Health

జుట్టుకు కలర్ వేయడం వలన ఎదురయ్యే సమస్యలు

కొద్ది రోజుల క్రితం వారికి జుట్టుకి రంగేసుకోవాలంటే నామూషీగా ఫీల్ అయ్యేవారు. కానీ జుట్టుకి రంగు వేసుకోవడం అనేది ఇప్పుడు ఓ ఫ్యాషన్‌ అయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఫ్యాషన్‌ పేరుతో రకరకాల రంగులు జుట్టుకి అప్లయ్‌ చేయడం యువతకు అలవాటుగా మారింది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటంతో.. ఏం చేయాలో తెలియక సెలూన్‌కి వెళ్లి నచ్చిన రంగును జుట్టుకు పట్టించే వారు ఎక్కువైపోయారు.

ఇంకొంత మంది కుర్రకారు ఉన్న నల్ల జుట్టుని కూడా కాపడుకోకుండా స్టైలు, ఫ్యాషన్‌ కోసమని రకరకాల రంగుల్లో ముంచేస్తున్నారు తమ జుట్టుని. అయితే ట్రెండీ లుక్కుల కోసం జట్టుకు రంగులేస్తే కొన్ని రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. తలకి వేసుకునే రంగు కూడా రొమ్ము క్యాన్సర్‌ రావడానికి కారణం అవుతుందని వారు అంటున్నారు. ఈ రంగులలో ఉపయోగించే రసాయనాలు దీనికి ప్రధానకారణం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా యువతులు తలకి రంగు వేసుకోవడం వలన వారికి రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గతంలో గర్భనిరోధక సాధనాలు ఉపయోగించడం, లేటు వయస్సులో బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలు ఇవ్వక పోవడం వంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్‌ వచ్చేది. ఈ హెయిర్ డై లలో వాడే రసాయనాల వల్ల చర్మసంబంధమైన వ్యాధులు త్వరగా వచ్చే అవకాశముందని తాజా పరిశోధనలో తేలింది.

రంగు వేస్తే జుట్టు అప్పుడు నిగనిగలాడినప్పటికీ, తర్వాత ఉన్న జుట్టు ఊడిపోవడమే కాకుండా, జుట్టు పొడిబారి బలహీనంగా తయారవుతుంది. ఈ హెయిర్ డై ఎక్కువగా వాడడం వల్ల అస్తమా వ్యాధి బారిన పడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. అస్తమా ఉన్న వారు ఈ రసాయన రంగుల జోలికి పోవడమే ఉత్తమమనీ, ఇప్పటికే వాడుతున్నవారు వెంటనే మానేయడమే మంచిదంటున్నారు డాక్టర్లు.

అయితే తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నవారు తప్పని పరిస్థితుల్లో జుట్టుకు రంగు వేయాలనుకుంటే మాత్రం, సంబంధిత వైద్యులని కలిసాకే వాడటం మంచిది. జుట్టుకి వేసే రంగులు కూడా రసాయనాలతో కూడినవి కాకుండా నేచురల్‌ ప్రొడక్ట్స్ నే వాడాలి. ప్రకృతి సిద్ధమైన రంగులు వాడితే రెండు మూడు నెలల వరకూ తెల్ల జుట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ సహజ రంగుల వల్ల జుట్టు రంగు మారడంతో పాటు.. కుదుళ్లు బలంగా తయారౌతాయి. గోరింటాకు, అలోవెరా, ఉసిరి, మందార ఆకులు, మందార పువ్వులు, గుంటగలగర ఆకుల వంటి సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను నేరుగా గానీ నూనె ద్వారా గానీ జుట్టుకు పట్టించడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు.

నాచురల్ ప్రొడక్ట్స్ దొరకని వాళ్ళు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రసాయనాలు లేని షాంపులను ఎంపిక చేసుకోవాలి. జుట్టుకు వాడే ప్రొడక్ట్స్ లో సల్ఫేట్ ఎక్కువగా ఉండకూడదు. దీని వల్ల రంగు త్వరగా పోతుంది. తలకు రంగు వేసుకున్న వారు ఎక్కువ సార్లు తలస్నానం చేయకూడదు. ప్రోటీన్లు అధికంగా ఉండే కండీషనర్లు వాడడం వల్ల జుట్టుకు బలాన్నిస్తాయి. వీలైనంత వరకు జుట్టుకు రంగు వేసే వారు డ్రయర్లు వాడకపోవడం చాలా మంచిది. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు తలలో చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి.

 

Share

This website uses cookies.