Home Unknown facts శివుడు పశుపతిగా నేపాల్ లో వెలసిన అద్భుత ఆలయం

శివుడు పశుపతిగా నేపాల్ లో వెలసిన అద్భుత ఆలయం

0

పరమశివుడు చతుర్ముఖుడిగా దర్శనం ఇస్తున్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శివాలయం అని చెబుతారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారనేదానికీ కచ్చితమైన ఆధారాలు అంటూ ఏమి లేవు. పురాణాల ప్రకారం శివుడు జింక రూపంలో ఇక్కడ సంచరించాడని చెబుతారు. మరి ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకర విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శివుడు ఎలా వెలిశాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

famous and sacred Pashupatinath Temple

నేపాల్ దేశంలో ఖాట్మండు నగరంలో బాగమతి నది ఒడ్డున పశుపతినాథ్ దేవాలయం ఉంది. ఇక్కడ శివుడిని పశుపతిగా ఆరాధిస్తారు. ఈ ఆలయంలోకి కేవలం హిందువలకి మాత్రమే ప్రవేశం ఉంది. ఇంకా గర్భాలయంలో ఉన్న స్వామివారి మూలవిరాట్టుని కేవలం అక్కడి నలుగురు అర్చకులు మాత్రమే ముట్టుకోవడానికి అనుమతి ఉంది. ఈ ఆలయం నేపాల్ లో ఉన్నపటికీ ఇక్కడ అర్చకులుగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు ఉంటారు. ఇక్కడ శంకరాచార్యుల వారు సాంప్రదాయాలను ప్రారంభించారని చెబుతారు. అయితే ఆయనే ఇక్కడ మనుషుల్ని, జంతువులని బలివ్వడం నిషేదించాడని చెబుతారు.

ఇక పురాణానికి వస్తే, గోవు ఇతిహాసం ప్రకారం శివుడూ ఈ ప్రాంతంలో గోవు రూపంలో విహరిస్తుండగా ఆ స్వామిని శివుడి స్వరూపంలో చూడాలని భావించి జింక కొమ్ముని పట్టుకోగా ఆ కొమ్ము విరిగి నేల పైన పడిపోయింది. అలా కొన్ని సంవత్సరాలకు ఆ విరిగిన కొమ్ము లింగంగా మారగా ఒక ఆవు అక్కడ లింగాన్ని గుర్తించి రోజు పాలు ఇస్తుండగా అది గమనించిన పశువుల కాపరి అక్కడ తవ్వి చూడగా శివలింగం కనిపించగా దానిని అక్కడే ప్రతిష్టించాడని పురాణం.

ఇది ఇలా ఉంటె, నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం, ఈ ప్రదేశంలో శివపార్వతులు రాగా పార్వతి సమేతంగా వచ్చిన శివుడు జింక రూపంలో ఇక్కడ నిద్రిస్తుండగా దేవతలు శివుడిని ఈ ప్రాంతం నుండి కాశీకి తీసుకువెళ్లాలని భావించి జింకని లాగినప్పుడు జింక కొమ్ము నాలుగు ముక్కలుగా అయినదని ఆ నాలుగు ముక్కలే ఇప్పుడు పూజిస్తున్న చతుర్ముఖ లింగం అని చెబుతారు.

ఈ ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయం పైకప్పు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. ఆలయం పశ్చిమ ద్వారం వద్ద ఉన్న నంది విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో బంగారు కవచంతో ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు చేసే పూజారులను భట్ట అని పిలుస్తారు. ఇంకా ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తుంటారు. ఇక ఈ ఆలయంలో పూజారులుగా దక్షిణ భారతదేశానికి చెందిన అర్చకులు మాత్రమే ఎందుకు ఉంటారంటే, నేపాల్ దేశానికి రాజు ఉంటాడు. వారి సంప్రదాయం ప్రకారం రాజు చనిపోతే శివ పూజలు చేయడానికి వారికీ అర్హత అనేది ఉండదు. ఎందుకంటే వారు వారి రాజుని తండ్రిలా భావిస్తారు. ఇలా అయితే శివుడికి నిత్య పూజలు అనేవి జరుగవు. అందుకే ఆ పరమశివుడికి నిత్య పూజలు జరగాలని భావించిన నేపాల్ వారు అర్చకులుగా దక్షిణ భారతదేశానికి చెందిన అర్చకులకు ఆ అవకాశాన్ని ఇచ్చారట. ఇంకా ఇక్కడి ప్రధాన అర్చకుడు కేవలం ఒక్క నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారిగా ఉంటాడు.

ఈ ఆలయంలో దర్శనీయ స్థలాలు, చతుర్ముఖ స్వామివారు, ఆర్యఘాట్, గౌరీ ఘాట్, బ్రహ్మ దేవాలయం ఉన్నవి. ఇక్కడ ఉన్న ఆర్య ఘాట్ లో స్మశాన వాటిక ఉంది. ఇక ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారనేదానికి సరైన ఆధారాలు లేనప్పటికీ క్రీ.శ.753 లో రాజు శుశూపదేవ ఈ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చు అని చెబుతారు. ఈ విషయం పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది. ఇక ఆ తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయాన్ని పునఃనిర్మించాడని తెలియుచున్నది.

శివుడిని పశుపతిగా కొలిచే ఈ ఆలయంలో గ్రహణం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి బాగమతి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని ఆరాదిస్తే పుణ్యం వస్తుందని, నేపాలీ దేశస్థులు కూడా ఈ ఆలయాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ పవిత్ర ఆలయానికి శివరాత్రి సమయంలో కొన్ని వేలసంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.

Exit mobile version