Home Entertainment Remembering The Famous ‘Ghatotkacha’ Of Tollywood On His 100th Birth Anniversary

Remembering The Famous ‘Ghatotkacha’ Of Tollywood On His 100th Birth Anniversary

0

తెలుగు చిత్ర సీమలో విశ్వనట చక్రవర్తిగా మూడు దశాబ్దాలకు పైగా ఏలిన గొప్ప నటుడు యస్వీ రంగారావు గారు. ఎన్నో విభిన్న పాత్రలను చేసి ఆ పాత్రలకి తన నటనతో జీవం పోసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఆయన. ఇక నర్తన శాలలో తన నట విశ్వరూపాన్ని చూపెట్టి మన దేశంలోనే మొదటి అంతర్జాతీయ అవార్డ్ కైవసం చేసుకున్న నట తపస్వి మన యస్వీ రంగారావు గారు. మరి ఆ రోజుల్లోనే డిగ్రీ చదివి అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పని చేసే అయన సినిమా రంగం వైపు ఎలా వచ్చారు? అయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

S. V. Ranga Rao

కృష్ణాజిల్లా నూజివీడులో 1918 జులై 3వ తేదీ శ్రీ కోటేశ్వరనాయుడు శ్రీమతి లక్ష్మీ నరసాయామ్మలకు యస్వీ రంగారావు గారు జన్మించారు. ఈయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నటన అంటే ఎంతో ఇష్టం ఉన్న ఈయన డిగ్రీ పూర్తి చేసి అగ్నిమాపక సిబ్బందిలో ఉద్యోగం చేస్తూ రంగస్థలంలోకి ప్రవేశించారు. ఆ తరువాత షేక్స్‌పియర్‌ నాటకాలు అనేకం వేశారు. దానిలో మంచినటులుగా గుర్తింపు పొందిన తర్వాత సినిమాల్లో అవకాశం కోసం 1946వ సంవత్సరం మద్రాసు చేరారు. 1946వ సంవత్సరం వరూధుని అనే సినిమాతో అయన తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు. కానీ ఆ సినిమా పరాభవం అవ్వడంతో మనస్థాపానికి గురై మళ్ళి ఉద్యోగం చేసుకుంటూ దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా రంగం వైపు చూడలేదు.

తన మనసులో ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక మళ్ళి రెండు సంవత్సరాల తరువాత మద్రాస్ వచ్చి సినీ అవకాశాల కోసం ఒక సంవత్సరం పాటు అవకాశం కోసం ఎదురుచూస్తుండగా 1950వ సంవత్సరం పల్లెటూరి పిల్లలో చిన్నవేషం దొరికింది. దొరికింది చిన్న వేషమే అయినా తన నటనతో అందరిని మెప్పించి సినీ రంగంలో తన నట జీవితాన్ని కొనసాగించారు. ఒక కళాకారుడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని ఆయనలో ఉన్నాయి. ఆరడుగుల ఎత్తున గంభీరమైన రూపం గల అయన పాతాళభైరవి సినిమాలో దుష్టపాత్రల్లో ఆయన చూపిన అభినయం ఇప్పటికి ప్రతి ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయింది. ఆ సినిమాలో జై పాతాళభైరవి అంటూ అయన చెప్పే డైలాగ్ అనుసరించడం ఇప్పటికి ఎవరితరం కాదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.

ఇక అయన చేసిన రావణాసురుడు, కంసుడు, కీచకుడు వంటి పాత్రలు హీరోలకి ధీటుగా ఉంటూ ఆ పాత్రలో అయన ఒదిగిపోయిన తీరు ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేలా చేసాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే మాయాబజార్‌ చిత్రంలో ఘటోత్కచుని పాత్ర, భక్తప్రహ్లాదలోని హిరణ్యకసుపుని పాత్రలలో అయన నట విశ్వరూపం నా భూతొ నా భవిష్యత్. కేవలం విలన్ పాత్రలే కాకుండా అన్ని రకాల పాత్రలు పోషించిన ఘనత ఎస్వీ రంగారావు గారిది అని చెప్పాలి. అయన చేసిన మిస్సమ్మ, తోడికోడలు వంటి కొన్ని సినిమాలలో అయన నటన ప్రతి ప్రేక్షకుడిని కడుబూబ్బా నవ్విస్తాయి. ఇవే కాకుండా గుండమ్మకథ, తాత మనువడు వంటి కుటుంబ చిత్రాలలో అయన నటన కంట తడి పెట్టిస్తాయి.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే, మంచి దాన హృదయం కలిగిన ఈయన ఒక గొప్ప శివ భక్తుడు. ప్రతి రోజు ఉదయం తప్పనిసరిగా శివ పూజ చేశాకే అయన రోజు ప్రారంభం అయ్యేదని చెబుతారు. ఈయన ఇంటిలోని లైబ్రరీ లో ఎక్కువగా వివేకానంద పుస్తకాలే ఉంటాయి. ఈయన గొప్ప సహృదయం కలవడానికి నిదర్శనం, చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.

యస్వీ రంగారావు గారికి తెలుగు తో పాటు తమిళ్, ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వచ్చు. పాతాళభైరవి తమిలో వెర్షన్ లో కూడా ఈయనే నటించగా అటు తమిళ ప్రేక్షకుల ఆధారాభిమానాలు కూడా పొందారు. పౌరాణిక చిత్రాలలో, ఫాంటసీ చిత్రలలో, సాంఘిక చిత్రాల్లో ఇలా అది ఇది అంటూ ఏ బేధం లేకుండా ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో ఆ పాత్రలో జీవించేసారు. అయితే నటుడిగానే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా పలు చిత్రాలు నిర్మించి విజయాన్ని సాధించారు యస్వీ రంగారావు గారు. ఇలా విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ నటశేఖర, నటసింహ వంటి ఎన్నో బిరుదులు కైవసం చేసుకున్న అయన జులై 18, 1974వ సంవత్సరం గుండెపోటుతో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు.

నవరసాలన్నింటినీ తన పాత్రల స్వభావంలో సునాయాసంగా ఒలికించి, అందరి మన్ననలు పొందిన మహానటుడు ఎస్వీ రంగారావు గారు మన తెలుగు వాడై పుట్టడం తెలుగు సినిమా చేసుకున్న ఒక గొప్ప అదృష్టం.

Exit mobile version