Home Unknown facts Shivudu , vishnuvu pakka pakkane velisina punyakshetram

Shivudu , vishnuvu pakka pakkane velisina punyakshetram

0

పరమశివుడు, విష్ణువుకి దేశంలో అనేక ఆలయాలు ఉన్నవి. ఇక్కడి విశేషం ఏంటి అంటే ఇద్దరికీ పక్క పక్కనే ఆలయాలు ఉన్నవి. ఇవి చాలా ప్రాచీన ఆలయాలుగా ప్రసిద్దిచెందినవి. మరి ఆ ఆలయాలు ఎందుకు అలా పక్క పక్కన వెలిసాయి? ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. shivuduఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో కేశవస్వామి పేటలో, కొండకు దిగువన పక్క పక్కనే శ్రీ కాశి విశ్వేశ్వరస్వామి ఆలయం, చెన్నకేశవ స్వామి వారి ఆలయాలు నిర్మింపబడి ఉన్నవి. పూర్వము ఈ ప్రాంతం పరిపాలించిన ‘ఒంగోలు’ రాజు అయినా రామచంద్రరాజు కాలంలో ఒంగోలు కొండపై 1729లో ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. అయితే వెంకటగిరి రాజులతో వైరం ఉండడంతో ఎప్పటికైనా వారి వల్ల తమకు ముప్పు తప్పదనే భావంతో ఒంగోలు రాజులు ప్రసన్న చెన్నకేశవస్వామివారి ఆలయాన్ని కొండపై నిర్మించి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతారు. ఈ ఆలయం అద్భుత శిల్పకళా సంపదతో, సుందర కుడ్యచిత్రాలతో భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీనివాస కల్యాణంతోపాటు పలు ఘట్టాలను గోడలపై అద్భుత శిల్పాలుగా మలచారు, కప్పుపై చిత్రించిన వటపత్రశాయి చిత్రం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఒంగోలు రాజుల కొలువులో మంత్రిగా ఉన్న వంకాయలపాటి వీరన్న పంతులు శివభక్తుడు కావడంతో ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం చెంతనే కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. రాజులపట్ల గౌరవం వల్ల ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయ రాజగోపురంకంటే కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ రాజగోపురం కొంత తక్కువగా ఉండేలా నిర్మించారు. ఆలయంలోని నంది విగ్రహం రాజసాన్ని ఒలకబోస్తూ పరమేశ్వరునివైపే చూస్తూ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయంలోని నటరాజ చిత్రంతోపాటు అన్నపూర్ణాదేవి చిత్రం, పార్వతి తపస్సువంటి చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో గల నాగలింగ వృక్షం పువ్వులోపల ఉండే బుడిపె తెల్లగా శివలింగం ఆకారంలో ఉండి నాగపడిగ పట్టినట్లుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, కుమారస్వామి ఉపాలయాలు ఉన్నాయి. ఇచట నిత్య పూజలతో పాటు, విశేష పూజలు కూడా నిర్వహిస్తారు. శరన్నవరాత్రులలో స్వామివార్లను రోజుకొక అలంకారంతో అలంకరించి అత్యంత వైభవముగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక మాసం నందు, శివరాత్రికి శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో, ధనుర్మాసము, శ్రీరామనవమి మొదలైన వైష్ణవ పర్వదినములందు శ్రీ చెన్నకేశవస్వామి వారి ఆలయంలో విశేష పూజలతో పాటు, ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తారు. ఈవిధంగా పక్క పక్కనే వెలసిన శివకేశవులను దర్శించుకోవడానికి స్థానిక భక్తులు ఎక్కువగా వస్తుంటారు.

Exit mobile version