అసలు సంతోషం అనేది ఎలా వస్తుంది..! సంతోషకరమైన జీవితం అంటే ఏమిటి..? చాలా మంది సంతోషాన్ని ఏదో ఒక అంశంలో వెదుక్కుంటారు. కానీ అసలు నిజంగా సంతోషకరమైన జీవితం అంటే అర్థం వేరే వస్తుంది. ఎలాంటి చీకు చింతా లేకుండా, ఏ కష్టం వచ్చినా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ, లక్ష్య సాధన దిశగా పయనిస్తూ, నీతి నిజాయితీలతో కూడుకుని జీవించేదే సంతృప్తికరమైన, ఆనందకరమైన జీవితం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇదే కాదు, మనం ఎవరమైనా సంతోషకరమైన జీవితం గడపాలంటే అందు కోసం తెలుసుకోవాల్సిన పలు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొన్ని వదిలేయాల్సినవి ఉన్నాయి.. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
మనిషి ఎల్లపుడూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా నాలుగు విషయాలని వదిలేయాల్సిందే అని చెప్తున్నారు పండితులు.. వాటిలో మొదటగా వదిలేయాల్సినది.. ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోవడం..చాలా మందికి ఎవరి గొప్పలు వారే స్వయంగా చెప్పుకోవడం, తమను తామే పొగుడుకోవడం అలవాటు. కానీ దీన్ని అస్సలు పాటించకూడదట. అలా పాటిస్తే జీవితంలో ఏదో ఒక రోజు పెద్ద ఎదురు దెబ్బ తింటారట. కొన్ని సందర్భాల్లో పతనమై పోతారట కూడా. కనుక ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోకూడదు.
ఇక రెండవది..ఎదుటి వారి తప్పులను ఎంచడం..కొందరు ఎల్లప్పుడూ తమ తప్పులను కాకుండా ఎదుటి వారి తప్పులను వెతికి పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారు కూడా జీవితంలో పైకి రాలేరట. సంతోషకరమైన జీవితం గడపలేరట. తమ తప్పులను మాత్రమే తెలుసుకుని ముందుకు సాగే వారే సంతోషకరంగా ఉంటారట.
ఇక మూడవది మత గ్రంథాలను తక్కువగా చూడడం…చాలా మంది తెలిసీ తెలియని జ్ఞానంతో మత గ్రంథాలను తక్కువ చేసి చూస్తుంటారు. వాటిని కించ పరుస్తుంటారు. కానీ అలా చేయకూడదట. అది వారికి సంతోషాన్ని ఇవ్వదట. ఎందుకంటే అలాంటి మతపరమైన గ్రంధాలలో మనిషి జీవన గమనానికి, సమస్యల్ని ఎదుర్కొని నిలబడే ధైర్యం పెంపొందించే ఎన్నో సూత్రాలు చెప్పబడతాయంట.. ఇక నాల్గవది.. నాస్తికులుగా ఉండడం…నాస్తికులంటే కేవలం దైవం విషయంలో మాత్రమే కాదు, శాస్త్ర విజ్ఞాన విషయంలో కూడా. అలాంటి జ్ఞానాలను నమ్మకుండా ఉండే వారు జీవితంలో ఆనందంగా ఉండలేరట.
ఈ నాల్గింటిని వదిలేస్తే ప్రతి మనిషి తన జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారట..