Home Unknown facts కార్తికేయుణ్ణి దేవతల సేనాపతిగా నియమించడానికి కారణం తెలుసా ?

కార్తికేయుణ్ణి దేవతల సేనాపతిగా నియమించడానికి కారణం తెలుసా ?

0

కొన్ని సినిమాలలో చూసినప్పుడు లేదా ఏదైనా యుద్ధం గురించి విన్నప్పుడు యుద్ధం ఎలా జరుగుతుంది? ఎంత మంది సైన్యం పాల్గొన్నారు?? ఎలాంటి ఆయుధాలు వాడారు??? అని ఆసక్తిగా తెలుసుకుంటాం. అయితే సైన్యానికి ఒక సేనాపతి ఉంటాడు యుద్ధంలో సైన్యం మొత్తం సేనాపతి చెప్పిన విధంగా యుద్ధం చేస్తారు. మన పురాణాల్లో కూడా చాలా సార్లు దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధాలు జరిగాయి. దేవతలకు సేనాధిపతి కార్తికేయుడు. ఎవరిని పడితే వారిని సేనాపతిగా నియమించరు కదా! ఆ పదవికి కార్తికేయుణ్ణి నియమించడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కార్తికేయుణ్ణిశివుడికి పార్వతికి కళ్యాణం జరగడం వల్ల కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతిలో ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రంలో మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య సంవత్సరాలు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య సంవత్సరాలు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవిలో ప్రవేశించకుండా ఉండాలి.

శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారిలో గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలంలో నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షాలు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది.

అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయం మీద చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే.

వాళ్ళందరు కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకోసం వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేరు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పడకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షాలు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరించింది.

అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతాలను, అరణ్యాలను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు. తరువాత పార్వతి దేవి భూమివంక తిరిగి నీవు అనేక రూపాలను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకాల రూపాలు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మౌనంగాఉండి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగం మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుసరించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగలో విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగలో ప్రవేశపెట్టండి అని చెప్పారు దేవతలు.

అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగలో విడిచిపెట్టాడు. దేవతలందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మళ్ళీ కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదాల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది.

తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరం, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకాల ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకం అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకంలో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.

తరువాత అక్కడ జన్మించిన కుమారునికి పాలిచ్చి పోషించడానికి ఇంద్రుడు, మరుద్గనాలు మొదలైన దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించారు. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకున్నారు. పిమ్మట అప్పుడే పుట్టిన ఆ శిశువుకు పాలియ్యడం ప్రారంభించారు. అందువల్ల ఆ బాలునికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది.

గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందుకు దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలిచారు. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనాలలో సమృద్ధిగా పాలు ఏర్పడ్డాయి. ఆరు ముఖాలు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి పాలను పొందాడు. సుకుమార శరీరం కలిగి ఆ కుమారస్వామి ఒక రోజు మాత్రమే వారినుండి పాలుత్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమం చేత రాక్షస సైన్యాలను జయించాడు. దేవతలు అగ్నిదేవుని నాయకత్వంలో సాటిలేని తేజస్వియైన ఆ బాలుని దగ్గరికి చేరి, అతనిని ‘దేవతలసేనాపతి’గా అభిషేకించారు.

 

Exit mobile version