దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఏదో ఒక విశేషం ఉండటం మనం చూస్తుంటే ఉంటాము. అయితే ఇక్కడి ప్రాచీన శివాలయానికి కూడా ఒక విశేషం ఉంది. ప్రతి రోజు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఆలయానికి క్రౌంచ పక్షులు వస్తుంటాయి. అవి వచ్చి అక్కడ ఉన్న పాయసం కొంచం తాగి మళ్ళీ తిరిగి మరుసటి రోజు అదే సమయానికి రావడం ఈ ఆలయ విశేషం. మరి ఆ పక్షలు ఎందుకు వస్తుంటాయి? అవి రావడం వెనుక ఉన్న అసలు పురాణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా, చెన్నైకు దక్షిణ దిక్కుగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురానికి దగ్గరలో తిరుక్కళికుండ్రం అనే పట్టణంలో ఒక కొండపైన వేదగిరీశ్వర్ అనే ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని డేగల దేవాలయం అని కూడా అంటారు. ఈ కొండ క్రింది భాగంలో మరొక ఆలయం ఉంది. అయితే కొండపైన ఉన్న ఆలయంలో శివుడు కొలువై ఉండగా, దిగువన ఉన్న ఆలయంలో పార్వతీదేవి భక్తులకి దర్శనం ఇస్తుంది.
ఇక్కడ ఆలయంలో ఆశ్చర్యానికి గురి చేసే ఒక వింత ఆచారం నేటికీ ఉంది. అయితే ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి రెండు క్రౌంచ పక్షులు వచ్చి ఆలయ ఆవరణలో వాలుతాయి. ఈ రెండు పక్షులు కూడా కలియుగానికి ముందు ఋషులని, శాపానికి గురై కాశీలో జీవిస్తూ నిత్యం రామేశ్వరం వెళ్లి వస్తుంటారని, మధ్యలో ఆహారం కోసం నిత్యం 12 గంటలకు ఇక్కడికి చేరుతాయని చెబుతున్నారు.
అయితే ఆలయ పూజారి ఒక పెద్ద పాత్రలో ప్రసాదం లాంటి పాయసం తయారుచేసుకొని వచ్చి గుడి పక్కన ఉన్న ఆవరణలో ఒక చోట కూర్చుంటాడు. ఇక సరిగ్గా 12 గంటల సమయంలో కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. వాటిని చుసిన అర్చకుడు ఒక పళ్లెం మీద మోత మ్రోగిస్తూ ఆ పక్షులకి సంకేతాన్ని తెలియచేస్తాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న పక్షులలో రెండు పక్షులు అతని ముందు వాల్తాయి. అప్పుడు ఆ పూజారి వద్ద ఉన్న పాత్రలోని పాయసాన్ని కొంత ఆ రాతిపైన ఉంచుతాడు. ఆ పక్షులు ఆ పాయసాన్ని కొంచం తిని వెంటనే ఎగిరిపోతాయి.
ఇక ఆ పూజారి ఆ పాత్ర నిండా ఉన్న పాయసాన్ని అక్కడకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతాడు. దీనినే పక్షితీర్థం అనే పేరుతో భక్తులు ఈ దృశ్యాన్ని రోజు సందర్శిస్తుంటారు. అయితే ఈ పక్షులు ప్రతి రోజు ఇక్కడికి కచ్చితంగా వస్తాయి. అయితే ఈ దృశ్యాన్ని చూడటానికి వచ్చిన వారిలో పాపాత్ములు ఉంటె ఆ రోజు ఆ పక్షులు అక్కడికి రావని చెబుతున్నారు.
ప్రతి రోజు జరిగే ఈ దృశ్యాన్ని చూడటానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.