ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భం దాల్చిన సమయంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఆ సమయంలో ఆమె శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల విడుదలలో వచ్చే తేడాలే. గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలంలో నడుము నొప్పి, కాళ్లు లాగడం, లాంటి సాధారణ సమస్యలు కనిపిస్తాయి.
కానీ కొంతమందిలో మాత్రం మైగ్రెయిన్(పార్శ్వపు నొప్పి) లాంటి తీవ్రమైన సమస్యలు ఎదురుకావచ్చు. తీవ్రంగా వచ్చే ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. కొంతమందిలో ఈ సమస్య కొంత సమయం తర్వాత తగ్గిపోతుంది. కొందరిలో మాత్రం సమస్య రోజురోజుకీ తీవ్రమైపోతుంది. అసలు ఈ మైగ్రెయిన్ రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పార్శ్వపు నొప్పి రావడానికి ఒక్కొక్కరిలోనూ ఒక్కో కారణం ఉంటుంది. కాబట్టి ఆ సమస్య దేనివల్ల వస్తుందో గుర్తిస్తే, దాన్నుంచి ఉపశమనం పొందడానికి మార్గం తెలుసుకోవచ్చు.
హార్మోన్ల అసమతౌల్యత:
మన శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ మైగ్రెయిన్ రావడానికి కారణమవుతుంది. అందుకే గర్భం దాల్చిన మహిళల్లో తరచూ మైగ్రెయిన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. సెరొటోనిన్ అనే మరో హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గులున్నప్పుడు సైతం గర్భిణిల్లో మైగ్రెయిన్ రావడానికి అవకాశాలున్నాయి.
కండరాల వ్యాకోచం:
కండరాల వ్యాకోచం గర్భిణిల్లో సాధారణంగా కనిపించేదే. ముఖ్యంగా గర్భంలో ఎదుగుతున్న బిడ్డకు అనుగుణంగా పొట్ట కండరాలు వ్యాకోచిస్తాయి. దీని కారణంగా కండరాలపై ఒత్తిడి పెరిగి మైగ్రెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది.
బీపీ పెరగడం:
గర్భిణిల్లో మైగ్రెయిన్ సమస్య రావడానికి ముఖ్యమైన కారణం బీపీ పెరిగిపోవడం. బీపీ అకస్మాత్తుగా పెరిగిపోవడం వల్ల మెదడుకి రక్త సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల తలనొప్పి చాలా ఎక్కువగా వస్తుంది. బీపీ పెరగడం, తలనొప్పి రావడం గర్భిణిల్లో గుర్రపువాతానికి(ప్రీఎక్లాంప్సియా) దారి తీయవచ్చు. కాబట్టి బీపీ పెరిగితే వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇతర కారణాలు :
వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, కాఫీ ఎక్కువ తాగడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి పడకపోవడం, చలి వాతావరణం, కాలుష్యం ఇవన్నీ గర్భిణుల్లో మైగ్రెయిన్ రావడానికి కారణమవుతాయి.