ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, శివుడు పార్వతీదేవి చేయిపట్టుకుని కొలువై ఉన్న విగ్రహమూర్తి కలదు. అయితే త్వరగా పెళ్లి జరగడం కోసం భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావురు జిల్లాలో కుట్టాలం రైల్వే స్టేషన్ కు సుమారు 6 కి.మీ. దూరంలో కావేరి నదికి ఉత్తర దిక్కున తిరుమనంచేరి అనే ప్రాంతంలో కల్యాణ సుందర్ అనే పురాతన ఆలయం నిర్మించబడి ఉంది. ఇది చాలా ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం. భక్తులు తమ సంతానానికి త్వరగా కళ్యాణం జరగాలని కోరుకునే తల్లితండ్రులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను కొలుస్తారు. ఈ పవిత్ర స్థలంలోనే శివుడికి వివాహం జరిగిన ప్రదేశంగా భక్తులు పూజిస్తారు. తిరుమనం అంటే తమిళంలో వివాహం అని అర్ధం. పెళ్ళికాబోయే వధూవరులు వివాహం చాలా కాలం నుండి కానివారు త్వరగా కళ్యాణం జరగాలని కోరుకునేవారు ఈ క్షేత్రాన్ని దర్శించి కల్యాణ సుందరమూర్తికి, అయన దేవేరైన కోకిలంబాల్ ని పుష్పాలతో అలంకరించి పూజిస్తారు. వారి నమ్మకం ప్రకారం వారి కోర్కెలు నెరవేరుతాయి. ఈవిధంగా కొత్తగా పెళ్లి కోరికలు నెరవేరిన భక్తులు ఈ ఆలయానికి వచ్చి కళ్యాణసుందర మూర్తిని, ఆ దేవిని సేవిస్తారు.
అంతేకాకుండా జాతకరీత్యా రాహుగ్రహ పీడ కలిగిన వారిని పూజలకు అనుమతిస్తారు. నవగ్రహ దేవతలలో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూపుడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఆలయం చుట్టూ కందకాలు తవ్వబడి ఉన్నాయి. అందులోకి సప్తసాగరులలో ఉన్న నీరు చేరి పవిత్రమైన పుష్కరణిగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఈ విధంగా శివుడు, పార్వతీదేవి దర్శనమిచ్చే ఈ అధ్బుత ఆలయానికి పెళ్లి కావాల్సిన భక్తులు ఎక్కువగా వస్తూ ఆ కళ్యాణసుందర మూర్తిని త్వరగా పెళ్లి జరిపించమని ప్రార్థిస్తుంటారు.