పూజలు, పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో మారేడు పత్రం ప్రధానమైంది, శ్రేష్ఠమైంది. మారేడు చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, లక్ష్మీ రూపంగా ఆరాధిస్తారు. మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును శివేష్ట అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు అంటే మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున వాటిని త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు.
బోలా శంకరుడిని బిల్వపత్రాలతో పూజిస్తే ఎంతో ప్రీతి చెందుతాడు. ఈ దళాలతో పూజించి కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేర్చుతాడు. పరమేశ్వరుడికి ఈ బిల్వ దళాలు అంటే ఎందుకంత ఇష్టం? వాటికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో? పరమేశ్వరుడికి ఇష్టమైన ఈ బిల్వదళాలతో శనీశ్వరుని పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శనికి బిల్వ దళాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
శివ పురాణం ప్రకారం బిల్వ దళాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు ఆ పరమశివుని ప్రతిరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఒకరోజు శనిదేవుడు పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసానికి చేరుకుని పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటారు.
శనిదేవుని విధి ధర్మమును పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు శనికి ఒక పరీక్ష పెడతాడు.
అందుకు పరమేశ్వరుడు శని నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించగా అందుకు శని మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి కైలాసం నుంచి వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు ఉదయం పరమేశ్వరుడు ఎవరికీ కనిపించకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బిల్వవృక్ష రూపమెత్తి దాక్కొని ఉంటాడు. పరమేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. ఎంత వెతికినా పరమేశ్వరుడు కనిపించరు.
ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయం కావడంతో పరమేశ్వరుడు బిల్వవృక్షం నుంచి బయటకు వస్తాడు. ఆ మరుక్షణమే శనీ పరమేశ్వరుడి ముందు ప్రత్యక్షమవుతాడు. శని నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు అడగగా, అందుకు శని నమస్కరించి నేను పట్టుకోవడం కారణంగానే కదా మీరు బిల్వవృక్ష రూపంగా రోజంతా ఉన్నారు అని చెబుతాడు.
శని విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన పరమేశ్వరుడు ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి ఉంచి నాతోనే నివసించి ఉన్నావు కాబట్టి ఈ క్షణం నుంచి నీవు శనీశ్వరుడుగా ప్రసిద్ధి చెందుతావని తెలియజేశారు.
అదేవిధంగా శని దోషం ఉన్నవారు బిల్వ పత్రాలతో నన్ను పూజించినచో వారికి శని దోష నివారణ జరుగుతుంది. ఈ విధంగా బిల్వపత్రాలతో నన్ను పూజించిన వారికి శని బాధించడని పరమేశ్వరుడు అభయమిచ్చాడు. అందువల్ల బిల్వ పత్రాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది.