ఒక అమ్మాయి తల్లి కాబోతుంది అని తెలిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషిస్తుంది. గర్భిణీ అని తెలిసినప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పెద్దవాళ్ళు ఉంటే కుంకుమపువ్వు కలిపిన పాలు ఇస్తారు. ఇలా తాగితే పిల్లలు తెల్లగా పుడతారని నమ్మకం. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. ఏది ఏమైనా రంగు, రుచి, వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే ఇది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం.
కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం కాశ్మీర్ లో మాత్రమే పండుతుంది. అయితే కుంకుమ పువ్వు స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడనుంచే మిగతా దేశాలకు విస్తరించింది.. అయినప్పటికీ అన్నిటిలోకి కాశ్మీర్ కేసరే నాణ్యమైంది. ఇది వంటలకు చక్కని రుచి, వాసన ఇస్తుంది. వాటితో పాటు కుంకుమ పువ్వులో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. అనేక అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది.
భారతీయులు తరచూ తాము చేసే అనేక రకాల వంటల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. ముఖ్యంగా పురుషులకు కుంకుమపువ్వు మంచి ఔషధం అని ఆయుర్వేద నిపుణులు అంటారు. కుంకుమ పువ్వుని పాలలో వేసుకొని తాగితే మాత్రమే కాదు, గ్రీన్ టీ, బ్లాక్ టీ లాగ కుంకుమ పువ్వు నీళ్లను తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. అవేమిటో అసలు కుంకుమ పువ్వు నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంకుమ పువ్వు నీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. దానికోసం ముందుగా 5 నుంచి 7 కుంకుమ పువ్వు పోగులను తీసుకుని గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. దీంతో కుంకుమ పువ్వు నీళ్లు తయారవుతాయి. వాటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. రోజూ ఉదయం పరగడుపున ఈ నీరును తాగాల్సి ఉంటుంది. దీంతో మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఎక్కువ కుంకుమ పువ్వు నీటిలో నానబెడితే.. మొదటికే మోసం వస్తుంది. రుచి మారి చేదెక్కుతుంది.
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగడం వల్ల శరీరానికి ఉత్సాహం వస్తుంది. చురుగ్గా పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. పడుకునే ముందు చిటికెడు కుంకుమపువ్వుని పాలల్లో కలుపుకుని తాగి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. దీంతో డిప్రెషన్ వంటివి కూడా తగ్గుతాయి. కొందరికి తీపి తినకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకని వారు రోజూ తీపి పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. ఇలా తినడం మంచిది కాదు. ఈ అలవాటును మానుకోవాలి. అందుకు గాను కుంకుమ పువ్వు నీళ్లను తాగాలి. దీని వల్ల తీపి పదార్థాలను తినాలనే యావ తగ్గుతుంది.
జీర్ణశక్తిని పెంచుతుంది. పేగు గోడలకు పూతలా అతుక్కుని ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ డిఫ్రసెంట్ గానూ పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల గుణాలున్న ఈ ఫైటోకెమికల్స్ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే ఆయుర్వేదంలో కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతుంటారు. రుతు స్రావం అధికంగా అయ్యే సమయంలో మహిళలు ఈ కుంకుమ పువ్వు నీళ్ల తాగడం వలన ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. హార్మోన్ల సమతుల్యం అవుతాయి. నెలసరిని క్రమబద్ధం చేస్తుంది.
కుంకుమ పువ్వు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల చర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం నివారించబడుతుంది. కుంకుమ పువ్వు నీళ్లను తాగడం వల్ల చర్మం తేమగా, మృదవుగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారికి కుంకుమ పువ్వు మేలు చేస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. దీంతో జుట్టు పెరుగుతుంది. ప్రాచీన రోమన్లు స్నానానికి, జుట్టుకి రంగు వేసుకునేందుకు కూడా దీన్ని ఎక్కువగా వాడేవారు.