Home Unknown facts Sarpayagam ye pradeshamlo jarigindho thelusa?

Sarpayagam ye pradeshamlo jarigindho thelusa?

0

మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. మరి సంస్థ నాగజాతిని వధించడానికి యాగం ఎందుకు జరిగింది ? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రస్తుతం ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు గొప్ప ధర్మాత్ముడు, చక్కటి పరిపాలకుడుగా ఉండెను. వేటయందు మిక్కుటమైన ఆసక్తి కలిగియుండెను. ఒకరోజు వేట నిమిత్తము అడవుల్లోకి వెళ్లిన పరీక్షిత్తు ఒక జింకను వేటాడెను. ఆ జింక పరీక్షిత్తుకు దొరకకుండా తప్పించుకు పోయెను. వేటాడి, వేటాడి అలసి, సొలసి పోయిన పరీక్షిత్తుకు మౌనవ్రతంలో ఉన్న రుషి తారసపడెను. ఆ రుషిని ప్రశ్నించగా అతడేమి జవాబు చెప్పలేదు.దీంతో ఆగ్రహించిన రాజు అచ్చట చచ్చిపడి వున్న ఒక పామును ఆ రుషి భుజంపై వేసి వెడలిపోయెను.ఈ మౌని రుషి కుమారుడైన శృంగి విషయం తెలుసు కొని అత్యంత కోపోద్రేకముతో పరీక్షిత్తు రాజును ఇలా శపించెను. ఏడు రోజులలోగా తక్షకునిచే కాటువేయబడి, రాజు చనిపోవును అని. ఇక సమాచారం తెలుసుకున్న పరీక్షిత్తు తన రక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కశ్యపున్ని కూడా పిలువనంపెను.ఏడవ రోజు తక్షకుడు బయలుదేరి మార్గమధ్యములో వడివడిగా వెళ్లుచున్న కశ్యపున్ని చూసి, బ్రహ్మణోత్తమా! ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగెను. తక్షకునిచే కాటు వేయబడబోవుచున్న పరీక్షిత్తు రాజ ప్రాసాదమునకు వెళ్ళుచున్నాను అనెను. నేనే తక్షకున్ని, నా వేటు నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, చూడుము అని ఒక మహా వృక్షమును కాటు వేయగా అది భస్మీపటలమయ్యెను. వెంటనే కశ్యపుడు తన విద్యాబలముచే ఆ వృక్షమును ఎప్పటి వలె నవనవోన్మేషముగా చేసెను. ఆశ్చర్యపోయిన తక్షకుడు ఆ కశ్యపున్ని ప్రలోభ పెట్టసాగెను. నేను ఎలాగు ధనమును ఆశించి రాజు వద్దకు వెళ్లుచున్నాను. ఆ ధనము నీవిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు అని కావలసిన ధనము తక్షకుని నుంచి తీసికొని కశ్యపుడు వెళ్లిపోయెను. ఇలా పరీక్షిత్తు మహారాజు పాము కాటు కారణంగా మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన సర్ప జాతిపై జనమేజయ మహారాజు ఆగ్రహావేశాలతో రగిలిపోతాడు. సర్పజాతిని సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. సర్పజాతిపై గల పగను చల్లార్చుకోవడం కోసం, సర్పయాగాన్ని చేస్తాడు. మంత్ర ప్రభావం వలన అనేక సర్పజాతులు ఈ యాగానికి ఆహుతై పోతాయి. అలాంటి సర్పయాగం జరిగింది ఎక్కడో కాదు, మెదక్ జిల్లా పరిధిలోని ‘ఏడుపాయల’లోనని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. మంజీరానది ఇక్కడ ఏడుపాయలుగా ప్రవహిస్తూ వుంటుంది. ‘ఏడుపాయల’ అనేక విశేషాలకు మహిమలకు నెలవుగా భక్తులు భావిస్తుంటారు. ప్రశాంతంగా కనిపించే ఈ ప్రదేశం, శివరాత్రి సందర్భంగా జరిగే జాతరతో సందడిగా కనిపిస్తుంది. దేవతలు, మహర్షులు, మహారాజులు, సర్పజాతులకు సంబంధించిన విశేషాలతో ఈ క్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంటుంది. ఇక్కడి ‘ఎల్లాపూర్’ గ్రామ సమీపంలో గల ‘మంజీరా నది’ ఇసుక మేటలు తవ్వితే, ఇప్పటికీ అడుగు నుంచి బూడిద వంటి పదార్ధం బయటపడుతూ ఉంటుందట. సర్పయాగానికి ఆహుతై పోయిన పాముల బూడిద ఇదేనని వాళ్లు చెబుతుంటారు.ఈ కారణంగానే జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని వాళ్లు బలంగా చెబుతుంటారు.

Exit mobile version