ఈ పాటలో వున్న ప్రత్యేకత ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ ఈ పాటను నా మీద చిత్రీకరించారు. ‘నేను నటుడ్ని కాను. నా ఆకారం కూడా తెరమీద కనిపించడానికి, ప్రేక్షకులు చూసి ఆనందించడానికి అనువుగా వుండదు కదా, నన్నెందుకు పెట్టు కున్నారు’ అని ఆయన్ని అడిగినప్పుడు, ఆయన ‘నీ ఆకారం, మీ నటన కాదు. మీరు పాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో ఆ నిప్పు తునకలూ, విచ్చుకత్తులూ ఏమైతే వున్నాయో అవి కావాలి. మీరు సినిమా కోసం రాయని పాటను నేను సినిమా కోసం తీసుకుంటున్నాను కాబట్టి మీరే పాడాలి’ అన్నారు. నేను ఆ సినిమాలో నటించిందేమీ లేదు. పైగా మామూలుగా ఎలా పాడుకుంటానో అలాగే తెర మీద పాడాను.
ఆ పాటలో నిరాశ కంటే ఒక విధమై న ఉక్రోషంతో పాటు ఒక చురక వుంది. అందులో కొన్ని భావాలు “ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం” అని “రామబాణం ఆర్పిందా, రావణకాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం” అనే పదాల ద్వారా సమాజాన్నీ, ఈ స్థితికి కారణం మరెవరో కాదు తమకి ఏం కావాలో తెలుసుకోని వాళ్లు ఇంకొకళ్లు తెలియజేసినా సరిగా స్పందించలేని వాళ్లు అయినా- సామాజికులలో ప్రతి ఒక్కరినీ కూడా నిగగ్దీసి అడగాలి అని భావించాను. సూచించాను. అలా అడగవలసినవాళ్లు కూడా పై వాళ్ళెవరో కాదు. ప్రతి ఒక్కరూ తనను తాను ప్రశ్నించుకోవాలి.
నిగ్గదీసి అడుగు, ఈ సిగ్గు లేని జనాన్ని అన్నప్పుడు, విపరీతంగా రియాక్ట్ అయి, నువెవ్వడివి ఈ సమాజాన్ని నిందించడానికి?
అని నన్ను నిలదీయడానికి బదులుగా అనేకమంది నన్ను అభినందించారు. అప్పుడు నాకనిపించింది. తమ యొక్క అసహాయత, ఉపేక్ష ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతి వ్యక్తి లోనూ , ఎంతో కొంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్లనే ఈ పాటను ప్రేక్షకులు మనస్ఫూర్తిగా అభినందించగలిగారు అని అనుకుంటూ వుంటాను.
– సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సిరివెన్నెల తరంగాలు