Home Unknown facts తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు

తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు

0

మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం ఎందరో సమర యోధుల పోరాటం. అలాంటి వీరుల్లో ఒకరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర్యం అనేది సాయుధ పోరాటం వలనే వస్తుంది అని నమ్మిన అల్లూరి సీతారామరాజు 3 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. మరి అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల్లో ఎలా కలిశారు? బ్రిటిష్ అధికారులు అల్లూరి సీతారామరాజు ను హతమార్చడానికి ఎలాంటి కుట్ర పన్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లూరి సీతారామరాజు గారు 1897 వ సంవత్సరం జులై 4 వ తేదీన సూర్యనారాయణమ్మ , వెంకటరామరాజు దంపతులకి జన్మించారు. వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట అల్లూరి సీతారామరాజు జన్మించాడు. అయితే ఈయన అసలు పేరు శ్రీరామరాజు. సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును సీతారామరాజు గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాథ.

అయితే వీరి కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

యుద్ధ విద్యల్లో ఆరితేరిన రామరాజు ఆనాడు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనుల ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషు అధికారులపై విరుచుకపడ్డాడు.

గిరిజనుల కష్టాలను కడతేర్చేందుకు నడుంబిగించిన రామరాజు వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యం నూరిపోసి తెల్లదొరను ఎదిరించే స్థాయికి వారిని చైతన్య పరిచాడు. తమకు అండగా నిలిచిన అల్లూరిపై గిరిజనులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి తమ నాయకునిగా స్వీకరించారు. 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు. సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘనల్లో బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ వారిని ఎదిరించలేకపోయారు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు.

ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు నిశ్శబ్దం పాటించటంతో ఆయన మరణించాడనే పుకార్లు వ్యాపించాయి. అయితే సీతారామరాజు 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అయన అక్కడ ఉన్న చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు.

ఇలా అల్లూరి సీతారామరాజు పోరాటం ఉదృతంగా మారుతుండగా ఎలా అయినా అతడిని పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం 1924 వ సంవత్సరం ఏప్రిల్ 17 వ తేదీన మాన్యానికి కలెక్టరు గా రూథర్‌ ఫర్డ్ ని నియమించారు. ఈయన ఉద్యమాలను అణచి వేయడంలో నిపుణుడు. ఇక రూథర్‌ ఫర్డ్ మాన్యానికి వచ్చిన తరువాత మన్యం ప్రజలపైన కఠిమైన నిర్ణయాలు తీసుకుంటూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. అప్పటికి అల్లూరి సీతారామరాజు లొంగకపోవడంతో ఇప్పటికి నువ్వు ప్రభుత్వానికి లొంగకపోతే ప్రజలను విచక్షణా రహితంగా అందరిని కాల్చి చంపేస్తామని ప్రకటించడంతో తన కారణంగా మన్యం ప్రజలు అందరు ఇబ్బందులో పడకూడదని లొంగిపోవడానికి నిశ్చయించుకొని 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి అల్లూరి సీతారామరాజుని బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. అప్పుడు బ్రిటిష్ అధికారులపై నిప్పులు చెరుగుతున్న అల్లూరి సీతారామరాజుని ఒక చెట్టుకి కట్టేసి ఏ విచారణ చేయకుండానే దారుణంగా కాల్చి చంపేశారు.

ఈవిధంగా మన్యం ప్రజలపైన తెల్లదొరల ఆగడాలను చూసి సహించలేని అల్లూరి సీతారామరాజు గారు 3 సంవత్సరాలు సాయుధ పోరాటం చేసి కేవలం 27 సంవత్సరాల వయసులోనే వీర మరణం పొంది దేశ చరిత్రలో ఒక వీరుడిగా నిలిచిపోయారు.

Exit mobile version