Home Unknown facts గర్భగుడిలో వెలసిన సత్య స్తంభం అంటే ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది?

గర్భగుడిలో వెలసిన సత్య స్తంభం అంటే ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది?

0

మన దేశంలో ఉన్న పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే సత్య స్థంభం మరియు గర్భగుడిలో వెలసిన స్వామి వారు. మరి సత్య స్తంభం అంటే ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, పెద్దకళ్ళేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కర్ణాటక క్షేత్రం అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ ఆలయంలోని లింగం కర్కోటకము అనే సర్పరూపమున స్పటిక లింగంగా దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఆ స్వామివారు స్వయంభువుగా వెలశారని పురాణం. ఈ ఆలయంలో స్వామివారు శ్రీ దుర్గా నాగేశ్వరుడు, అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఈ స్వామివారిని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి అని అంటారు.

ఇక పురాణానికి వస్తే, ఎనిమిది మంది సర్పరాజులు శాపానికి గురై శాప విముక్తి కోసం ఒకవేదిక నిర్మించి నాలుగు పక్కల కదళీ వృక్షాలు ఉంచి శివుడిని ప్రతిష్టించి నిత్య పూజలు చేయగా వారి భక్తికి మెచ్చిన శివుడు కదళీ వృక్షాల నడుమ ఈ ప్రాంతం కదళీపురమనే నామంతో పుణ్యక్షేత్రం ఆవిర్భవిస్తుందని వరం ప్రసాదించాడు. ఆ కదళీపురమే నేడు కళ్లేపల్లిగా పిలుస్తున్నారని పురాణం.

ఈ ఆలయ తీర్దానికి, కాశి తీర్దానికి చాలా పోలికలు అనేవి ఉన్నాయి. కాశీలోని గంగ వలె ఇక్కడ ఉన్న కృష్ణానది కూడా ఉత్తరవాహిని. ఇంకా కాశీలో ఉన్నవిధంగానే ఇక్కడ కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఇక ఈ ఆలయంలో రెండు మీటర్ల ఎత్తు గల శిలాస్తంభం ఒకటి ఉంది. దీనినే సత్య స్తంభం అని అంటారు. ఆ స్తంభం మీద బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని లికించబడి ఉంది. ఈ స్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసి నిలుచున్నా వారికీ నోటినుండి అసత్యవాక్కు వెలువడదని ఒక నమ్మకం.

ఇక ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ సత్య స్తంభాన్ని దర్శించి ఆ తరువాత స్వామివారిని దర్శిస్తారు. ఈవిధంగా వెలసిన ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కార్తకమాసంలో, శివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.