శివుడికి, లింగ రూపంలోనే ఎక్కువగా ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. అయితే శివుడి యొక్క రూపంలో ఒక్కోదానికి ఒక్కో అర్ధం అనేది ఉంది. అయితే అసలు పులిచర్మం అయన ధరించడానికి గల కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. పరమశివుడు పులి చర్మాన్ని ధరించి, పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్ధుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అనే దానికి శివపురాణంలో ఒక పురాణ కథ ఉన్నది.
పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి. స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగాడుతూ ఉండే వాడు. ఒక రోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు, పరమేశ్వరుని సౌందర్యానికీ, ఆయన తేజస్సుకీ కళ్ళు తిప్పుకోలేకపోయారు. వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది. ఆయననే తలుచుకుంటూ ఇంటి పనులు కూడా సరిగా చేసేవారు కాదు.