజ అందుకున్నా.. సకల మానవాళిని తొమ్మిది రాత్రుల పాటు ఒక పందిరికిందకు తీసుకువచ్చినా.. ఆవిరి కుడుములు ఇష్టంగా అరగించినా.. అన్నీ జనాళికి శుభ సందేశాన్నిచ్చేవే. ఆలోచిస్తే.. ఆచరిస్తే వినాయక తత్త్వం సకల జీవరాశికీ ఆదర్శనీయమైన ఆచరణ మార్గాలు. వినాయకచవితి సందర్భంగా వచ్చే సామాజిక స్ఫూర్తి ప్రతి మనసులోనూ నిత్యం ఉండటమే వినాయకుని పూజకు అర్ధం పరమార్ధంగా నిలుస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR