దేశం ఇప్పుడిప్పుడే కరోనా రెండో వేవ్ నుంచి కోలుకుంటోంది. మరణాలతో పాటు కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. భారీ స్థాయిలో కేసులకు కారణమైన కరోనా డెల్టా వేరియంట్ నియంత్రణలోకి వస్తోంది. దాంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్ మ్యుటేషన్ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. ఈ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే దేశాన్ని గడగడలాడించిన డెల్టా నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.
రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని తాకవచ్చని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో కరోనా రెండో వేవ్ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్ కూడా మొదలుకావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (బీ.1.167.2)లో మ్యూటేషన్లు జరిగి డెల్టా ప్లస్ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. కరోనా వైరస్ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్ ప్రొటీన్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్’గా పిలుస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసిన వ్యాక్సిన్లలో చాలా వరకు ఈ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్‌లోనే మార్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కొత్త మ్యుటెంట్ వల్ల ప్రమాదం ఎంత వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, వ్యాక్సిన్లతో ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ఫస్ట వేవ్ చిన్నారులపై అంతగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్‌లో కేసులు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 81,967 మంది పిల్లలు కరోనా బారినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మూడో దశలో మాత్రం పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కొన్ని రోజులుగా నిపుణులు చెబుతున్నారు. కనీసం 2-3 నెలల వరకు థర్డ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దాదాపు 30 లక్షల మంది చిన్నారులకు కరోనా సోకే ప్రమాదముందని… వీరిలో 24 లక్షల మందికి ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 8వేల మందికి ఐసీయూలో చికిత్స అవసరం ఉండవచ్చని యోచిస్తున్నారు. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. దాని ప్రభావమేంటో తెలిసేందుకు ఒకటిరెండు నెలలు పడుతుందని, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండక తప్పదని మరికొందరు సూచిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, భారీగా గుమిగూడటం ఇలాగే కొనసాగితే.. మరో నెల రోజుల్లోనే మూడో వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
దేశంలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి, మళ్లీ కరోనా నిబంధనలను పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ప్రజల్లో అప్రమత్తత లేదని, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, ఇలాగే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే అయితే వచ్చే 6 నుండి 8 వారాల్లోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ నుండి తప్పించుకోవాలంటే కోవిడ్ తగిన ప్రవర్తనతో పాటుగా, సమూహాలుగా తిరగడాన్ని నివారించాలని ఆయన అభిప్రాయపడ్డారు.